* ఉబర్ (Uber), ఓలా (Ola) వంటి యాప్‌లు ఒకే దూరానికి ఆండ్రాయిడ్‌లో ఒక ఛార్జీని, ఆపిల్ ప్లాట్‌ఫామ్‌లో వేరొక ఛార్జీని (Cabs Rates) వసూలు చేస్తుండటంపై ఇటీవలే పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Consumer Affairs) ఉబర్, ఓలా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఒకే సర్వీసుకు రెండు సంస్థలూ వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా చర్యలకు ఉపక్రమించింది. ఛార్జెస్ వసూలు, అందుకు అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. వివక్షతకు సంబంధించి ఆందోళనల్ని పరిస్కరించాలని స్పష్టం చేసింది. ఈ పద్ధతిని స్పష్టంగా ధరలను ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. ఛార్జీల వసూలులో పారదర్శకత, న్యాయాన్ని నిర్ధారించడానికి వివరణాత్మక ప్రతిస్పందన కోరింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వారితో పోలిస్తే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడుతుందా? ఐఫోన్ వినియోగదారులను ధనికులుగా చూస్తూ కంపెనీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయా? చాలాకాలంగా వినియోగదారుల్లో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు సోషల్ మీడియా వేదికగా కొందరు ఇది నిజమేనని నిరూపించి, క్యాబ్ సర్వీసుల కంపెనీల తీరును ఎండగట్టారు. ఇటీవలే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి, ఈ ధరల్ని వేర్వేరు మొబైళ్లలో పోలుస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కారు మోడల్ ఆధారంగా అత్యధికంగా రూ.32,500 వరకు పెంపు ఉంటుందని తెలిపింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో రాణించాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 115 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ ఉదయం 76,414.52 (క్రితం ముగింపు 76,404.99) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రారంభంలోనే కాస్త ఒత్తిడికి లోనైన సూచీ ఇంట్రాడేలో 76,202.12 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఐటీ, ఆటో రంగ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగగా ఇంట్రాడేలో 76,743.54 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 115 పాయింట్లు లాభంతో 76,520.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా, జొమాటో, టెక్‌మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, ఐటీసీ, బజాజ్‌ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.97డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,755 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.47 వద్ద ముగిసింది.
* పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా రాబోయే యూనియన్ బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) కొత్త పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చూడవచ్చు. రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్‌ను (new tax slab)ప్రవేశపెట్టడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రకటించబోతున్నారు. రెండు పన్ను విధానాలలో రాయితీలు, పన్ను తగ్గింపుల కోసం వేతనజీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ. 7.75 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. ఇందులో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఇక సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అత్యధికంగా 30% పన్ను శ్లాబ్ కిందకు వస్తారు. వీటిలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది. “రెండు అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. బడ్జెట్ అనుమతించినట్లయితే, రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టవచ్చు” అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా నివేదిక ఉటంకించింది. ఈ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రభావంతో రూ.50,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల ఆదాయ నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినట్లు వివరించింది.
* అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ధగధగమని మెరుస్తున్నాయి. గురువారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ. 17 వృద్ధితో రూ.82,900లకు చేరుకుని తాజాగా మరో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బుధవారం తులం బంగారం ధర రూ. 82,730 వద్ద ముగిసింది. గతేడాది ఫిబ్రవరి 23న రూ.62,720 పలికిన పది గ్రాముల బంగారం ధర గురువారం (2025 జనవరి 23) రూ.82,900 పలికింది. అంటే 11 నెలల్లోనే బంగారం బంగారం తులం ధర రూ. 20,180 (32.17 శాతం) పెరిగింది. వరుసగా ఏడో సెషన్‌లోనూ 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.170 పెరిగి రూ.82,500లతో తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బుధవారం ఇదే బంగారం తులం ధర రూ.82,330 స్థిర పడింది. గత ఏడు సెషన్లలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.2,320 చొప్పున వృద్ధి చెందింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z