* సంక్రాంతి సీజన్‌లో ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)కి రికార్డు స్థాయిలో ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. జనవరి 8 నుంచి 20 వరకు ఆర్టీసీ 9,097 ప్రత్యేక బస్సులు నడిపింది. ఈనెల 20న ప్రయాణికుల ద్వారా ఒకే రోజు రూ.23.71 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. మూడు రోజులపాటు రోజుకు రూ.20 కోట్లు చొప్పున ఆదాయం ఆర్జించినట్టు సంస్థ తెలిపింది. ఇలా ఆదాయం రావడం తొలిసారి అని సంస్థ పేర్కొంది. సంక్రాంతి సీజన్ మొత్తంలో కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే రూ. 21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ వెల్లడించింది. పండుగ సీజన్‌లో మొత్తం 7,200 బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించిన ఆర్టీసీ.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 9,097 ప్రత్యేక బస్సులను నడిపింది. డ్రైవర్లు, కండక్టర్ల అంకిత భావం, కృషి ఫలితంగానే ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సంక్రాంతి సీజన్‌లో ప్రత్యేక బస్సులన్నీ సాధారణ ఛార్జీలతోనే నడిపామని చెప్పారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకే మొగ్గు చూపారన్నారు.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అయిన జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా.. దాని ప్రభావం అటు స్విగ్గీపైనా పడింది. దీంతో రెండు కంపెనీల షేర్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి గానూ జొమాటో ఏకీకృత నికర లాభం రూ.59 కోట్లుగా పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 57.2 శాతం క్షీణత నమోదు చేసింది.
* దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ ‘అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్’(AESL), ఈ రోజు(మంగళవారం) రూ.25 వేల కోట్ల విలువైన భద్లా(రాజస్థాన్) – ఫతేపూర్(ఉత్తరప్రదేశ్) HVDC ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ఇది అదానీ గ్రూప్ సాధించిన అతి పెద్ద విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ఆర్డర్. తాజా ఆర్డర్‌తో కంపెనీ ఆర్డర్ బుక్ విలువ ఇప్పుడు రూ.54,761 కోట్లకు చేరుకుందని AESL ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. AESL, ఈ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్ నుంచి 6 గిగావాట్ల పునరుత్పదాక విద్యుత్‌ను ఉత్తరాదిలోని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలిస్తుంది. AESL, టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్(TBCB) పద్ధతి ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను సాధించింది. ఈ ప్రాజెక్ట్‌ను అధునాతన సాంకేతికత ద్వారా 4.5 ఏళ్లలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా దేశాలపై ట్రేడ్ టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెన్సెక్స్ ఓ దశలో 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ సైతం 23వేల స్థాయిని కోల్పోయింది. ఆఖర్లో సూచీలు కాస్త కోలుకున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.424 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 77,261.72 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,073.44) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 700 పాయింట్ల మేర కోల్పోయిన సూచీ.. తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది. మళ్లీ నష్టాల్లోకి వెళ్లిన సూచీ.. చివరి గంటలో భారీగా పతనమైంది. ఇంట్రాడేలో 75,641.87 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి పాయింట్ల 1235 పాయింట్ల నష్టంతో 75,838.36 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 320 పాయింట్ల నష్టంతో 23,024.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.58గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. జొమాటో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 79 డాలర్లు వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2732.20 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z