Politics

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని విజ్ఞప్తి-NewsRoundup-Jan 18 2025

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని విజ్ఞప్తి-NewsRoundup-Jan 18 2025

* ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌లోని (Hyderabad News) ఎన్టీఆర్‌ ఘాట్‌కు లోకేశ్‌ వెళ్లారు. ఘాట్‌ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని గమనించారు. అవసరమైన అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా ఘాట్ మరమ్మతులు సొంత నిధులతో పూర్తి చేయాలని లోకేశ్‌ నిర్ణయించారు. వెంటనే పనులు ప్రారంభించాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్‌ఎండీఏ తీరు పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలను ఎన్టీఆర్ ట్రస్ట్‌కు అప్పగించాలని పలుమార్లు గత తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని లోకేశ్‌ తెలిపారు.

* వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎంగా చేయాలని చంద్రబాబుకు సభా వేదిక నుంచి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో జిల్లా నేతలు, అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్‌లో ఆయన మైదుకూరు చేరుకున్నారు.

* కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కుటుంబ వివాదంపై మంచు విష్ణుకు (Manchu Vishnu) ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. ‘కన్నప్ప’ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణును.. ‘మనోజ్‌ (Manchu Manoj) పోరాటం దేనికోసం చేస్తున్నారు?’ అనే ప్రశ్న అడిగారు. దానిపై విష్ణు స్పందిస్తూ.. ‘‘నేను కన్నప్ప ప్రచారం కోసం ఈ ఇంటర్వ్యూకు వచ్చాను. దాని గురించి అడగండి. ఆ వివాదం గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. అయినా.. మనం చేసే చర్యలే మన వైఖరికి అద్దం పడతాయి. జనరేటర్‌లో పంచదార, ఉప్పు పోస్తే.. అవి ఫిల్టర్‌ ప్రాసెసింగ్‌లోనే ఆగిపోతాయి. అంతేకానీ, జనరేటర్‌ పేలదు’’ అని సమాధానమిచ్చారు. ఇప్పుడు తన శ్రద్ధ మొత్తం కన్నప్ప పైనే ఉందన్నారు.

* రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా పూజారి కాంకేర్‌- మారేడుబాక అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతిచెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దామోదర్‌పై గతంలో రూ.50లక్షల రివార్డు ఉంది. బడే చొక్కారావు (దామోదర్‌) స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. బీజాపుర్‌ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

* ఉగాదికి గద్దర్‌ (సినిమా) అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో జరిగిన గద్దర్‌ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారాస చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. భారాస హయాంలో అవార్డుల పంపిణీ జరగలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అంజేయాలని నిర్ణయించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు.

* బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)పై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అతడిని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా నిందితుడిని పట్టుకుని, వీడియో కాల్‌ ద్వారా ముంబయి పోలీసులతో మాట్లాడి, అతడేనని ధ్రువీకరించుకున్నారు. రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు బయలుదేరి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నారు.

* మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్‌ ఎగరడం కలకలం రేపింది. స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది.. ఘటనపై వెంటనే డీజీపీ, గుంటూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి సమాచారం అందించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటనల్లో భద్రతా పరమైన అంశాల్లో వైఫల్యాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. పవన్‌ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తుండగా నకిలీ ఐపీఎస్‌ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న సమయంలో క్యాంపు కార్యాలయం పైనుంచి డ్రోన్‌ వెళ్లడం పవన్ భద్రత విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు.. డ్రోన్‌ని ఎవరు.. ఎక్కడి నుంచి ఆపరేట్‌ చేశారనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం, జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

* దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చింది. అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనుంది (Kolkata Doctor Murder Case). ‘‘నీకు శిక్ష తప్పదు. బాధితురాలిని నీవు చంపిన తీరుకు యావజ్జీవ కారాగార శిక్ష లేక మరణశిక్ష విధించవచ్చు. సోమవారం శిక్షఖరారు చేస్తాం’’ అని న్యాయమూర్తి అన్నారు. సీబీఐ సమర్పించిన ఆధారాల మేరకు సంజయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు నేపథ్యంలో భారీ భద్రత మధ్య సంజయ్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనను తప్పుడు కేసులో ఇరికించారని ఈ సందర్భంగా జడ్జికి సంజయ్ తెలిపాడు. అతనికి సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ తీర్పును తాను గౌరవిస్తున్నానని మృతురాలి తండ్రి కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు.

* దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధిపతి, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై రాళ్లు విసిరారు. (Arvind Kejriwal’s car attacked) బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాల పనిగా ఆప్‌ ఆరోపించింది. అయితే దీనిని ఆయన ఖండించారు. కేజ్రీవాల్‌ కారు ఇద్దరు యువకులను ఢీకొట్టిందని విమర్శించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్న కారుపై రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్‌ కారును అక్కడి నుంచి పంపివేశారు.

* శ్యామ‌ల ప‌రిస్థితి తెలుసుకున్న పూరి జ‌గ‌న్నాథ్ (Director Puri Jaganannath) కొడుకు ఆకాశ్ జ‌గ‌న్నాథ్(Akash Puri) ఆమెని అర్థిక సాయాన్ని అందించాడు. ప్ర‌స్తుతం శ్యామ‌ల ఉంటున్న ఉషా సీనియ‌ర్ సిటిజ‌న్స్ వెల్ఫేర్ డెవ‌ల‌ప్‌మెంట్ సోసైటీకి వెళ్లిన ఆకాశ్ శ్యామ‌ల‌ను క‌లిసి ఆమె బాగోగులు తెలుసుకున్నాడు. అనంత‌రం ల‌క్ష రూపాయలు చేతికి అందించి.. ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానంటూ భరోసాను అందించాడు ఆకాశ్. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

* తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై అగ్నిధారను కురిపించిన కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు (Daasarathi Krishnamacharyulu) శతజయంతి ఉత్సవాల (Centenary celebrations)ను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)కు కవిత లేఖ రాశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కూడలిలో దాశరథి విగ్రహాన్ని (Daasarathi Statue) ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని కోరారు. దాశరథి జన్మించిన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో స్మృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న దాశరథి గ్రంథాలయానికి ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని సూచించారు. దాశరథి సమగ్ర సాహిత్యాన్ని ప్రభుత్వమే ముద్రించి గ్రంథాలయంలో ఉంచడంతో పాటు అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు.

* తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఏకంగా కొండపైకి పెద్ద గిన్నె నిండుగా ఎగ్‌ పులావ్‌ తీసుకొని వచ్చారు. రాంభగీచ బస్టాండ్‌ సమీపంలో వారు గుడ్లు తినడం చూసిన ఇతర భక్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పులావ్‌ తీసుకుని తిరుపతికి వచ్చారు. అలిపిరి నుంచి తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో సెక్యూరిటీ తనిఖీని దాటుకుని వాళ్లు ఎగ్‌ పులావ్‌ను రాంభగీచ బస్టాండ్‌ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఓ పక్కన కూర్చొని కోడిగుడ్లు, పులావ్‌ తింటుండటం గమనించిన ఇతర భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆహారాన్ని సీజ్‌ చేశారు. తిరుమలలో మాంసాహారం నిషిద్ధం అని వారికి తెలిపారు. అయితే తమకు ఆ విషయం తెలియదని తమిళనాడు భక్తులు చెప్పడంతో.. పోలీసులు మందలించి వదిలేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z