NRI-NRT

ట్రంప్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం-NewsRoundup-Jan 20 2025

ట్రంప్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం-NewsRoundup-Jan 20 2025

* అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవం వేళ యూఎస్‌ క్యాపిటల్‌ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ చరిత్రాత్మక సన్నివేశాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులతో పాటు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన క్యాపిటల్‌ రోటుండాలో ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

* తన భర్త సైఫ్‌ అలీఖాన్‌ (Saif Alikhan)పై జరిగిన దాడికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాలు, వీడియోలపై కరీనా కపూర్‌ (Kareena Kapoor) మరోసారి స్పందించారు. ఆ ఘటనకు సంబంధించి ఓ ఛానల్‌ సృష్టించిన వీడియోను ఓ నటుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ఆమె రియాక్ట్‌ అయ్యారు. ‘‘దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి’’ అంటూ పోస్టు పెట్టారు. కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్‌ చేయడం గమనార్హం.

* ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో తెదేపా అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్‌లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. సీఎం చంద్రబాబు ఏం చెబుతారోనని వచ్చిన వ్యాపారవేత్తలు, యూరప్‌ ఎన్నారై తెదేపా సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదన్నారు. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యూరిచ్‌లో ఉన్నామా.. లేక జువ్వలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదని హర్షం (నవ్వుతూ) వ్యక్తం చేశారు.

* దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు.

* టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగబోతున్నాడు. అజింక్యా రహానె సారథ్యంలో రోహిత్ రంజీ మ్యాచ్‌ ఆడనున్నాడు. జనవరి 23-26 మధ్య ముంబయి, జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ముంబయి 17 మందితో జట్టును ప్రకటించింది. రోహిత్‌తోపాటు స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్ ముంబయి జట్టుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో అందుబాటులో ఉంటే ఆటగాళ్లు తప్పకుండా దేశవాళీ లీగ్‌ల్లో ఆడాలని ఇటీవల బీసీసీఐ (BCCI) ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్‌తోపాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శుభ్‌మన్ గిల్‌ (పంజాబ్‌), రిషభ్ పంత్ (దిల్లీ) కూడా రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు.

* అమెరికా అధ్యక్ష పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ జో బైడెన్‌ (Joe Biden) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష (Preemptive Pardons) ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు క్యాపిటల్‌ హిల్‌ దాడులపై విచారణ జరిపిన హౌస్‌ కమిటీ సభ్యులకూ ఉపశమనం కలిగించారు. ట్రంప్‌ (Donald Trump) అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు జో బైడెన్‌ వెల్లడించారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30గంటలకు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

* సంగారెడ్డిలో తన ఓటమికి మాజీ మంత్రి హరీశ్‌రావు కారణమంటూ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు సిద్దిపేటలో గెలుపొందడానికి ఎంత కష్టపడ్డారో.. నన్ను ఓడించేందుకు అంతే చెమటోడ్చారని అన్నారు. రాజకీయ వ్యూహం పన్ని, విజయావకాశాలను దెబ్బతీశారని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎప్పుడూ రివెంజ్‌ రాజకీయాలు చేయలేదు. ఏ పార్టీకైనా కక్షసాధింపు రాజకీయాలు మంచిది కాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్షసాధింపు గుణమే ఉండదు. అలాంటి చర్యలకు నేను పూర్తి వ్యతిరేకం. రాజకీయ యుద్ధం చేస్తాను తప్ప రివెంజ్‌ పాలిటిక్స్‌ చేయను. రివెంజ్‌ పాలిటిక్స్‌ కాంగ్రెస్‌ నేతలు చేసినా మంచిది కాదు. అలాంటి రాజకీయ నాయకులు ఏదో ఒక రోజు బాధపడక తప్పదు’’ అని జగ్గారెడ్డి అన్నారు.

* ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్‌కుమార్‌ మీనాను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్‌. మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఐజీపీ (ఆపరేషన్స్‌)గా సీహెచ్‌ శ్రీకాంత్‌ బదిలీ అయ్యారు. టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీపీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా జి. పాలరాజు, ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీపీగా బి. రాజకుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు.

* భార్య వేధింపులు తాళలేక బెంగళూరు టెకీ ఆత్మహత్య (Atul Subhash case) చేసుకొన్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన నాలుగేళ్ల మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవల అతుల్‌ తల్లి సుప్రీం కోర్టులో (Supreme Court) పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. బాలుడు తన తల్లి వద్దే ఉంటాడని తీర్పు చెప్పింది. తన మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని ఇటీవల అతుల్‌ తల్లి సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్‌ బివి. నాగరత్న, జస్టిస్‌ ఎస్‌సీ. శర్మ వీడియో కాల్‌ ద్వారా బాలుడిని చూశారు. చిన్నారితో మాట్లాడారు. అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ బాలుడు తన తల్లి వద్దే ఉంటాడని తీర్పునిచ్చింది. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు మరో వారం గడువు కావాలని బాలుడి నానమ్మ తరఫు న్యాయవాది కోరగా.. న్యాయస్థానం తిరస్కరించింది.

* ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ప్రోత్సహించినట్లు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన ఆయన జ్యూరిచ్‌లో అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. యూరప్‌లోని 12 దేశాల నుంచి వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువారుంటారని, అవకాశం ఉన్న ప్రతిచోటుకీ మనవాళ్లు వెళ్లిపోతారని చెప్పారు.

* ‘గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024’ అవార్డులను తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన 8 మంది జాబితాను వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ నెల 26న తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ ప్రకటన విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గత ఐదేళ్లుగా ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులు ఉంటాయి. అవార్డు కింద రూ.2 లక్షలు, జ్ఞాపిక ఇవ్వనున్నారు.

అవార్డుకు ఎంపికైన వారు..
దుశర్ల సత్యనారాయణ
అరికపూడి రఘు
పారా ఒలింపిక్‌ విజేత జీవాంజి దీప్తి
ప్రొఫెసర్‌ ఎం.పాండురంగారావు, పి.బి.కృష్ణభారతికి సంయుక్తంగా
ధ్రువాంశు ఆర్గనైజేషన్‌
ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి
ఆదిత్య మెహతా ఫౌండేషన్‌
సంస్కృతి ఫౌండేషన్‌

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z