Business

₹87లకు చేరువలో డాలరు-BusinessNews-Jan 13 2025

₹87లకు చేరువలో డాలరు-BusinessNews-Jan 13 2025

* ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా’ (Kumbh Mela)కు లక్షలాది మంది తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయానికే దాదాపు 60 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో (Prayagraj) పుణ్యస్నానాలు ఆచరించారు. ఇలా 45రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘‘మహాకుంభమేళా వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతాయి. ఒక్కో వ్యక్తి సగటున రూ.5వేలు ఖర్చు పెట్టినా.. మొత్తం రూ.2లక్షల కోట్లు అవుతుంది. హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాస ప్రాంతాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు వంటివి ఈ ఖర్చులో ఉంటాయి’’ అని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CIAT) జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ఖాండేవాల్‌ పేర్కొన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాల నడుమ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జొమాటో, ఎల్‌అండ్‌టీ షేర్లలో విక్రయాలు సూచీలపై మరింత ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ 23,100 దిగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 76,629.90 (క్రితం ముగింపు 77,378.91) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 1000 పాయింట్లు పైగా కోల్పోయి 76,249.72 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1,048.90 పాయింట్ల నష్టంతో 76,330.01 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.55 పాయింట్ల నష్టంతో 23,085 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61 వద్ద స్థిరపడింది.

* ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఉద్యోగులకు త్వరలో గుడ్‌ న్యూస్‌ చెప్పనుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును (Salary hike) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలో ఉద్యోగులకు సమాచారం అందించనుందని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

* పర్యాటక రంగంలో వృద్ధికి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అధిక నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు (HNI), విదేశీ పెట్టుబడిదారులకు గోవా రియల్ ఎస్టేట్ మార్కెట్‌ ఆసక్తిగా కనిపిస్తోంది. హాలిడే హోమ్‌లు, స్టేయింగ్‌ రూమ్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. అధిక అద్దె రాబడి, స్థిరమైన జీవనం సాగించేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు, డెవలపర్ల ప్రకారం గోవాలోని బ్రాండెడ్ హోటళ్లు, రెంటల్ విల్లాలు పీక్ సీజన్‌లో పూర్తిగా బుక్ అవుతున్నాయి. ఈ కేటగిరీల్లో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని కొనుగోలు దారులు భావిస్తున్నారు. సుస్థిర జీవనానికి ప్రాధాన్యమిచ్చే హెచ్‌ఎన్‌ఐలకు గోవా(Goa Realty)లోని పర్యావరణ అనుకూల గేటెడ్ కమ్యూనిటీలు ఆకర్షణీయంగా తోస్తున్నాయి. అంజునా, అర్పోరా, బగా, కలంగుటే, కాండోలిమ్, వాగ్తోర్‌ వంటి ప్రాంతాలతో సహా గోవా నార్త్ బీచ్ పోర్చుగీస్ పరిసరాలు, ప్రసిద్ధ రెస్టారెంట్లు, హోటళ్లు, బీచ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

* ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ 2025 ద్వారా రూ.6,000 కోట్ల వరకు ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా పార్ట్‌నర్‌ జియో స్టార్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూ.1,500 కోట్లు, ఐపీఎల్ నుంచి రూ.4,500 కోట్లు సంపాదించాలని యోచిస్తోంది.

* సంక్రాంతి సెలవుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఉద్యోగులకు మరో రోజు కూడా హాలీడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 ప్రభుత్వ సెలవుల్లో ఏపీ ప్రభుత్వరంగ బ్యాంకులకు జనవరి 14వ తేదీ మాత్రమే సంక్రాంతి సెలవుగా ప్రకటించారు. కనుమ రోజు అంటే బుధవారం నాడు బ్యాంకులను యథావిధిగా తెరవాల్సి ఉంటుంది. దీంతో కనుమ నాడు( ఈ నెల 15న) కూడా సెలవు ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని యునైటెడ్‌ ఫోరం ఫర్‌ బ్యాంక్‌ యూనియన్స్‌, ఏపీ స్టేట్‌ యూనియన్‌ కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ సర్కార్‌.. బ్యాంకులకు అదనంగా మరో రోజు కూడా సెలవును పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం గతేడాది డిసెంబర్‌ 6న జారీ చేసిన జీవో నెంబర్‌ 2116కు సవరణలు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు జీవో నెం.73ను విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z