Business

పెరిగిన కిలో వెండి ధర-BusinessNews-Jan 16 2025

పెరిగిన కిలో వెండి ధర-BusinessNews-Jan 16 2025

* దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ 50 గురువారం వరుసగా మూడవ సెషన్‌లో సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 318.74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77,042.82 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 77,319.50 నుండి 76,895.51 రేంజ్‌లో ట్రేడ్ అయింది.ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98.60 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.65కి చేరుకోగా, కనిష్ట స్థాయి 23,272.05 వద్ద నమోదైంది.హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ , అదానీ పోర్ట్స్ ఈరోజు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. వీటి లాభాలు 7.99 శాతం వరకు పెరగడంతో నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 33 గ్రీన్‌లో ముగిశాయి.మరోవైపు ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ నేతృత్వంలోని 17 భాగస్వామ్య స్టాక్‌లు 2.90 శాతం వరకు క్షీణించి నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 1 శాతంపైగా పెరగడంతో విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. ఇదిలా ఉండగా, మార్కెట్ అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ 1.35 శాతం పెరిగి 15.17 పాయింట్ల వద్ద ముగిసింది.

* ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల ఏకీకృత నికర లాభాలను అర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,106 కోట్లతో పోలిస్తే 11.46 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది డిసెంబర్‌ ముగిసే సమయానికి కంపెనీ ఆదాయం రూ.38,821 కోట్లుగా ఉంది.

* 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ (Union budget 2024) ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌లో ఏయే రంగాల్లో కేటాయింపులు పెరగనున్నాయి, వేటికి ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉందనే విషయంపై మార్కెట్లో చర్చలు మొదలయ్యాయి. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా రైల్వే అభివృద్ధికి సహకరించేలా బడ్జెట్‌ రూపకల్పన ఉండనుందని అంచనాలు ఉన్నాయి. భద్రత, రైళ్ల సామర్థ్యం పెంపుపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని పరిగణలోకి తీసుకొని.. ఈసారి బడ్జెట్‌లో భారతీయ రైల్వే కేటాయింపులో పెంపు ఉండొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

* కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను(Income Tax) విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. క్రమంగా ఈ పాత పన్ను(Old Tax) విధానాన్ని తొలగించే ప్రకటనలు చేయాలని ప్రభుత్వ యోచిస్తోంది. కొత్త పన్ను(New Tax) విధానాన్నే పన్నుదారుల ఎంపికగా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పన్నుదారులు పాత, కొత్త విధానాల్లో ఏదైనా ఎంచుకునే వీలుంది. ప్రభుత్వం ఒకవేళ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇకపై ఈ వెసులుబాటు ఉండదని నిపుణులు చెబుతున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పాత పన్ను విధానంలో ఉన్నన్ని మినహాయింపులు మాత్రం కొత్త విధానంలో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే 72% పైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన తక్కువ రేట్లకు పన్నుదారులు ఆకర్షితులయ్యారు. వీరిని మరింత ప్రోత్సహించడానికి కొత్త శ్లాబ్‌లను తీసుకురావాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి.

* ఫారెక్స్‌ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కావడం, జ్యువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ పెరగడంతో గురువారం బంగారం, వెండి ధరలు ధగధగమెరుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.500 వృద్ధితో రూ.81,300లకు చేరుకున్నది. బుధవారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.80,800 వద్ద ముగిసింది. ఆభరణాలను తయారు చేసేందుకు వినియోగించే 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర సైతం రూ.500 పెరిగి రూ.80,900 వద్ద స్థిర పడింది. బుధవారం 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.80,400 వద్ద ముగిసింది. మరోవైపు గురువారం కిలో వెండి ధర రూ.2,300 వృద్ధితో రూ.94,000లకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,700 వద్ద నిలిచింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z