Health

HMPV కేసులు తగ్గుతున్నాయి-NewsRoundup-Jan 12 2025

HMPV కేసులు తగ్గుతున్నాయి-NewsRoundup-Jan 12 2025

* హైడ్రా ప్రజావాణి కార్యక్రమం సోమవారం (జనవరి 13న) ఉండదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా ప్రజావాణిని నిర్వహించలేకపోతున్నామని రంగనాథ్‌ ప్రకటించారు. ప్రభుత్వ సెలవురోజుల్లో హైడ్రా ప్రజావాణి ఉండదని ఇది వరకే ప్రకటించిన రంగనాథ్‌.. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు.

* సంక్రాంతి (Makar Sankranti) సందర్భంగా హైదరాబాద్‌ (Hyderabad) నగర వాసులు సొంతూళ్లకు భారీగా తరలి వెళ్తున్నారు. గత రెండు మూడు రోజులుగా రద్దీ కొనసాగుతోంది. ఓ వైపు రైళ్లు కిక్కిరిసిపోవడం, ప్రైవేటు వాహనదారులు ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు ఆర్టీసీ బాటపడుతున్నారు. దీంతో ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 6,432 బస్సులను నడపాలని నిర్ణయించిన టీజీఎస్‌ఆర్టీసీ ఇప్పటి వరకు 5 వేలకు పైగా బస్సులు నడిపింది. మరో కొన్ని గంటలపాటు రద్దీ కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

* నటి అన్షు (Anshu)పై దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తన కొత్త సినిమా టీజర్‌ విడుదల వేడుకలో ఆయన మాట్లాడుతూ.. సినిమా కోసం ఎలా సన్నద్ధమవ్వాలని చెప్పానో ఆమె అలా చేసిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

* అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. డెన్మార్క్‌ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటిస్తున్నారు. ఒకవేళ అది కార్యరూపం దాలిస్తే ఎంత ధర పలుకుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌, న్యూయార్క్‌ ఫెడ్‌ మాజీ ఆర్థికవేత్త డేవిడ్‌ బార్కర్‌ వేసిన అంచనా ప్రకారం గ్రీన్‌లాండ్‌ (Greenland) ధర కనిష్ఠంగా రూ.లక్ష కోట్ల (12.5 బిలియన్‌ డాలర్లు) నుంచి గరిష్ఠంగా రూ.6.5 లక్షల కోట్ల (77 బిలియన్‌ డాలర్లు) వరకు ఉండొచ్చని లెక్కకట్టారు.

* సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు క్యూ కట్టాయి. వారాంతపు సెలవులు కూడా కలిసి రావడంతో శనివారం నుంచే రద్దీ పెరిగింది. ఆదివారం సైతం ఈ రద్దీ కొనసాగుతోంది.

* ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగంది. వీఎస్సార్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కాలేజీ సమీపంలో తెనాలి బండ్‌పై ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తదితరులు ఆవిష్కరించారు.

* ఐర్లాండ్‌తో (Ireland) జరుగుతున్న మహిళల మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ (India) కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే కప్‌ను చేజిక్కించుకుంది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 116 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ అమ్మాయిలు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి, రికార్డు స్థాయిలో 370 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ జట్టు 7 వికెట్లు నష్టానికి కేవలం 254 పరుగులకే పరిమితమైంది.

* సినీనటుడు వెంకటేశ్‌ కుటుంబ సభ్యులపై (Daggubati Family) కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్‌ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్‌ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబరులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని.. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పూర్తిగా కూల్చి వేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్‌బాబు, రానా, అభిరామ్‌లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని.. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

* బంగ్లాదేశ్‌ (Bangladesh) మాజీ ప్రధాని షేక్‌హసీనా పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందడం.. ఆ దేశంలోని హిందువులు, మైనారిటీలపై దాడి నేపథ్యంలో భారత్‌-బంగ్లా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌ (Pakistan) అనుకూలంగా పలు చర్యలు తీసుకుంటోంది. ఆ దేశం (Pakistan)తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్‌ ప్రభుత్వం సులభతరం చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

* చైనాలో హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు కొంతకాలంగా కలవరం రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర చైనా ప్రాంతంలో హెచ్‌ఎంపీవీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందనే కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తి విషయంలో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఉత్తర ప్రాంతంలో హెచ్‌ఎంపీవీ ఇన్ఫెక్షన్‌ రేటు ప్రస్తుతం తగ్గుముఖం పడుతోందని చైనా (China) ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.

* రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఇంకా సమస్యలున్నాయని మాజీ సీఎం, భాజపా నేత కిరణ్‌కుమార్‌ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. విజయవాడలో హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఎన్నికలంటే భయం వేస్తోందని.. రానున్న రోజుల్లో పోటీ చేయలేమని వ్యాఖ్యానించారు. డబ్బు లూటీ చేసే వాళ్లు కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని.. ప్రజలు వారికి ఓట్లు కూడా వేస్తున్నారని చెప్పారు. నాయకులు, అధికారులు కలిసి పంపకాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగా తాను మారలేదన్నారు. పేదవారికి సాయం చేసే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధి కోసం భాజపా (BJP) కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

* ఏపీలో కస్టమ్స్‌ అధికారులు ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా బంగారం (Crime News) స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, తాడిపత్రి రైల్వే స్టేషన్‌, నెల్లూరు రైల్వే స్టేషన్‌, బొల్లపల్లి టోల్‌ ప్లాజా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 17.9 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.

* మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని.. ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని చెప్పారు. విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ‘‘విపక్ష నేతలు అయినా.. అవసరం ఉన్నచోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటాం. తెలంగాణ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నాం. మెట్రో, రీజనల్‌ రింగ్‌రోడ్డు విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే.. రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుంది. హైదరాబాద్‌ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరముంది. ఒకప్పుడు రెండోస్థానంలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో.. నేడు 9వ స్థానానికి పడిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయి. మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదు.. ప్రపంచస్థాయి నగరాలతో’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

* భూ సమస్యల పరిష్కారానికి భూసర్వే చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో దీన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నియోజకవర్గాల్లోని ఒక్కొక్క గ్రామంలో సర్వే చేస్తారన్నారు. ఈ కార్యక్రమంతో భూ యజమానులకు భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారంలో భద్రాద్రి జిల్లా ఆదర్శంగా నిలవాలన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z