Business

హైదరాబాద్‌లో…ఒక అరటిపండు ₹100-BusinessNews-Jan 18 2025

హైదరాబాద్‌లో…ఒక అరటిపండు ₹100-BusinessNews-Jan 18 2025

* ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ ( EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ చందాదారుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని సులభతరం చేసింది. ఇకపై యజమాని (ఎంప్లాయర్‌) గానీ, ఈపీఎఫ్‌ఓ ఆమోదం అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే సులువుగా మార్చుకునే వీలు కల్పించింది. ఇ-కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్‌ ఖాతాలను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ రెండు సేవలను శనివారం ప్రారంభించారు. వీటివల్ల ఈపీఎఫ్‌ఓ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు యజమానులపై పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.

* సాధారణంగా అరటిపళ్లను (Banana) డజన్ల లెక్కన విక్రయిస్తారు. డజను మహా అయితే.. ఓ రూ.60, రూ.70 ఉంటుంది. కానీ, ఒక అరటి పండు రూ.100 అంటే నమ్మశక్యంగా ఉందా? భారత పర్యటనకు వచ్చిన హగ్‌ అనే ఓ రష్యన్‌ యాత్రికుడికి సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. తోపుడు బండిపై అరటిపళ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి.. ఓ అరటి పండు ఎంత అని అడగ్గా.. అతడు రూ.100 అని సమాధానమిచ్చాడు. తప్పుగా విన్నానేమో అనుకొని మరోసారి అడిగినా అదే సమాధానం వచ్చింది. ఆశ్చర్యపోయిన అతడు.. అంత ధర చెల్లించలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో సహా పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. ఈ సంఘటన హైదరాబాద్‌లోనే జరిగినట్లు తెలుస్తోంది.

* బ్యాంక్‌ ఖాతాలతోపాటు డిపాజిట్‌ ఖాతాలు, లాకర్లు ఇక నుంచి కచ్చితంగా నామినీలు తప్పనిసరి చేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్‌ తాజాగా ఆదేశించింది. దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో బ్యాంక్‌ ఖాతాలకు నామినీలు లేరని, వెంటనే పాత, కొత్త ఖాతాలకు కచ్చితంగా నామినీ ఉండాల్సిందేనని శుక్రవారం ఆదేశించింది. డిపాజిటర్‌ మరణించిన వారి కుటుంబీలకు ఆయా డిపాజిట్లను సమర్పించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో చాలా డిపాజిట్‌ ఖాతాలకు నామినీలు లేరని సెంట్రల్‌ బ్యాంక్‌ గుర్తించింది. మరోవైపు, బ్యాంక్‌ ఖాతాకు సంబంధించి లావాదేవీలకోసం ‘1600ఎక్స్‌ఎక్స్‌’ ఫోన్‌ నంబర్‌ను వినియోగించుకోవాలని బ్యాంకులకు సెంట్రల్‌ బ్యాంక్‌ సూచించింది. ఆర్థిక మోసాలను నియంత్రించడానికి ఈ సరికొత్త నంబర్‌ను ప్రవేశపెట్టింది ఆర్బీఐ. అలాగే ప్రమోషనల్‌ కోసం బ్యాంకులు, ఇతర రెగ్యులేటెడ్‌ సంస్థలు 140ఎక్స్‌ఎక్స్‌ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించింది.

* దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో భారీ స్థాయిలో ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10-12 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకోనున్నట్లు ప్రకటించింది. గడిచిన రెండు త్రైమాసికాలుగా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకున్న సంస్థ..మూడో త్రైమాసికంలో 1,157 మంది సిబ్బంది తగ్గారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,32,732కి పరిమితమైనట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి త్రైమాసికంలో 2,500-3,000 మంది ఫ్రెషర్లు ఆన్‌బోర్డ్‌లో ఉంటున్నారని కంపెనీ మానవ వనరుల ప్రతినిధి సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,354 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 24.4 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.22,319 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

* దేశీయ బులియన్‌ మార్కెట్లో స్థానికుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.700 వృద్ధి చెంది రికార్డు గరిష్ట స్థాయికి చేరువైంది. శుక్రవారం తులం బంగారం ధర రూ.82,000 పలికింది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.81,300 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీలో వినియోగించే 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర వరుసగా మూడో రోజూ రూ.700 వృద్ధితో 81,600 ముగిసింది. గురువారం 99.5శాతం స్వచ్చత గల బంగారం తులం ధర రూ.80,900 వద్ద స్థిర పడింది. మరోవైపు, శుక్రవారం కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ. 93,500 వద్ద ముగిస్తే, బుధవారం రూ.94,000 వద్ద స్థిర పడింది. గతేడాది అక్టోబర్ 31న 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,400, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,000లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z