Business

ఇండిగో ఆదాయంలో 18శాతం క్షీణత-BusinessNews-Jan 24 2025

ఇండిగో ఆదాయంలో 18శాతం క్షీణత-BusinessNews-Jan 24 2025

* ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టీడీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనివల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్‌కు సూచించింది. ప్రతిచోటా అనుసరిస్తున్న టీడీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆయన తరఫున మరో లాయర్‌ అశ్వినీ దూబే ఈ వ్యాజ్యాన్ని వేశారు. టీడీఎస్‌ విధానం సమానత్వపు హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఎలాగైనా దీన్ని రద్దు చేయాలని కోరారు. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ వ్యాజ్యాన్ని తాము విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. టీడీఎస్‌ విధానం అన్ని దేశాల్లోనూ అమలవుతోందని గుర్తు చేసింది. కావాలంటే దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.

* ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) త్రైమాసిక ఫలితాల్ని శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 Results) కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.2,450.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,986.3 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం క్షీణత నమోదైనట్లు ఇండిగో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మొత్తం ఆదాయం రూ.20,062.3 కోట్ల నుంచి రూ.22,992.8 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఆక్యుపెన్సీ రేషియో 1.2 శాతం పెరిగి 86.9 శాతానికి చేరింది. మార్కెట్ వాటాలో ఇండిగో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 62.1 శాతంగా ఉండగా.. ఈ ఏడాది ఆ వాటాను 63.8 శాతానికి పెంచుకుంది. ఫలితాల నేపథ్యంలో నేటి స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ముగిసే సమయానికి ఇండిగో షేర్లు 0.66 శాతం లాభంతో రూ.4,162 వద్ద స్థిరపడ్డాయి.

* బులియన్ మార్కెట్‌లో బంగారం బుల్ పరుగులు తీస్తోంది. శుక్రవారం వరుసగా ఎనిమిదో రోజు 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో ఫస్ట్‌టైం రూ.83 వేల మార్క్‌ను దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితుల నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.200 పెరిగి రూ.83,100లతో తాజా జీవిత కాల గరిష్ట రికార్డు నమోదు చేసింది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,900 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం లాభాలతో దేశీయ బులియన్ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర జీవిత కాల గరిష్టాన్ని తాకిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాల వస్తువుల దిగుమతులపై విధించే సుంకాలు, ఇతర విధానాలపై అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు బంగారం స్వర్గధామంగా మారిందని సౌమిల్‌ గాంధీ తెలిపారు. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో రూ.82,700 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,500 వద్ద ముగిసింది.

* సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి స్మగుల్డ్ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు జప్తు చేశారు. నివియా క్రీమ్‌ బాక్స్‌లు, టైగర్ బామ్‌ బాటిళ్లలోపల భద్రపరిచిన బంగారం సదరు ప్రయాణికుడు తన లగేజీతోపాటు తీసుకు వచ్చాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. అతడి లగేజీని, వ్యక్తిగతంగా సునిశితంగా తనిఖీ చేయడంతో రూ.23,76,471 విలువైన బంగారం దొరికింది.

* దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ రోజంతా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ చివరకు నష్టాలతో ముగిసింది. గ్లోబల్‌ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నేపథ్యంలో రియాల్టీ, ఆయిల్‌ అండ్ గ్యాస్‌, హెల్త్‌ కేర్‌ స్టాక్స్‌ పతనం అయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు కూడా నిధులు ఉపసంహరించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. ఫలితంగా బీఎస్‌ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 329.92 పాయింట్లు (0.43శాతం) నష్టంతో 76,190.46 పాయింట్ల వద్ద ముగిసింది.ఇంట్రాడే ట్రేడింగ్‌లో 428.63 పాయింట్ల పతనంతో 76,091.75 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 113.15 పాయింట్ల పతనంతో 23,092.20 పాయింట్ల వద్ద ముగిసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z