Kids

గుజరాత్ చిన్నారికి HMPV-NewsRoundup-Jan 11 2025

గుజరాత్ చిన్నారికి HMPV-NewsRoundup-Jan 11 2025

* యావత్‌ ప్రపంచం అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నా.. పాక్‌ (Pakistan) ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. అభివృద్ధిని అటక మీదపెట్టి.. భారత్‌ను (India) ఎలా దెబ్బతీయాలా? అని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. సమయం దొరికినప్పుడల్లా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడమే పనిగా పెట్టుకున్న పాక్‌.. తాజాగా భారత్‌, పీవోకే (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌) సరిహద్దు నియంత్రణ రేఖ (Loc) వెంబడి రక్షణ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుతోంది. కంచె వెంబడి పెద్ద సంఖ్యలో యాంటీ పర్సనల్‌ మైన్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ కమాండోలు, మాక్‌ ఫైరింగ్‌ యూనిట్లను సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం.

* ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం పదవీ విరమణ వయసు 58గా ఉండగా.. దాన్ని 60కు పెంచింది. ఈ విషయాన్ని కంపెనీ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలియజేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మార్పు భారత్‌లోని అన్ని కాగ్నిజెంట్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని తెలుస్తోంది.

* ఆస్ట్రేలియా పర్యటనలో (AUS vs IND) భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. సెంచరీ చేసినప్పటికీ నిలకడలేని ఆటతీరు ప్రదర్శించాడు. ఆఫ్‌సైడ్ వెళ్లే బంతులను వెంటాడి పెవిలియన్‌కు చేరాడు. క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ నుంచి రవిశాస్త్రితో సహా మాజీలు చాలాసార్లు విరాట్‌కు సూచనలు ఇచ్చారు. సచిన్‌లా ఆఫ్‌సైడ్‌ బంతులను వదిలేయాలని చెప్పినా.. కోహ్లీ మాత్రం పాటించలేదు. దీంతో సూచనలను తీసుకొనేందుకు విరాట్ (Virat Kohli) సిద్ధంగా ఉండడని సోషల్ మీడియాలో కామెంట్లు రావడం మొదలైంది. వీటిపై భారత మాజీ కోచ్ భరత్‌ అరుణ్ స్పందించాడు. కోహ్లీకి సూచనలు ఇస్తే తప్పకుండా ఆచరిస్తాడని.. ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పమని కోరుతాడని వెల్లడించాడు. పట్టించుకోకపోవడమనేది ఉండదని వ్యాఖ్యానించాడు.

* సంక్రాంతి కానుకగా పెండింగ్‌ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్‌ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్నస్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై సీఎం ప్రధానంగా చర్చించారు. సమీక్ష అనంతరం పలు పెండింగ్‌ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.

* శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు కామేపల్లి తులసిబాబు వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీలో న్యాయ సలహాదారుగా కొన్నాళ్లు పనిచేసినట్టు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది. సీఐడీ నోటిఫికేషన్‌ చూసి దరఖాస్తు చేశానని, ప్రతిభ ఆధారంగానే ఆ పోస్టు దక్కించుకున్నానని విచారణలో భాగంగా ఆయన చెప్పారు. బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరుకు చెందిన తులసిబాబు వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పటి సీఐడీ బాస్‌ పీవీ సునీల్‌కుమార్‌కు కాకినాడకు చెందిన స్నేహితుడొకరు తులసిబాబును పరిచయం చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సునీల్‌కుమార్‌తో సన్నిహితంగా ఉన్న తులసి రాకపోకలన్నీ పోలీసు వాహనాల్లోనే సాగేవని, తరచు సీఐడీ బాస్‌తో కలిసి ఉండేవారన్న ఆరోపణలు ఉన్నాయి.

* టాలీవుడ్ అగ్ర‌ క‌థానాయ‌కుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త‌ ఏడాది దేవ‌ర సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను అందుకున్నాడు తార‌క్‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అయితే ఈ సినిమా అనంత‌రం క‌న్న‌డ స్టార్ ద‌ర్శ‌కుడు కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (PrashanthNeel)తో తార‌క్ సినిమా చేయ‌బోతున్నాడు. #NTRNeel గా రానున్న ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇప్ప‌టికే పూజ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా ఎప్పుడు అప్‌డేట్‌లు వ‌స్తాయా అని అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు.

* యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండా రాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గూండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని విమర్శించారు. దాడులు, గూండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందని అన్నారు.

* గుజరాత్‌లో మరో చిన్నారికి హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్‌ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. జనవరి 6న అహ్మదాబాద్‌కు చెందిన తొమ్మిది నెలల బాబుకు జలుబు, దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆ చిన్నారిని అడ్మిట్‌ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. ఆ చిన్నారి విదేశాల్లో ప్రయాణించలేదని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. కాగా, గుజరాత్‌లో వారం రోజుల్లో ఈ వైరస్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరిందని వైద్యాధికారులు తెలిపారు. జనవరి 10న సబర్కాంత జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి హెచ్ఎమ్‌పీవీ సోకిందని తెలిపారు. రాష్ట్రంలో మూడవ కేసుగా అధికారులు పేర్కొన్నారు. జనవరి 9న అహ్మదాబాద్‌లో 80 ఏళ్ల వృద్ధుడికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్‌గా తేలింది. ఆస్తమాతో బాధపడుతున్న ఆ రోగి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z