* జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) నిర్మిస్తున్న కిషన్ గంగ, రాట్లే జలవిద్యుత్‌కేంద్రాల (Hydro Projects) విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలను పరిష్కరించే అధికారం తనకు ఉందని ప్రపంచ బ్యాంకు నియమించిన తటస్థ నిపుణుడు స్పష్టం చేశారు. దీనిని భారత్ స్వాగతించింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. నిపుణుడి నిర్ణయం భారత వైఖరిని సమర్థించిందని పేర్కొంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం.. తటస్థ నిపుణుడికి మాత్రమే విభేదాలను పరిష్కరించే సామర్థ్యం ఉందని భారత్ విశ్వసిస్తోందని పేర్కొంది. దీనిపై పాకిస్థాన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
* అనంతపురం కలెక్టరేట్‌లో సమావేశం జరుగుతుండగా జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆన్‌లైన్ రమ్మీ ఆడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీశ్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగానూ, అనుకూలంగా జనం తరలివచ్చారు. సమావేశం జరుగుతున్నా.. తనకేమీ పట్టనట్టు DRO మలోల.. ఆన్‌లైన్ రమ్మీ ఆడుతూ కాలక్షేపం చేశారు. పక్కనే ఉన్నతాధికారులు ఉన్నా ఫోన్‌లో గేమ్స్ ఆడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
* ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు తెలిపారు. భగవంతుడి దయ అనంతం అని పేర్కొన్నారు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని క్యాప్షన్‌లో పెట్టారు. రామ్‌చరణ్ సతీమణి, అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లవ్ ఎమోజీలు జోడించారు. ఉపాసన స్పందిస్తూ.. ‘మీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాని ఆకాంక్షిస్తు్న్నా. శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం మీకు ఉంటుంది’ అని రిప్లై ఇచ్చారు.
* వరుసగా టెస్టు సిరీస్ వైఫల్యాలు చవిచూసిన టీమ్‌ఇండియా (Team India).. ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే సమరానికి ముందు.. పొట్టి ఫార్మాట్ కిక్కు అందించేందుకు సై అంటోంది. రేపటి నుంచే (జనవరి 22) ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ (IND vs ENG) ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 6 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలవనుంది. అలవోకగా సిక్సర్లు బాదే హిట్టర్లు.. బంతిని బౌండరీలు దాటించే బ్యాటర్లు.. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగే ఆల్‌రౌండర్లు.. ఇలా ఏ రకంగా చూసుకున్నా రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ పొట్టి సిరీస్ అభిమానులకు అసలు సిసలు వినోదాన్ని అందించడం ఖాయం. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఒక రోజు ముందే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది.
* ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎం చేయాలని పలువురు తెదేపా నేతలు కోరుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా తెదేపా, జనసేన (Janasena) నేతలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఈక్రమంలో జనసేన పార్టీ అధిష్ఠానం మంగళవారం స్పందించింది. ఇకపై ఈ వ్యవహారంలో పార్టీకి చెందిన నేతలెవరూ బాహాటంగా స్పందించవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
* సికింద్రాబాద్ భారాస ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అస్వస్థతకు గురయ్యారు. దెహ్రాదూన్ పర్యటనలో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
* ఛత్తీస్‌గఢ్-ఒడిశా (Chhattisgarh-Odisha) సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతుండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దులోని అటవీప్రాంతం రణరంగంలా మారింది. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. మరి కొంత మందికి తీవ్రగాయాలవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది. యూఎస్‌ఏ వైదొలిగినా డబ్ల్యూహెచ్‌వోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అనూహ్య నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడం కూడా ఉంది. కొవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహిరించినందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
* స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్‌తో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వరుస భేటీలు, చర్చలు జరుపుతోంది. ప్రముఖ బహుళజాతి సంస్థ యూనిలివర్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
* తుర్కియేలోని (Turkey) బోలు ప్రావిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ స్కీ రిసార్టు హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు.
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ((Delhi Assembly Election 2025) ాభాగంగా తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతల భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ((AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్ కార్యకర్తలను భయపెట్టడమే కాకుండా దాడులు సైతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికి ఆమె లేఖ రాశారు. ప్రధానంగా బీజేపీ(BJP) ఎంపీ రమేష్ బిధురి మేనల్లుడు తమ కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాడని ఆమె లేఖ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు.
* ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్‌షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z