Kids

టాయిలెట్ సీటు నాకించి ర్యాగింగ్…విద్యార్థి ఆత్మహత్య-NewsRoundup-Jan 31 2025

టాయిలెట్ సీటు నాకించి ర్యాగింగ్…విద్యార్థి ఆత్మహత్య-NewsRoundup-Jan 31 2025

* సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు బాలకృష్ణ (Balakrishna)కు భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొని.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకంగా ఉందని చెప్పారు.

* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్‌ నియోజకవర్గ భారాస (BRS) నేతలు, కార్యకర్తలతో ఆయన తన ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రాన్ని కైలాసంలో పెద్దపాము మింగినట్లైంది. తెలంగాణకు ఇదో మంచి గుణపాఠం. కొందరు అత్యాశకు పోయి చెప్పుడు మాటలు విని మోసపోయారు. రైతు భరోసా ఇస్తారో.. లేదో. ఇచ్చినా కూడా మోసమే.. ఎన్నికల కోసమే ఇస్తారు. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. భారాస హయాంలో ఆదాయం ఏటా పెరిగితే ఇప్పుడు పడిపోయింది. రూ.13 వేల కోట్ల ఆదాయం పడిపోయిందని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి. మరో నాలుగు నెలల గడిస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. భూముల ధరలు బాగా పడిపోయాయి, రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతింది. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకెళ్తున్నారు. మళ్లీ పాత కాంగ్రెస్‌ మోపైంది. విద్యుత్ కోతలు ఉన్నాయి, తాగునీరు సరిగా రావడం లేదు. సాగునీటి ప్రాజెక్టులను పండపెట్టారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల కోసం పోరాడదాం. ఇప్పుడే కరెంటు కోతలు ఉంటే.. ఏప్రిల్‌, మే లో ఎలా ఉంటుందో? రాజ్యం అంటే ఇలానే ఉంటుందా? ఏడాది పూర్తయింది.. ఎండగట్టాలని మన వాళ్లు అంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగసభ పెట్టి ప్రభుత్వాన్ని ఎండగడదాం. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాను. కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు. నేను ఎన్నో ప్రభుత్వాలను చూశాను కానీ, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎడాదిలోనే ఇంత వ్యతిరేకత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వచ్చింది. కాంగ్రెస్‌ వాళ్లు కనిపిస్తే జనాలు కొట్టేలా ఉన్నారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో ఓటింగ్‌ పెడితే.. భారాస ప్రభుత్వం కావాలని ఓట్లు వేశారు. తెలంగాణ శక్తి ఏమిటో చూపించి కాంగ్రెస్‌ మెడలు వంచుదాం. ఫాం హౌస్… ఫాం హౌస్ అని అంటారు. ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి? కాంగ్రెస్ వాళ్లు ఇక్కడకు వస్తే తలో పార ఇచ్చి తవ్వుకోమందాం. కచ్చితంగా రాబోయేది మన ప్రభుత్వమే. అందులో అనుమానం ఏమీ లేదు’’ అని కేసీఆర్‌ అన్నారు.

* గత ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసులో కీలక నిందితులైన సస్పెండెడ్‌ మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వీరిద్దరికీ గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

* అకస్మాత్తుగా తల్లి మరణం.. ఆమె ఇద్దరు కుమార్తెలను మానసికంగా కుంగిపోయేలా చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో నాలుగు రోజులుగా ఉండిపోయారు కుమార్తెలు. ఈ హృదయవిదారక ఘటన సికింద్రాబాద్ వారాసిగూడలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌ వారాసిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలోని బౌద్ధనగర్‌లో లలిత అనే మహిళ మృతిచెందారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లలిత చనిపోయి నాలుగు రోజులవుతోందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె గుండెపోటుతో మరణించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. తల్లి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె ఇద్దరు కుమార్తెలు మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఏం చేయాలో తెలియక నాలుగు రోజులపాటు అదే ఇంట్లో ఒక గదిలో తల్లి మృతదేహాన్ని ఉంచి, మరో గదిలో వారిద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారాసిగూడ పోలీసులు తెలిపారు.

* విడుదలైన అన్ని భాషల్లో హిట్‌గా నిలిచిన ‘గజిని’ (Ghajini) సీక్వెల్‌ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీపై నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) మనసులో మాట బయటపెట్టారు. ముంబయిలో నిర్వహించిన ‘తండేల్‌’ హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ ఈవెంట్‌కు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘గజిని’ చిత్రీకరణ దశలో.. ఇది రూ.100 కోట్లు రాబట్టే తొలి సినిమా అవుతుందని ఆమిర్‌ మాతో ఛాలెంజ్‌ చేశారు. ఆ కోణంలోనే మూవీని మేం ప్రమోట్‌ చేశాం (నవ్వుతూ). ఆశించినట్టే ‘గజిని’.. రూ.100 కోట్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ 100 ఇప్పుడు 1000 అయింది. అందుకే రూ.1000 కోట్లు రాబట్టే చిత్రాన్ని మళ్లీ ఆమిర్‌ హీరోగా నిర్మించాలనుకుంటున్నా. అది ‘గజిని 2’ అవ్వొచ్చు’’ అని అన్నారు.

* ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను భారాస అప్పుల రాష్ట్రంగా మార్చిందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ‘‘రూ.7లక్షల కోట్లు అప్పు చేసి 2023లో మాకు అప్పగించారు. గత ప్రభుత్వం రూ.18వేల కోట్లే రుణమాఫీ చేసింది. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. మేం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతాం. ఫామ్‌హౌస్‌లో ఉండి సోది చెప్పటం కాదు.. అసెంబ్లీకి రండి.. లెక్కలు చెబుతాం. ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశామో శాసనసభలో పెడతాం. కేసీఆర్‌కు చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. రైతు భరోసా ఎగ్గొడతారని కేసీఆర్‌ చెబుతున్నారు. మీలాగా మాట తప్పే వ్యక్తిని కాదు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అని అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్‌ది. పదేళ్లు పాలించి ప్రజల దగ్గరకు వెళ్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి.. ఇక్కడి ప్రాజెక్టులను పండబెట్టారు’’

* పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని మోదీ(PM Modi) చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. రేపటి బడ్జెట్‌లో పేద, మధ్యతరగతితో పాటు మహిళలకు పెద్దపీట వేస్తారన్న అంచనాలు పెంచేందుకు కారణమయ్యాయి. పేదలు, మధ్యతరగతిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలంటూ ఆయన పేర్కొనడం ఇందుకు నేపథ్యం. దీంతో పాటు సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడులు, ఆవిష్కరణలే లక్ష్యంగా దూసుకెళుతున్నామని ఆయన పేర్కొనడంతో ప్రజాకర్షక పథకాలకు ఈసారి పెద్దపీట వేస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. వృద్ధికి ఊతం ఇచ్చేలా మధ్యతరగతికి పన్ను ప్రయోజనాలు, మహిళలకు సంబంధించిన పథకాలు ప్రకటించొచ్చన్న ఆశలు రేపాయి.

* తన కుమారుడితో టాయిలెట్‌ సీటును బలవంతంగా నాకించారని, తల లోపల ఉంచి ఫ్లష్‌ చేశారని విద్యార్థి తల్లి ఆరోపించింది. (Forced to lick toilet seat) స్కూల్‌లో నిరంతరం ర్యాగింగ్‌, బెదిరింపులు అతడ్ని ఆత్మహత్యకు ప్రేరేపించాయని తెలిపింది. సీఎం కార్యాలయంతోపాటు, డీజీపీకి ఈ మేరకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. జనవరి 15న కేరళలోని ఎర్నాకుళంలో అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ 26వ అంతస్తు నుంచి కిందకు దూకి 15 ఏళ్ల మిహిర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణంపై కలత చెందిన తల్లిదండ్రులు అతడి సూసైడ్‌కు దారి తీసిన కారణాల సమాచారాన్ని సేకరించారు. మిహిర్‌ స్నేహితులు, స్కూల్‌లోని విద్యార్థులను కలిశారు. అలాగే సోషల్ మీడియా పోస్ట్‌లు, మెసేజ్‌లను పరిశీలించారు. స్కూల్‌లో విద్యార్థుల ర్యాగింగ్‌, హింసను తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకుని షాక్‌ అయ్యారు.

* ఏపీ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీపై ఏపీ సీఎం, మానవవనరుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పందించారు. ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో కూటమి నేతలతో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఏవైనా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్‌ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z