* రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణహత్యకు గురైన యువతి, యువకుడిని పోలీసులు గుర్తించారు. యువకుడు మధ్యప్రదేశ్‌కి చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. సాకేత్ హౌస్ కీపింగ్ పనిచేస్తూ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. యువతి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు(25)గా గుర్తించారు. ఆమె ఎల్బీ నగర్లో నివాసం ఉంటోంది. మృతులిద్దరికీ పరిచయం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాకేత్.. ఈనెల 8న బిందుని తీసుకొచ్చి నానక్‌రామ్‌గూడలోని తన స్నేహితుడి వద్ద ఉంచాడని.. 11న రాత్రి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
* ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. స్వామియే శరణం అయ్యప్ప.. నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
* పక్కవాడి విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని తమిళ నటుడు అజిత్ (Ajith) అన్నారు.
దుబాయ్ కారు రేసింగ్‌లో సత్తా చాటిన ఆయనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అజిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అభిమానుల మధ్య జరిగే మాటల యుద్ధంపై హితవు పలికారు. ‘‘ఇతరులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పని సక్రమంగా, కష్టపడి చేయండి. మీ పక్కనున్న వ్యక్తి అది చేస్తున్నాడు.. ఇది చేస్తున్నాడని హైరానా పడకండి. దాని వల్ల మీకేం ఉపయోగం ఉండదు. మీ జీవితంపై మీరు దృష్టి పెట్టండి. నా అభిమానులకూ ఇదే చెబుతా. సినిమాలు చూడటం వరకూ బాగానే ఉంటుంది. కానీ, ‘జై అజిత్.. జై విజయ్..’ అంటూ ఉంటే, మరి నువ్వెప్పుడు జీవిస్తావు. మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు సంతోషంగానే ఉంది. కానీ, ముందు మీ జీవితం చూసుకున్నాకే ఏదైనా. నా అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడు నేను కూడా సంతోషంగా ఉంటా. ఇతరుల పట్ల కాస్త దయతో ఉండండి.’’
* ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా దిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను కలిసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం 16న దిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించి.. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు.. పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం బృందం చర్చించనుంది. ఈనెల 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు.
* ఆస్ట్రేలియాతో (AUS vs IND) రెండో టెస్టు నాటికి భారత కెప్టెన్ రోహిత్ జట్టుతో చేరిన సంగతి తెలిసిందే. టీమ్ కూడా రెండు విడతలుగా అక్కడ అడుగు పెట్టింది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ పెర్త్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండాపోయాడు. అప్పుడే క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా తన భార్యతో కలిసి విడిగానే ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. తీరా.. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆసీస్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో టీమ్ఇండియా మేనేజ్మెంట్పై గావస్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కైనా ఒకేసారి జట్టును పంపించాలని.. స్క్వాడ్‌ను కూడా తక్కువ మందితో నింపాలని సూచించాడు.
* తిరుమల పరకామణిలో బంగారం బిస్కెట్ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. మొన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగిలిస్తూ దొరికి పోయిన పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను తస్కరించడం మొదలు పెట్టాడు. పెంచలయ్య తీరుపై అనుమానం రావడంతో తితిదే విజిలెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. జనవరి 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బిస్కెట్‌ను దొంగిలించి ట్రాలీకి ఉన్న పైపులలో దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించగా అక్కడి నుంచి పరారయ్యాడు. విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. పరకామణిలో గతంలో చేసిన చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.46లక్షలు ఉంటుందని అంచనా.
* తనపై దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) చేసిన కామెంట్స్‌పై నటి అన్షు (Anshu) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె మాట్లాడారు. ‘‘త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగిందని తెలిసింది. ఆయనెంత మంచి వారో చెప్పేందుకే ఈ వీడియో. ఆయన ఎంతో స్నేహంగా ఉంటారు. నన్ను తన కుటుంబ సభ్యురాలిగా భావించారు. ఆయనపై నాకు గౌరవం ఉంది. టాలీవుడ్లో నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇంత కంటే మంచి దర్శకుడు ఉండరేమో’’ అని తెలిపారు. కామెంట్స్ విషయమై డిబేట్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని కోరారు. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మజాకా’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు.
* పారిస్ ఒలింపిక్ పతకాలు నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వక్రీడలు ముగిసి ఏడాది కూడా పూర్తికాకుండానే.. చాలావరకు పతకాలపై ఉన్న లోహపు పూత చెదిరిపోయి.. అవి దారుణంగా తయారయ్యాయి. ఇప్పటికే పతకాల్లో లోపాలను గమనించి 100 మంది అథ్లెట్లు వాటిని వాపస్ చేశారు. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ స్పందించింది. లోపభూయిష్టంగా ఉన్న 2024 ఒలింపిక్ పతకాలను మార్చి కొత్తవి ఇస్తామని ఆంగ్ల వార్త సంస్థ ఏఎఫ్పీకి వెల్లడించింది. ‘‘ది పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ నిర్వాహక కమిటీ ఫ్రెంచ్ ప్రభుత్వ మింట్‌తో కలిసి పనిచేస్తోంది. ఆ సంస్థే పతకాల తయారీ, నాణ్యతకు బాధ్యత వహిస్తోంది. మెడల్స్‌పై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి.. లోపభూయిష్టంగా ఉన్న వాటిని ఫ్రెంచి ప్రభుత్వ మింట్ రీప్లేస్ చేస్తుంది. ఈ ప్రక్రియ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది’’ అని వివరించింది.
* ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా వైకాపా (YSRCP) నేతల తీరు ఏమాత్రం మారడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ వైకాపా నేతలు చేస్తున్న దుష్ప్రచారం దుర్మార్గమని మండిపడ్డారు. వైకాపా నాయకులు.. అసత్య ప్రచారాలకు పండుగలను కూడా వదలడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాలు, దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఈ సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చారని మంత్రి స్పష్టం చేశారు.(Andhra Pradesh News) గతేడాది గుంతల రహదారులతో ఇబ్బంది పడ్డవారంతా ఈసారి సాఫీగా ప్రయాణించి స్వగ్రామాలకు చేరుకున్నారన్నారు.
* తిరుపతి నగరం బైరాగిపట్టెడలోని మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు తెలిపారు. సోమవారం మోహన్‌బాబు యూనివర్సిటీలో వారితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఆట వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 120 మంది చిన్నారులకు విద్య, వైద్యంతో పాటు కుటుంబసభ్యుడిలా తోడుంటానని తెలిపారు. కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారని, కానీ తాను చేసిన మంచి పనిని మరొకరు ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మంచి హృదయంతో మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి అనాథలను ఆదరిస్తున్నారని కొనియాడారు. సంస్థకు పెద్దన్నగా తోడుంటానని.. వారంతా తన కుటుంబసభ్యులేనని.. వారితో పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
* తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. 1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్‌పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా… 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
* ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ముగిశాయి. ఆలయంలో నెల రోజుల పాటు వైభవోపేతంగా ధనుర్మాస ఉత్సవాలు కొనసాగాయి. వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి గోదాదేవి, శ్రీరంగనాథుడి కల్యాణం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ పరకామణి మండపంలో ప్రత్యేకంగా అలంకరించి అధిష్ఠించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవారం ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
* అంబర్‌పేటలో ఓ దొంగకు వింత అనుభవం ఎదురైంది. అంబర్‌పేటలో నిర్మాణంలో ఉన్న పైవంతెన సామగ్రి చోరీ చేశాడు. స్థానికులు చూసి కేకలు వేయడంతో.. పట్టుకుంటారని భయపడి ఫ్లైఓవర్ పైనుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు .. చోరీకి యత్నించిన వ్యక్తి ఫలక్‌నుమాకు చెందిన రాములుగా గుర్తించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.
* కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారనే విషయం ఇటీవల సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించేందుకు ఏర్పాటైన సిట్ ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని డీఐజీ ఎస్ అజీతా బేగం తెలిపారు. నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు పంపించేందుకు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. ఈ కేసులో మరో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నామని వెల్లడించారు. సిట్ పక్కా ఆధారాలతో శాస్త్రీయ విచారణ చేస్తూ ముందుకెళ్తోందని చెప్పారు. నిందితులెవరినీ వదిలిపెట్టమని, చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z