* దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో రూ.44,396 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. దేశీయంగా కార్పొరేట్ సంస్థల తృతీయ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉంటాయన్న అంచనాల మధ్య అమెరికా డాలర్, యూఎస్ బాండ్లు బలోపేతం కావడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. గత నెలలో రూ.15,446 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. దేశీయ, అంతర్జాతీయ ఒడిదొడుకుల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ఇండియా మేనేజర్ రీసెర్చ్- అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాత్సవ స్పందిస్తూ ‘ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కొనసాగుతున్నా కొద్దీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉంటారు. ఆర్ధిక వృద్ధిరేటుపై అనిశ్చితి, బలహీన ఆర్థిక ఫలితాలు దీనికి దోహద పడతాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 17 వరకూ ఎఫ్‌పీఐలు రూ.44,396 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెల రెండో తేదీ మినహా ఎఫ్‌పీఐలు నిత్యం ఈక్విటీ మార్కెట్లలో షేర్లు విక్రయిస్తూనే ఉన్నారు.
* గతవారం దేశీయ స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్‌ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.71,680.42 కోట్లు ఆవిరైంది. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా నష్టపోయాయి. గతవారం బీఎస్‌ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 759.58 పాయింట్లు (0.98శాతం), ఎన్‌ఎస్‌ఈ-50 సూచీ నిప్టీ 228.3 పాయింట్లు (0.97 శాతం) నష్టంతో ముగిశాయి. బీఎస్‌ఈ-10 సంస్థల్లో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసె (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పతనమైంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,948.4 కోట్ల నుంచి రూ.7,53,678.38 కోట్లకు పతనమైంది. ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత శుక్రవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు ఆరు శాతం నష్టపోయాయి. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.50,598.95 కోట్లు పతనమై రూ.14,92,714.37 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.20,605.92 కోట్లు కోల్పోయి రూ.5,53,152.52 కోట్లతో సరిపెట్టుకున్నది.
* నరేంద్ర మోదీ సర్కార్ మరో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నదా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఆరు దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చే దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టేయోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది. రెండో విడత సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈసారి బడ్జెట్ సెషన్‌లో కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి బిల్లును ప్రవేశపెడుతాం. ఇది పూర్తిగా కొత్త చట్టం. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించేయోచన లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ముసాయిదాను న్యాయమంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నదని అధికారులు వెల్లడించారు.
* ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని (Work Hours) ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై పలువురు ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై భారత్‌పే (BharatPe) సీఈవో నలిన్ నెగీ (Nalin Negi) స్పందించారు. పని గంటల సంఖ్య కంటే.. ఉత్పాదకత నాణ్యత ముఖ్యమన్నారు. ‘‘వారానికి 90 గంటలు పని చేయడం అంటే చాలా కష్టం. ఎన్ని గంటలు పని చేశామనే దాని కంటే.. దాని నుంచి వచ్చే ఉత్పాదకత నాణ్యత ముఖ్యమని నా అభిప్రాయం. మా సంస్థను ప్రారంభించి ఆరేళ్లు పూర్తయింది. ‘భారత్‌పే’ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే కంపెనీగా నిలవాలన్నదే మా అభిమతం. ఒక కంపెనీ ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు.. ప్రజలకు మంచి భవిష్యత్తును ఇచ్చేదిగా ఉండాలి. ప్రస్తుతం దాని పైనే మా దృష్టి కేంద్రీకరించాం’’ అని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నలిన్ నెగీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
* ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అమెరికాలో తన సేవల్ని నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపిస్తోంది. టిక్‌టాక్‌పై నిషేధం అమలులోకి రానున్న వేళ కంపెనీ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంంది.
* ఈ ఏడాదిలో దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.4 శాతంగా ఉండొచ్చని హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ అంచనా వేసింది. బలమైన ఆర్థికాభివృద్ధి, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు పెరుగుతున్న గిరాకీని ఇది సూచిస్తోందని వెల్లడించింది. గత అయిదేళ్లలో వేతనాలు స్థిరంగా పెరుగుతున్నాయని, 2020లో 8% పెరగ్గా, 2025లో ఇది 9.4 శాతానికి చేరొచ్చని టోటల్ రెమ్యూనరేషన్ సర్వేలో సంస్థ పేర్కొంది. దేశంలో 1550కు పైగా కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్జూమర్ గూడ్స్, ఆర్థిక సేవలు, తయారీ, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ రంగాల కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఆటోమోటివ్ రంగంలో వేతనాల పెంపు అత్యధికంగా 10% ఉండొచ్చని అంచనా. 2020లో ఇది 8.8 శాతంగా ఉంది. విద్యుత్ వాహనాలు, భారత్‌లో తయారీ కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయి. తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లో వేతనాల వృద్ధి 8% నుంచి 9.7 శాతానికి చేరనుంది. 2025లో ఉద్యోగులను పెంచుకోవడానికి చూస్తున్నట్లు 37% కంపెనీలు తెలిపాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z