* తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీనటుడు మంచు మనోజ్ (Manchu Manoj) లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ‘మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి?’’ అంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
* అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను (Los Angeles) కార్చిచ్చు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఈ ఏడాది ఆస్కార్ వేడుక రద్దు కానుందనే వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. తాజాగా దీనిపై ఫిల్మ్ అకాడమీ స్పందించింది. మార్చి 2న జరగనున్న ఆస్కార్ వేడుకను ఫిల్మ్ అకాడమీ క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై అకాడమీ సభ్యుల్లో ఒకరు స్పందించారు. అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఆస్కార్ వేడుకల్లో మార్పు ఉండదని స్పష్టంచేశారు. ఒకవేళ అలాంటిది ఉంటే ఫిల్మ్ అకాడమీనే స్వయంగా ప్రకటిస్తుందన్నారు. 1000 మంది ఈ వేడుకల వల్ల ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. 96 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయలేదన్నారు. కొవిడ్ సమయంలోనూ వాయిదా మాత్రమే వేసినట్లు గుర్తుచేశారు.
* సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకొన్నాడు. రెండో రౌండ్‌లో పోర్చుగల్ ఆటగాడు జైమీ ఫరియాపై 6-1, 6-7 (4), 6-3, 6-2 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఈక్రమంలో ఫ్రొఫెషనల్ టెన్నిస్‌లో అద్భుతమైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరిట (Open Era)) ఉన్న అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డును జకోవిచ్ బద్దలు కొట్టాడు. ఫెదరర్ 429 ఆడగా.. జకోవిచ్ 430 మ్యాచ్‌లు పూర్తి చేసుకొన్నాడు. ఇప్పటివరకు జకోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్‌లను సాధించాడు. ఇందులో 10 ఆస్ట్రేలియన్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్, 7 వింబుల్డెన్, 4 యూఎస్ ఓపెన్‌లు ఉన్నాయి.
* ఐర్లాండ్‌తో (IND w Vs IRE w) మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రికార్డు స్థాయిలో 435 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సారా ఫోర్బ్స్ (41) టాప్ స్కోరర్. ఓర్లా (36) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనుజా కాన్వార్ 2.. టిటాస్ సధు, సయాలి, మిన్ను ఒక్కో వికెట్ తీశారు. పరుగులపరంగా భారత్ అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్ ఇదే. అంతకుముందు ఐర్లాండ్‌పైనే 2017లో 249 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది.
* ఒకవైపు ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం (Ukraine Russia War) ఎంతకూ తెగడం లేదు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు (Israel Hamas Conflict) కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆయా దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నడుమ.. 2025కు సంబంధించి దేశాల మధ్య సాయుధ ఘర్షణలే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాల సందర్భంగా తన వార్షిక ‘అంతర్జాతీయ నష్ట ప్రమాద నివేదిక’ను విడుదల చేసింది. 900 మంది నిపుణులు, విధానకర్తలు, పరిశ్రమాధిపతులను సర్వే చేసి దీన్ని రూపొందించింది. మొత్తం మీద వాతావరణ సంక్షోభాలను తక్షణ, స్వల్ప, దీర్ఘకాలిక ముప్పుగా పరిగణించింది.
* ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) మూడో సీజన్ ఫైనల్‌కు తొలిసారి దక్షిణాఫ్రికా చేరుకుంది. జూన్‌లో లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో (SA vs AUS) తలపడనుంది. తక్కువ మ్యాచ్‌లు ఆడిన సఫారీ జట్టు ఫైనల్‌కు రావడంపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ మ్యాచ్‌లు ఆడినా సరే సౌతాఫ్రికాకు ఎలా అవకాశం ఇస్తారనేది వారి వాదన. మరోవైపు ఇంగ్లండ్ అత్యధికంగా 22 టెస్టులను ఆడగా.. దక్షిణాఫ్రికా మాత్రం 12 మ్యాచులను మాత్రమే ఆడటం గమనార్హం. ఇందులో ఎనిమిది గెలిచి అత్యధిక పర్సంటేజీతో ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఇంగ్లండ్ మాత్రం 22 ఆడి 11 విజయాలు సాధించినా ఆరో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదే మాజీల అసంతృప్తికి కారణం. దీనిపై సఫారీ జట్టు కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) స్పందించాడు. ఐసీసీనే ఆ అసమానతలను తొలగించాల్సి ఉందని వ్యాఖ్యానించాడు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో ముచ్చటిస్తూ పలు విషయాలను వెల్లడించాడు.
* వెంకటేశ్ (Venkatesh) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). సంక్రాంతి సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ సినిమాపై మహేశ్‌బాబు (Mahesh Babu) సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని ఎంజాయ్ చేశా. అసలైన పండగ సినిమా ఇది. వెంకటేశ్ యాక్టింగ్ అదుర్స్. వరుస విజయాలు అందుకున్న మా దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా ఉంది. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతం’’ అని పేర్కొన్నారు.
* శ్రీసత్యసాయి జిల్లాలో మహిళ పట్ల పలువురు అమానుషంగా ప్రవర్తించారు. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో పలువురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
* సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ‘పుష్ప 3’ (Pushpa 3) అప్‌డేట్ ఇచ్చారు. ‘పుష్ప 2’ (Pushpa 2) ఘన విజయం అందుకున్న సందర్భంగా పాల్గొన్న తాజా ఇంటర్వ్యూలో దాని సీక్వెల్ గురించి వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని, ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని తెలిపారు. అంచనాలు ఉన్న నేపథ్యంలో ‘పుష్ప 3’ విషయంలో మీపై ఒత్తిడి ఉండనుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వృత్తిపరంగా నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడి ఉంటే క్రియేటివిటీ ఉండదు. ‘పుష్ప 2’కి ది బెస్ట్ ఇవ్వాలని నేను, సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ ముందు నుంచీ అనుకుని, ఆ మేరకు పని చేశాం. సుకుమార్ (Sukumar) మంచి స్క్రిప్టు రాశారు. అల్లు అర్జున్ (Allu Arjun) అద్భుతంగా నటించారు. ఇతర నటులు, టెక్నిషియన్లు ఎంతో కష్టపడ్డారు. ‘పుష్ప 1’, ‘పుష్ప 2’కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతాం. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి’’ అని పేర్కొన్నారు. ‘పుష్ప 2’ కోసం క్రియేట్ చేసిన కొన్ని ట్యూన్స్ వినియోగించలేకపోయామని, వాటికి ‘పుష్ప 3’లో అవకాశం ఉండొచ్చని తెలిపారు.
* అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శీతలపానీయం కోకా కోలా ప్రియుడు. ఆయన రోజుకు 12 డైట్ కోక్‌లను అలవోకగా తాగేసేవారట. ఈవిషయాన్ని గతంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. రెండోసారి ఆయన అమెరికా పగ్గాలను స్వీకరించనున్న వేళ కోకా కోలా ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఇచ్చింది.
* చైనీస్ మాంజాపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా తయారు చేయడం వల్లే ఇది పెద్ద మొత్తంలో లభ్యమవుతోందని చెప్పారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తోందని పేర్కొన్నారు.
* విలువిద్యలో ఖమ్మం జిల్లాకు మంచి గుర్తింపు ఉంది. ఆదివాసీ జిల్లాగా పేరొందిన ఖమ్మం జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు.. అందులోనూ ఆదివాసీ బిడ్డలు ప్రముఖ పాత్ర వహించారు. తాజాగా తెలంగాణలో విలువిద్యకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తోంది. సీఎం కప్ రాష్ట్రస్థాయి విలువిద్య క్రీడలు ఇటీవల ఖమ్మంలో నిర్వహించారు. దీంతో ఖమ్మం జిల్లాకు విలువిద్యలో మళ్లీ ప్రముఖ స్థానం రానుందని స్థానిక క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* సినీనటుడు మంచు మనోజ్ (Manchu Manoj) మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీతో చేరుకోగా.. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సూచనతో వెనుదిరిగిన మనోజ్ నేరుగా నారావారిపల్లె వెళ్లారు. భార్య మౌనికతో కలిసి లోకేశ్‌తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. అనంతరం మనోజ్ దంపతులు ఎ.రంగంపేట చేరుకుని పశువుల పండుగను వీక్షించారు. సాయంత్రం మోహన్‌బాబు యూనివర్సిటీ ఆవరణలో ఉన్న తన నానమ్మ, అమ్మమ్మ సమాధుల వద్ద నివాళులర్పించిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్తారని మంచు మనోజ్ సన్నిహితులు తెలిపారు.
* నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు) టికెట్లతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. అనుమానం వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను నిలిపివేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తు్న్నట్లు గుర్తించారు.
* తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈఏపీ సెట్ ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ (TG EAPCET 2025) జరగనుంది. ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్‌టీయూ నిర్వహించనుండగా.. ప్రొఫెసర్ బి.డీన్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
* రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణహత్యకు గురైన యువతి, యువకుడిని పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన బిందు ఈ నెల 3న అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన అంకిత్ సాకేత్‌పై ఈనెల 8న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో వీరు మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z