* టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని హిందీలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్‌లో నటిస్తాడిని ప్రచారం జరిగింది. అయితే డేట్స్ కుదరక ఖురానా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ (లవ్ ఫిల్మ్స్) ఇప్పటివరకు స్పందించలేదు.
* సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు.తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది.ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.కాగా, సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది.
* పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు (Investments) వచ్చాయని.. చంద్రబాబు(Chandrababu) ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్‌బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే.. చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వస్తోంది’’ అని రోజా దుయ్యబట్టారు. ‘‘వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంతో చక్కగా మెయింటెయిన్ చేశారు. మూడు పోర్టుల పనులు పరుగులు పెట్టించారు. చంద్రబాబు, లోకేష్ తీరుతో దావోస్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్ ఫ్లైట్లు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్‌లోనూ అదే తరహా మభ్య పెట్టాలని చూశారు. కానీ, చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారు’’ అని రోజా చెప్పారు.
* ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏకీభవించారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని, ఆ విషయాన్ని ఆయనకే మీరు కాస్త కూర్చొని చెప్పండని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్‌ను ఎలా మరుగుపరుచాలో అమిత్ షాకు కాస్త దిశా నిర్దేశం చేయండి యోగీ జీ అంటూ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi assembly election 2025) ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఇటు ఆప్, అటు బీజేపీలు తమ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు సాగుతోంది ఇర పార్టీల ప్రచారం. దీనిలోభాగంగా యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడిన మాటలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
* బీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్‌లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్‌రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్‌రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది.
* ఆస్టేలియా ఓపెన్-2025(Australian Open 2025) టోర్నమెంట్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకొవిచ్(Novak Djokovic) ప్రయాణం ముగిసింది. గాయం కారణంగా శుక్రవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే అతడు వైదొలిగాడు. తద్వారా టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జొకొవిచ్ కలకు బ్రేక్ పడింది. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో ఏకంగా పది సార్లు టైటిల్ సాధించిన ఘనత జొకొవిచ్ సొంతం. కేవలం గతేడాది మాత్రమే అతడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీ ఫైనల్‌లో ఓడిపోయాడు. అయితే, ఈసారి మాత్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేసిన జొకొవిచ్‌కు గాయం రూపంలో దురదృష్టం ఎదురైంది.
* రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో వేధించిన కేసులో ఆరో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈనెల 27 నుంచి 29 వరకు తులసిబాబుకు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతను గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో సంభాషించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) సిద్ధంగా ఉన్నారని రష్యా వెల్లడించింది. అమెరికా నుంచి సమాధానం కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. అయితే, సమీప భవిష్యత్తులో అధినేతల మధ్య భేటీ ఉంటుందా?అన్న విషయంపై మాత్రం క్రెమ్లిన్ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్-పుతిన్‌ల మధ్య సంభాషణ ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో వర్చువల్‌గా మాట్లాడిన ట్రంప్.. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని భావిస్తున్నానని చెప్పారు. రష్యా, చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన.. చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే, ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు, యుద్ధం ముగింపునకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
* స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిందీ చిత్రం. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు వచ్చింది. అయితే దీనికి బ్రిటన్‌లోనూ అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ సినిమాను అడ్డుకోవడంపై తాజాగా భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
* అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’ (Pushpa 2) 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అనేక రికార్డులను సైతం బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త సినిమాలు వచ్చినా, చాలా థియేటర్స్‌లో ‘పుష్ప2’ హవా కొనసాగింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌కు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకూ ఈ మూవీ భారత్‌లో రూ.1230.55 కోట్లు (నెట్) వసూలు చేసిన ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గురువారం కూడా హిందీ బెల్ట్‌లో 8.05శాతం ఆక్యుపెన్సీతో టికెట్లు అమ్ముడుపోగా, రూ.50లక్షల వసూళ్లు వచ్చాయి.
* తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్షించారు. భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు (Services and Darshans) చేసినట్లు ఈవో పేర్కొన్నారు. అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ ఉండవని, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని వివరించారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని కోరారు. ఈ సమీక్షలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తదితరులు పాల్గొన్నారు.
* తమ దేశ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తే అమెరికాలోని వినియోగదారులే అధిక మొత్తం చెల్లించాల్సి ఉంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) హెచ్చరించారు. ఫిబ్రవరి 1 నుంచి (Canada) కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రూడో మరోసారి దీనిపై స్పందించారు. ‘జనవరి 20, ఫిబ్రవరి 1, ప్రేమికుల రోజు బహుమతిగా లేదా ఏప్రిల్ 1 ఇలా ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా తగినట్లు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయన నిర్ణయం అమలు చేస్తే అమెరికా వినియోగదారులే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్యలను మేము కోరుకోవడంలేదు.. ట్రంపే కావాలనుకుంటున్నారు. ఆర్థికవృద్ధిని పెంచుతానంటూ ఆయన పేర్కొన్న నేపథ్యంలో మాతో వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. కానీ, ఆయన అందుకు విరుద్ధంగా వెళ్తున్నారు’ అని ట్రూడో పేర్కొన్నారు.
* తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. గోదావరి నీళ్లను పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అని హరీశ్‌రావు తెలిపారు. గోదావరి నీళ్లను ఏపీకి తీసుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? బనకచర్ల ఆపాలని ఏపీకి కనీసం లేఖ కూడా రాయలేదు సీఎం రేవంత్ రెడ్డి. నాలుగు ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టులకు అనుమతుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బనకచర్లకు నిధుల కోసం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. చంద్రబాబు లేఖపై కేంద్రంలో దస్త్రం కదులుతోంది. చంద్రబాబు నవంబర్‌లో లేఖ రాస్తే సీఎం రేవంత్ ఏం చేశారు..? బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు..? బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. బనకచర్లపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
* రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ కలెక్టర్ పట్ల రుసరుసలాడారు. మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా.. ఆమెను కేంద్ర మంత్రుల ముందు అవమానించేలా మాట్లాడారు. కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ కలెక్టర్ పమేలా సత్పతిపై నోరు పారేసుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీంతో కలెక్టర్ అవమానంగా ఫీలై, కార్యక్రమం ముగిసే వరకూ ముభావంగా ఉన్నారు. కరీంనగర్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ పర్యటనలో మంత్రి పొంగులేటి.. కలెక్టర్ పమేలా సత్పతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. అసలు కామన్ సెన్స్ ఉందా..? అని కలెక్టర్ ముఖం చూస్తూ సీరియస్ అయ్యారు. ఎస్పీ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని.. కనీసం ఏసీపీ కూడా లేరని అన్నారు. కలెక్టర్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోరు పారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* ఏపీలోని రాజమండ్రి ఎయిర్‌పోర్టులో (Rajahmundry Airport) ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో (Collapse) కార్మికులు క్షేమంగా బయటపడ్డారు. రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను (International Airport) కల్పించేందుకు 2023లో నాటి కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొత్త టెర్మినల్ (New terminal ) భవన పనులకు భూమి పూజ చేశారు. సుమారు రూ. 350 కోట్లతో కొనసాగుతున్న పనులు ఊపందుకోవడంతో ప్రస్తుత కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan naidu) పరిశీలించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z