* బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో కథనాలు ప్రచురితమయ్యాయి. దాడి జరిగిన సమయంలో ఇంటి వద్ద కారు సిద్ధంగా లేకపోవడంతో.. ఇబ్రహీం తన తండ్రిని ఆటోలో తీసుకువచ్చాడని సమాచారం. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలో నక్కినట్లు పలు వార్తలు వచ్చాయి. దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
* నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) పేరుతోనే రూపొందుతున్న ఆ సినిమాని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. బ్రహ్మానందంతో కలిసి కామెడీ చేయడం సవాలుగా అనిపించిందన్నారు. ‘‘బ్రహ్మానందం’పేరుతో సినిమా రావడం ఆనందంగా ఉంది. ఆయన గాడ్ ఆఫ్ కామెడీ. షూటింగ్ సరదాగా జరిగింది. రాజా గౌతమ్ నాకు మంచి స్నేహితుడు. కథ చెప్పగానే టైటిల్ విని వెంటనే ఓకే చెప్పా. బ్రహ్మానందం గారు కమెడియన్స్‌కు స్ఫూర్తి’’ అని వెన్నెల కిశోర్ చెప్పారు.
* జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీని అంతుచిక్కని మరణాలు (Mysterious deaths) వెంటాడుతున్నాయి. జిల్లాలోని బుధాల్ గ్రామంలో గడిచిన నెలన్నర వ్యవధిలో అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరుకుంది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఈ మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక సాంక్రమిక వ్యాధులు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం (Jammu Kashmir News).. దర్యాప్తు కోసం 11 మందితో ప్రత్యేక బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు.
* కేరళ (Kerala) రాష్ట్రం తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవ సమాధి అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమాధిని తవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీసులు సమాధిని తవ్వి ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. సమాధి వద్దకు ఉదయం 7 గంటల సమయంలో చేరుకున్నామని.. దానిని తవ్వడాన్ని కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో భారీ భద్రత నడుమ కాంక్రీటుతో నిర్మించిన గోపన్ స్వామి సమాధిని తవ్వామని పోలీసులు పేర్కొన్నారు. లోపల ఆయన మృతదేహం ధ్యాన స్థితిలో ఉందని.. ఛాతి వరకు పూజా సామగ్రి నింపి ఉందని తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించినట్లు పేర్కొన్నారు.
* ఇసుక టెండర్ల ప్రక్రియలో బీటెక్ రవి అనుచరులు హల్చల్ చేశారు. పోలీసులను సైతం లెక్కచేయకుండా నాయకులు ఘర్షణకు దిగారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ జిల్లాలోని మూడు మండలాల్లో ఇసుక టెండర్లకు సంబంధించి కడప కలెక్టరేట్లోని మైనింగ్ డీడీ కార్యాలయంలో టెండర్ల ప్రక్రియ జరిగింది. టెండర్లు దక్కించుకోవడానికి పులివెందులకు చెందిన తెదేపా నేత బీటెక్ రవి అనుచరులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు కూటమి నేతలు సైతం టెండర్లు వేసేందుకు వచ్చారు. బీటెక్ రవి అనుచరులు.. ఇతర కూటమి నేతలను టెండర్లు వేయనీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కార్యాలయంలోకి ఎవరినీ రానీయకుండా అడ్డుగా ఉన్నారు. కెమెరాలను లాక్కొని మీడియా ప్రతినిధులను సైతం అటువైపునకు రాకుండా నిలువరించారు.
* ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే.. తాజాగా ఈడీ అధికారులు తిప్పితిప్పి అడిగారని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. దాదాపు 7గంటల పాటు ఈడీ విచారణ అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్‌రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తప్పు చేయలేదు.. చేయబోను. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ తెలిపారు.
* భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams)తోపాటు మరో వ్యోమగామి విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడు నెలల తర్వాత ‘స్పేస్‌వాక్’ కోసం ‘ఐఎస్ఎస్’ నుంచి సునీత బయటకు వచ్చారు. ప్రస్తుతం స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. నాసా (NASA)కు చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి ఐఎస్ఎస్కు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. 2012లో ఆమె చివరిసారి స్పేస్‌వాక్ నిర్వహించగా.. మొత్తంగా ఇది ఎనిమిదోసారి.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది. పునర్విభజన చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని స్పష్టం చేసింది. 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాల వాటా తేల్చడం ముఖ్యమని ట్రైబ్యునల్ పేర్కొంది. మూడో సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలకు కేటాయింపులపై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని తెలిపింది. ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
* ఆయన రాష్ట్రానికి మంత్రి. అయినప్పటికీ సామాన్య రైతులా పొలం పనులు చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి (Nimmala Ramanaidu) కి కనుమ పండగ నాడు కొంత తీరిక సమయం దొరికింది. దీంతో ఉదయాన్నే సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుంచీ ఆయనకు పొలం పనులంటే ఇష్టం. కళాశాల అధ్యాపకుడిగా పని చేస్తున్నప్పుడూ వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి తీశారు. ‘తీరిక సమయంలో పొలం వెళ్లి పని చేయడం నిజమైన సంతృప్తినిస్తుంది’ అని మంత్రి చెప్పారు.
* మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల స్థాయిలో సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రోగులను తీసుకెళ్లేందుకు వీల్ఛైర్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. శౌచాలయాల నిర్వహణ దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని.. లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z