* గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చే కాల్స్‌ని కనిపెట్టడం కోసం చాలా మంది కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) వినియోగిస్తుంటారు. ఆండ్రాయిడ్ యూజర్లు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. లైవ్ కాలర్ ఐడీ ఫీచర్ ఉండడమే అందుకు కారణం. ఇప్పటి వరకు కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితమైన ఈ సదుపాయాన్ని ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ట్రూకాలర్ బుధవారం వెల్లడించింది.
* యూజర్ల అవసరానికి తగ్గట్లు కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సప్ (WhatsApp) ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా మరో కొత్త సదుపాయంతో యూజర్లను ఆకట్టుకోనుంది. వాట్సప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) స్టోరీలుగా పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా (Meta) తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకుంది. సాధారణంగా నచ్చిన విషయాన్ని వాట్సప్‌లోని వారందరితోనూ పంచుకోవాలంటే స్టేటస్ ఆప్షన్ ఎంచుకుంటాం. ఇదే వాట్సప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోనూ స్టోరీగా పెట్టుకోవాలంటే స్టేటస్ ఎంపికలోనే ఇప్పటికే వాట్సప్‌లో పెట్టే స్టేటస్‌నే నేరుగా ఫేస్‌బుక్‌లో Facebook అనే కొత్త ఆప్షన్‌ను వాట్సప్ అందిస్తోంది. ఇకపై ఇందులో ఇన్‌స్టాగ్రామ్ కూడా యాడ్ కానుంది. అంటే ఇకపై వాట్సప్‌లో పెట్టే స్టేటస్‌ను నేరుగా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ స్టోరీలుగా పెట్టేయొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌నకు వెళ్లి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట.
* ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) అతిపెద్ద ఈవెంట్‌కు సిద్ధమైంది. బుధవారం రాత్రి గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ (Galaxy Unpacked Even) నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో ఎస్ 25 సిరీస్‌లో ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇదే ఈవెంట్‌లో ఎస్25 స్లిమ్ పేరిట మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్‌టెండెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌కు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కాలిఫోర్నియాలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 మొదలుకానుంది. శాంసంగ్ సహా వివిధ యూట్యూబ్ ఛానెళ్లలో ఈ ఈవెంట్‌ను తిలకించొచ్చు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ ఎస్ 25 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25+, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా పేరిట మూడు మోడళ్లు లాంచ్ చేయనుంది. ఈ మూడు క్వాల్‌కామ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో రానున్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రైవేటు బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం నాటి షాక్ నుంచి తేరుకున్నాయి. రోజంతా ఓ మోస్తరు స్థాయిలో కదలాడిన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్లు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 23,100 ఎగువన స్థిరపడింది. సెన్సెక్స్ ఉదయం 76,114.42 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,838.36) లాభాల్లో ప్రారంభమైంది. ఉదయమంతా స్వల్ప లాభాలకే పరిమితమైన సూచీ.. ఓ దశలో స్వల్పంగా నష్టపోయింది. ఆఖరి గంటన్నరలో కొనుగోళ్ల ఉత్సాహంతో సెన్సెక్స్ 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు బలపడి 86.33 వద్ద ముగిసింది.
* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటికే అందిస్తున్న రెండు రీఛార్జి ప్లాన్లపై ఇచ్చే డేటా ప్రయోజనాలను తొలగించింది. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ రీఛార్జితో అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్, 900 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇక రూ.1,999 రీఛార్జి ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ రెండు రీఛార్జి ప్లాన్లపై ఇంతకు ముందు డేటా కూడా అందించేది. తాజాగా ఆ సదుపాయాన్ని తొలగించింది. అయితే, దీనిపై ఎయిర్‌టెల్ వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ గందరగోళం నెలకొందని పేర్కొంది. సంబంధిత ప్లాన్లను వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z