Business

జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్-BusinessNews-Jan 14 2025

జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్-BusinessNews-Jan 14 2025

* యాపిల్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) సతీమణి లారీన్‌ పావెల్‌ జాబ్స్‌ (Laurene Powell Jobs) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) హాజరైన విషయం తెలిసిందే. అయితే ఆమె అస్వస్థతకు గురైనట్టు సమాచారం. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు లోనయినట్టు నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్‌ స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌ తెలిపారు. ప్రస్తుతం లారీన్‌ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స తీసుకుంటున్నారని.. ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని వెల్లడించారు. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు లారీన్‌ చేరుకున్నారు. పలు పూజాకార్యక్రమాలలో పాల్గొన్నారు. మహా కుంభమేళా విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థించినట్టు తెలిపారు. 144 ఏళ్లకు ఒకమారు జరిగే అరుదైన ఖగోళ అమరిక వేళ కుంభమేళా జరుగుతుండటంతో కోట్లాదిమంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. ఆమె తన పేరును కమలగా మార్చుకున్నట్లు కైలాసానంద గిరి మహరాజ్‌ పేర్కొన్నారు. ఆమె భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి అని.. ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు.

* ప్రపంచంలో దిగ్గజ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ ఎట్టకేలకు తన బెర్క్‌షైర్‌ హత్‌వే కంపెనీకి వారసుడిని ప్రకటించారు. తన రెండో కుమారుడు హువర్డ్‌ బఫెట్‌ కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని ప్రకటించారు. ప్రస్తుతం బెర్క్‌షైర్‌ వ్యాపార సామ్రాజ్యం విలువ ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.86 లక్షల కోట్లు). ప్రస్తుతం వారెన్‌ బఫెట్‌కు 94 ఏళ్లు. తాజాగా ఆయన వాల్‌స్ట్రీట్‌జర్నల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తన సంపదలో అత్యధిక మొత్తం కొత్తగా ఏర్పాటు చేసిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. తన ముగ్గురు పిల్లలకు అతితక్కువ సంపద మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడించారు. కాకపోతే.. వారే 140 బిలియన్‌ డాలర్ల ట్రస్ట్‌ దాతృత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారన్నారు. ఇక కుమారుడు హువర్డ్‌ను వారసుడిగా ఎంపిక చేయడంపై మాట్లాడుతూ.. తన ముగ్గురు బిడ్డలను బలంగా విశ్వసిస్తానని చెప్పారు. హువర్డ్‌ కూడా నా బిడ్డే కాబట్టి అవకాశం లభించిందన్నారు.

* భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై మెటా అధినేత జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనకు సమన్లు పంపనుంది. ఈ విషయాన్ని భాజపా ఎంపీ, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానల్ ఛైర్మన్ నిషికాంత్ దూబే వెల్లడించారు. ‘ప్రజాస్వామ్య దేశంపై తప్పుడు సమాచారం, దాని ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మెటా సంస్థ పార్లమెంటుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని ఎక్స్‌ వేదికగా డిమాండ్ చేశారు. జుకర్‌ బర్గ్‌ వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది.

* డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ పడిపోకపోవడం గమనార్హం. 2023 ఫిబ్రవరి 6న 68 పైసలు పతనమైంది. మళ్లీ ఇప్పుడే అంతటి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌ వద్ద రూపీ వాల్యూ 86.70 స్థాయికి చేరి ఆల్‌టైమ్‌ కనిష్ఠాన్ని తాకింది. నిజానికి గతకొద్ది రోజులుగా డాలర్‌ ఎదుట ఏమాత్రం నిలదొక్కుకోలేకపోతున్న భారతీయ కరెన్సీ.. రోజుకింత క్షీణిస్తూ ఆల్‌టైమ్‌ కనిష్ఠాల్లోనే కదలాడుతున్నది. కాగా, అమెరికా మార్కెట్‌లో అంచనాల్ని మించి ఉద్యోగ వృద్ధి నమోదవడం.. డాలర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ను తెచ్చిపెట్టిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే రూపాయి విలువ పతనం.. ఎగుమతిదారులకు పరిమిత శ్రేణిలోనే ప్రయోజనాలను తెచ్చిపెడుతుందని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చిత వాతావరణం నెలకొనడం ఇందుకు కారణాలుగా వారు పేర్కొంటున్నారు. మరోవైపు రూపాయి నష్టం.. దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బేనని, ద్రవ్యోల్బణం విజృంభణకు దారితీయవచ్చని కూడా వారు హెచ్చరిస్తున్నారు. రూపీ నష్టాలకు బ్రేక్‌ పడకపోతే సంక్షోభం ముప్పు ఖాయమన్న ఆందోళనల్నీ వెలిబుచ్చుతున్నారు. మరోవైపు రూపాయి పతనం రాజకీయంగానూ ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. అధికార బీజేపీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్థిరంగా ఉన్న కరెన్సీల్లో రూపాయి ఒకటని అంటుండగా, కాంగ్రెస్‌ మాత్రం మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నది.

* పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. రూ.4,236 కోట్లకుగాను కేవలం రూ.1,000 కోట్లనే ఇచ్చింది. ఇన్నాళ్లూ నూతన ఎంఎస్‌ఎంఈ విధానం, కొత్త పారిశ్రామిక విధానం పేరుతో తాత్సారం చేసిన రేవంత్‌ సర్కార్‌.. తాజాగా రూ.1,000 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z