NRI-NRT

చికాగోలో హైదరాబాద్ యువకుడు మృతి-NewsRoundup-Jan 29 2025

చికాగోలో హైదరాబాద్ యువకుడు మృతి-NewsRoundup-Jan 29 2025

* మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) మీడియా ప్రతినిధులను హెచ్చరించిన వీడియో వైరల్‌ కావడంతో అతనిపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అగ్రహం వ్యక్తం చేసింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుమ్మనూరు జయరాంకి ఫోన్‌ చేసి.. పాత్రికేయులను బెదిరించటం తెదేపా సంస్కృతి కాదని హెచ్చరించారు. పద్దతి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు ఘాటుగా స్పష్టం చేసినట్టు సమాచారం.

* విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠా గుట్టును మాదాపూర్ ఎస్‌వోటీ, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిదొడ్డి టీఎన్జీవోస్‌ కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా గత మూడు నెలలుగా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తోన్నట్టు గుర్తించారు. విటులు అపార్ట్‌మెంట్‌కు చేరుకోగానే టెలిగ్రామ్‌ యాప్‌లో వచ్చిన లింక్‌ను మాయం చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఆపరేషన్‌ సమయంలో ఇద్దరు లీజు ఏజెంట్లు, ఒక కస్టమర్‌తో పాటు తొమ్మిది మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* డిసెంబరు 5న 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు సంక్రాంతి తర్వాత అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్‌కు (pushpa 2 reload version) మరో మూడు నిమిషాలు యాడ్‌ చేసి, మొత్తం 3.43 గంటల నిడివితో రానుంది. ఈ ప్రకటనతో అల్లు అర్జున్‌ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక వ్యూస్‌, ట్రెండింగ్‌లో ‘పుష్ప2’ ఓటీటీలో రికార్డులను ‘రప్పా రప్పా’లాడించడం ఖాయమంటున్నారు.

* ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) చీఫ్‌, దిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు హరియాణా కోర్టు సమన్లు జారీ చేసింది. దిల్లీకి నీటి సరఫరాను అడ్డుకొనేందుకు హరియాణా పాలకులు యమునా నదిని విషపూరితం చేశారంటూ దిల్లీ ఎన్నికల వేళ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై హరియాణా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. యమునా నది నీటిని విషపూరితం చేసినట్లు కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగానే చేసిన అసత్య వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వినియోగిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మొదటి విడతలో మంజూరైన 72 వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావులేకుండా ల‌బ్ధిదారుల‌కు మేలు చేకూరేలా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల‌ని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపులను ఎక్కడి నుంచైనా నిరంతరం పర్యవేక్షించడానికి ఏఐని వినియోగించాలన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేసినట్లు మంత్రి వివరించారు. మొబైల్ యాప్ స‌ర్వే వివ‌రాల‌ను క్లౌడ్ ఆధారిత ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో సరిపోల్చి.. అనర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

* శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఉస్మాన్ ఖవాజా (147 బ్యాటింగ్; 210 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్ స్మిత్ (104 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్‌లు) శతకాలతో విరుచుకుపడ్డారు. ట్రావిస్ హెడ్ (57; 40 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం బాదాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith)కు టెస్టుల్లో ఇది 35వ శతకం. ఈ క్రమంలోనే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) (34 సెంచరీలు)ను స్మిత్‌ అధిగమించాడు.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) హత్యకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ సారథ్యంలోని ప్రభుత్వం కుట్ర పన్నిందని అమెరికా జర్నలిస్ట్‌ టకర్‌ కార్ల్‌సన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలు చేసినప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాల గురించి మాట్లాడలేదు. కార్ల్‌సన్‌ చేసిన ఆరోపణలపై రష్యన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ వయచెస్లావ్‌ వొలొదిన్‌ స్పందించారు. పుతిన్‌ హత్యకు ఎటువంటి పన్నాగం వేసినా.. అణుయుద్ధం (Nuclear War) సహా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

* అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఖైరతాబాద్‌ ఎం.ఎస్‌ మక్తాకు చెందిన మహమ్మద్‌ వాజిద్‌ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాజిద్‌ స్వయం కృషితో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూనే విద్యాభ్యాసం కొనసాగించాడు. గతంలో కాంగ్రెస్‌పార్టీ ఖైరతాబాద్‌ డివిజన్‌ యువజన నాయకుడిగా కూడా పని చేశాడు. ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌ మైనారిటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం Chicagoలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్‌ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారమందింది. సికింద్రాబాద్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

* మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో సర్పంచ్‌ దారుణ హత్య వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి ధనంజయ్‌ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేయడంపై ఆయన స్పందించారు. ఈ మేరకు దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. రాజీనామా చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ లేదా డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ చెప్పినా తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనన్నారు. ధనంజయ్‌ ముండే ప్రస్తుతం మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z