* తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాని లీక్ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీమ్‌లోకి కొందరు కీలక వ్యక్తులకు వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయి. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే మూవీని లీక్ చేస్తామంటూ కొందరు బ్లాక్ మెయిల్ చేశారు. మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు, సినిమా రిలీజైన రోజే ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ ముఠా వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు సమాచారం.
* హుజూరాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వీధిరౌడీలా తనపై దాడిచేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కౌశిక్‌రెడ్డి స్వతహాగా చేశారా? ఎవరైనా రెచ్చగొడితే చేశారా? అనేది తేలాలి. ఘటనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశా. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసకుంటారని భావిస్తున్నా. గతంలో ఇతర పార్టీల నేతలను భారాసలో చేర్చుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పి కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేను కూడా చేస్తా’’ అని సంజయ్ అన్నారు.
* క్యాసినో (Casino), గ్యాంబ్లింగ్‌కు సంబంధించి ప్రతిపాదిత బిల్లుకు థాయ్‌లాండ్ (Thailand) కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే థీమ్, వాటర్ పార్కులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి టూరిజం కాంప్లెక్సుల్లో క్యాసినోల ఏర్పాటుకు అనుమతికి వీలుంటుంది. ఇందుకు సంబంధించిన బిల్లు వివాదాస్పదమైనప్పటికీ.. పర్యటకానికి మరింత ఊతమివ్వడంతోపాటు ఉద్యోగాల కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్ ప్రభుత్వం వెల్లడించింది.
* పండుగ సందడితో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్య రాశులను లోగిళ్లకు మోసుకువచ్చే సంక్రాంతి వేళ భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రంగవల్లులు..గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి. అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తోంది. ఉపాధికోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలుచబడ్డాయి. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది.. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
* ఏపీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. విజయవాడ, కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు వెలిశాయి. విజయవాడ నగర శివారులోని రామవరప్పాడు, నున్న, గన్నవరం, అంపాపురం తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందేలు రూ.లక్షల్లో జరుగుతన్నాయి. బరుల్లో పందేల గురించి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పందెం రాయుళ్లు కత్తులు కట్టి కోడి పుంజులను బరిలోకి వదులుతున్నారు. నగదు తీసుకురాని వారి కోసం బరుల నిర్వాహకులు స్పాట్ క్యాష్ సౌలభ్యం ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించేందుకు గ్యాలరీలు సైతం ఏర్పాటు చేశారు.
* సంక్రాంతి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. గత నాలుగు రోజులుగా రవాణాశాఖ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్, ఆరాంఘర్ వద్ద తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై 300లకు పైగా కేసులు నమోదు చేసినట్లు రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఇష్టారాజ్యంగా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని..ఆ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
* ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుపై భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు దొరికిన ఒకే ఒక్క హాలిడేను తన కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకుంటే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను ఫ్లైట్ మిస్ అయ్యాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సోమవారం తాను దిల్లీ విమానాశ్రయానికి సమయానికి చేరుకున్నప్పటికీ కౌంటర్ మేనేజర్ సుస్మితా మిట్టల్ తనను వేరే కౌంటర్లకు పంపుతూ ఉండడం వల్ల ఆలస్యం కావడంతో ఫ్లైట్ మిస్ అయ్యానని అన్నారు. తను వారిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఎయిర్ లైన్స్ యాజమాన్యం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన జీవితంలో ఎప్పుడూ ఇటువంటి అనుభవం ఎదుర్కోలేదని అసహనం వ్యక్తం చేశాడు.
* జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని కొనియాడారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లుగానే ప్రధాని విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారని అన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేశారని అన్నారు. అన్నట్లుగానే నాలుగు నెలలలోపు జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యిందని పేర్కొన్నారు. దాని ఫలితంగానే నేడు తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానన్నారు.
* తిరుమల రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
* నటి అన్షు (Anshu)పై దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) చేసిన అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు క్షమాపణలు చెప్పారు. ‘‘అన్షు, నా మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరిని బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
* మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు ఓ ప్రకటన చేసింది. తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని పిలుపునిచ్చింది. నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు (Parshuram Kalyan Board) అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ ప్రకటన చేశారు. ‘‘మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశాం. ఈ మధ్య యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నా’’ అని రాజోరియా తెలిపారు.
* లాస్ ఏంజెలెస్‌లో అతిపెద్దదైన పాలిసేడ్స్ ఫైర్ కారణం న్యూఇయర్ వేడుకలని అనుమానిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కాల్చిన టపాసులతో అంటుకొని అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దానిని ఆర్పినా.. మిగిలిన నిప్పునకు బలమైన గాలులు తోడు కావడంతో కార్చిచ్చు రాజుకొన్నట్లు అనుమానిస్తున్నారని వాషింగ్టన్ పోస్టు కథనంలో పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం పాలిసేడ్స్ ఫైర్ అక్కడే మొదలైందని ఆ పత్రిక చెబుతోంది.
* సంపన్న ప్రాంతమైన పాలిసేడ్స్ సహా ఇతర ప్రాంతాల్లో విలువైన వస్తువులను వదిలేసి చాలా ఇళ్లు ఖాళీ చేశారు. దొంగలకు అవే లక్ష్యంగా మారుతున్నాయి. ఇప్పటివరకు 29 మంది దొంగలను అరెస్టు చేసినట్లు లాస్ ఏంజెలెస్ కౌంటీ షరీఫ్ రాబర్ట్ లూనా వెల్లడించారు. వీరిలో ఒకరు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది దుస్తుల్లో అక్కడ సంచరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఖాళీ ఇళ్లను కాపాడేందుకు 400 మంది నేషనల్ గార్డ్స్‌ను ఇక్కడ మోహరించారు. ఇక ఇటీవల కెన్నెత్‌ఫైర్‌ను అంటించినట్లు అనుమానిస్తున్న వ్యక్తి మెక్సికో నుంచి వచ్చిన అక్రమ వలసదారుడిగా గుర్తించారు. అతడి నుంచి బ్లోటార్చ్‌ను కూడా స్వాధీనం చేసుకొన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z