Business

₹350 నోటుపై RBI స్పష్టత-BusinessNews-Jan 26 2025

₹350 నోటుపై RBI స్పష్టత-BusinessNews-Jan 26 2025

* ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు గొప్ప వార్తను అందించింది. ప్రభుత్వం ప్రకారం.. పీఎఫ్‌ కొత్త విధానం వచ్చే జూన్ నాటికి అమలులోకి వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. ఏటీఎం (ATM) నుండి పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త యాప్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. ఈపీఎఫ్‌వో కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్ EPFO ​​3.0 ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ ఉద్యోగులకు అనుకూలమైన, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో మానవ జోక్యం ఉండదు. అంటే ఏ అధికారి క్లియరెన్స్ లేకుండానే పీఎఫ్ నుంచి డబ్బు విత్‌డ్రా అవుతుంది. ఈ సిస్టమ్ సభ్యులు తమ క్లెయిమ్‌లను ఒకే క్లిక్‌తో సెటిల్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

* రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (Macrotech Developers)ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.944 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఇళ్లకు డిమాండ్‌ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే క్యూ3లో ఆర్జించిన రూ. 503 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం అధికంగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2,958 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు చేరింది. ‘‘డిసెంబర్‌ క్వార్టర్‌లో మొత్తం రూ.4,510 కోట్ల ముందస్తు విక్రయాలు జరిగాయి. ప్రీ–సేల్స్‌ రూ.4వేల కోట్ల పైగా జరగడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. ఎన్నడూ లేని విధంగా ఈ క్యూ3లో మొత్తం రూ.4,290 కోట్ల వసూళ్లు జరిగాయి’’ అని కంపెనీ ఎండీ–సీఈవో అభిషేక్‌ లోధా తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో నికరలాభం రూ.883 కోట్ల నుంచి రూ.1,842 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.6,385 కోట్ల నుంచి రూ.9,749 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ముందస్తు విక్రయాలు 25% వృద్ది చెంది రూ.12,820 కోట్లు జరిగాయి.

* దేశ ఐటీ రంగం (IT sector) ఆటోమేషన్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పరివర్తన చెందుతోంది. గతంలో సాంప్రదాయకంగా శ్రామికశక్తి విస్తరణపై దృష్టి సారించిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత కలిగిన పనులను ఆటోమేట్ చేస్తోంది. ఫలితంగా నియామక విధానాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి.

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.350, రూ.5 నోట్లను విడుదల చేస్తున్నట్లు.. కొన్ని వార్తలు, నోట్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ వార్తలు నిజమేనా? లేక కేవలం పుకార్లు మాత్రమేనా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూ. 5 నోట్లు, రూ. 350 నోట్లు కేవలం పుకారు మాత్రమే అని ఆర్‌బీఐ వెల్లడించింది. మూడేళ్ళ క్రితం కూడా ఇలాంటి ఫొటోలే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవే ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చినట్లు చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z