* భారతీయ ప్రమాణాల రూపకల్పన, నాణ్యత నిర్ధారణలో కీలకపాత్ర పోషిస్తున్న బీఐఎస్, అత్యాధునిక పరీక్షా కేంద్రాల పెంపుతో మరింత పటిష్టమవుతోందని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ, ఐఎఎస్ తెలిపారు. మౌలాలిలోని బీఐఎస్ హైదారాబాద్ శాఖా కార్యాలయంలో వస్త్ర ఉత్పత్తులు, బంగారు ఆభరణాల పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన వస్తువులను వినియోగదారులకు చేర్చేందుకు, అన్నీ ఉత్పత్తులు ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 750కి పైగా వస్తువులు తప్పనిసరి ప్రమాణాలు అమలు జాబితాలో ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రతీ వస్తువునూ ఇందులో చేర్చి ప్రమాణాలు పక్కగా అమలు అయ్యేందుకు చూస్తామన్నారు. వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డిజిటల్ వేదికలపై ప్రమాణాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఐఎస్ ప్రయోగశాల డీడీజీ నిషాద్, దక్షిణ విభాగం డీడీజీ మీనాక్షి, హైదారాబాద్ శాఖా డైరెక్టర్ పీవీ శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.
* అల్ట్రాటెక్ సిమెంట్ జర్మనీకి చెందిన హైడెల్బర్గ్ గ్రూప్ ఇండియా బిజినెస్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియా లిమిటెడ్‌లో హైడెల్బర్గ్ మెటీరియల్స్ గ్రూప్‌కు 69.39 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ.3,381 కోట్లు. చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలో అల్ట్రాటెక్‌కు, హైడెల్బర్గ్ సిమెంట్‌కు మధ్య డీల్ కుదరొచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. బిజినెస్‌ను మరింతగా విస్తరించడానికి ఇతర సిమెంట్ కంపెనీలను అల్ట్రాటెక్ కొనుగోలు చేస్తోంది. కిందటేడాది ఇండియా సిమెంట్‌లో 55.49 శాతం వాటాను దక్కించుకుంది. స్టార్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాను కొనుగోలు చేసింది.
* డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లెక్సీలోన్స్ ఈ ఏడాది తెలంగాణలో భారీ సంఖ్యలో లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ తెలంగాణలో 2024 వరకు మొత్తం మీద రూ. 200 కోట్లకుపైగా అప్పులు ఇచ్చింది. 2024లో తెలంగాణ నుంచి 22 వేల దరఖాస్తులు వచ్చాయి. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ఎత్తున వర్కింగ్ క్యాపిటల్ లోన్లు, టర్మ్ లోన్లను అందించామని తెలిపింది. వీటిలో 70శాతం టోకు వ్యాపారులు, రిటైలర్లు, 20శాతం సర్వీస్ప్రొవైడర్లకు, 10శాతం తయారీదారులకు ఇచ్చామని ఫ్లెక్సీలోన్స్ కో–ఫౌండర్ మనీష్ లూనియా చెప్పారు.
* బ్యాంకుల లిక్విడిటీ (సరిపడినంత ఫండ్స్ ఉండడం) సమస్యలను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు మొదలు పెట్టింది. రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మూడు దశల్లో వీటిని కొనుగోలు చేస్తుంది. దీంతో పాటు డాలర్–రూపాయి బై/సెల్ స్వాప్ ఆక్షన్‌ను చేపడతామని ప్రకటించింది. ఇందులో భాగంగా 5 బిలియన్ డాలర్లను బ్యాంకుల నుంచి ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. ఇంతే మొత్తంలో రూపాయలను ఇస్తుంది. టెనూర్ ఆరు నెలలు. ఆ తర్వాత అంతే మొత్తంలో డాలర్లను రూపాయిలకు తిరిగి బ్యాంకులకు అమ్ముతుంది. ఈ ఆక్షన్‌ను జనవరి 31 న చేపట్టనుంది. బ్యాంకింగ్ సిస్టమ్‌లో లిక్విడిటీ పెంచేందుకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ఆక్షన్స్ కింద రూ.60 వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది.
* భారత పారాలింపిక్ ఆర్చర్ ‘శీతల్ దేవి’ (Sheetal Devi) ‘మహీంద్రా స్కార్పియో’ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఆమెను ఎంతగానో అభినందించారు. శీతల్ దేవిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె అద్భుతమైన సంకల్పం, దృఢత్వం, దృష్టిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఒక బాణాన్ని బహుమతిగా ఇచ్చింది. ఒక ఆర్చర్‌గా ఇది తన గుర్తింపు. శీతల్ మనందరికీ స్ఫూర్తిదాయకం.. ఆమె కొత్త ఎత్తులకు ఎదుగుతున్నప్పుడు.. స్కార్పియో ఎన్ (Scorpio N)తో చూడటం గర్వంగా ఉందని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. శీతల్ దేవి కేవలం 17 సంవత్సరాల వయస్సులో.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. 2022 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం.. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లలో ఒక స్వర్ణం, రజత పతకాలను సొంతం చేసుకుంది. క్రీడా రంగంలో ఆమె చేసిన సేవలకు గానూ.. భారత ప్రభుత్వం ఈమెను అర్జున అవార్డుతో సత్కరించింది.
* అమెరికాలోని యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico) పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా(Gulf of America)గా మార్చాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్(Google Maps) ఇటీవల ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. పేర్ల మార్పునకు సంబంధించి జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఎన్ఐఎస్)కు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ సమాచారం అందించింది. దాంతో గూగుల్ మ్యాప్స్‌లో ఈ మేరకు త్వరలో అప్డేట్ చేస్తామని ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. అమెరికా యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ అనే కొత్త పేరును ప్రతిబింబించేలా గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్లో అప్డేట్ అందించనుంది. అధికారిక ప్రభుత్వ వర్గాలు పేరు మార్చిన తర్వాత ఈ మార్పు అమల్లోకి రానునున్నట్లు పేర్కొంది. యూఎస్ వెలుపల వినియోగదారుల కోసం, గూగుల్ మ్యాప్స్ స్పష్టత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి పాత పేరు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను, కొత్త పేరు ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ను రెండింటినీ డిస్ప్లే చేయనుంది.
* మార్కెట్లో ఐఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొందరు డిస్కౌంట్స్ (Discounts) లేదా ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తారు. అలాంటి వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 15 కొనుగోలుపై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. యాపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) రూ.79,900 వద్ద మార్కెట్లో లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ లేకుండానే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.59,999లకు అందుబాటులో ఉంది. అంటే ఒక్కసారిగా ఐఫోన్ 15 ధర 19,091 రూపాయలు తగ్గింది. ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ కింద రూ. 45,200 తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ అనేది.. మీరు ఎక్స్ఛేంజ్ చేసుకునే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ తగ్గింపు లభిస్తుందని స్పష్టమవుతోంది.
* మంగళవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 535.23 పాయింట్లు లేదా 0.71 శాతం లాభంతో 75,901.41 వద్ద, నిఫ్టీ 128.10 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 22,957.25 వద్ద నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంక్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
* పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఇక రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మంగళవారం విడుదలైన పార్లమెంటరీ బులిటెన్ ప్రకారం.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెడుతారు. అంతకుముందు రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత అరగంట తర్వాత.. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z