ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 210 వ సాహిత్య సదస్సు ”సాహిత్య అద్భుత వర్ణనలు -వర్ణించ తరమా” అంశంపై జనవరి 19న డల్లాస్‌లో నిర్వహించారు. త్యాగరాజ కృతి ”బంటు రీతి కొలువు ఇయ్యవయ్యా రామ” ప్రార్ధన గేయాన్ని లెనిన్ వేముల ఆలపించి సభను ప్రారంభించారు. సమన్వయకర్త దయాకర్ మాడా వడ్డేపల్లి కృష్ణ రచించిన గీతాన్ని సభకు వినిపించారు. తెలుగు ఉపన్యాసకుడు డాక్టర్ కొచ్చర్ల కోట చలపతిరావును ముఖ్య అతిథిగా పరిచయం చేశారు.
“ప్రాచీన పద్య సాహిత్యం, ఆయా కవుల అద్భుత వర్ణన విధానం”పై ఆయన ప్రసంగించారు. కంద పద్యములు, సీస పద్యముల రూపకల్పనా మెళుకువలనూ సరళంగా వివరించారు. శబ్ద శాసనుడైన ఆదికవి నన్నయ, ఉభయకవి మిత్ర బిరుదాంకితుడైన తిక్కన, సూక్తి వైచిత్రి గుణసంపన్నుడైన ఎఱ్ఱన తెనిగించిన మహాభారతములోని కొన్ని పద్యాలను పాడి వినిపించారు. పోతన, డింఢిమ భట్టు, శ్రీనాధుడు, నన్నెచోడుడు, పాల్కురికి సోమన, శ్రీకృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ కవి, వేములవాడ భీమకవి, బద్దెన, ధూర్జటి, వేమన, కాసులపురుషోత్తమకవి, మారద వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవి, కంచెర్ల గోపన్న వంటి కవులు పద్య నిర్మాణముల్లో యతిప్రాసల వాడకంపై చర్చించారు. గజేంద్ర మోక్షం ,ప్రహ్లాద చరిత్ర కావ్య రచనలో కవులు వాడిన శబ్దసౌందర్యం, శబ్దాలంకార ప్రయోగం గురించి వర్ణించారు.
చంద్రశేఖర్ పొట్టిపాటి, డాక్టర్ యు. నరసింహారెడ్డి, సుబ్బు జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, కొండా తిరుమల రెడ్డి, జయకృష్ణ బాపూజీ, లెనిన్ వేముల, దయాకర్ మాడ, మాధవి లోకిరెడ్డి, కాశీనాధుని రాధ, రామ సీతామూర్తి, నిడిగంటి గోవర్ధనరావులు తమ స్పందనను తెలిపారు. అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి, సమన్వయకర్త దయాకర్ మాడ, కార్యవర్గ సభ్యులు చలపతిరావును సత్కరించారు. జయకృష్ణ బాపూజీ శ్రీనాధుడి చాటోక్తుల విశేషాలను, ”మన తెలుగు సిరి సంపదలు”శీర్షికలో నరసింహారెడ్డి, పద్య సౌగంధంలో కాశీనాధుని రాధ నన్నెచోడ విరచిత కుమార సంభవము పద్యాలను, దర్శకుడు జంధ్యాల జయంతి సందర్భంగా వారి స్మృతిలో వేటూరి రాసిన “అక్షర సంధ్యా వందనం” తొలి భాగాన్ని దయాకర్ మాడా తదితరులు చదివి వినిపించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z