Business

ట్రంప్ ప్రభావంతో ఆగని నష్టాలు. డాలరు-రూపాయి రికార్డు-BusinessNews-Feb 03 2025

ట్రంప్ ప్రభావంతో ఆగని నష్టాలు. డాలరు-రూపాయి రికార్డు-BusinessNews-Feb 03 2025

* కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన దారులందరికీ ఒకేరకమైన టోల్‌ విధానం అమలయ్యేలా ‘ఏకరీతి టోల్‌ విధానం’పై (toll policy) కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఇది చెక్‌ పెట్టనుందని తెలిపారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రోడ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అధిక టోల్‌ ఛార్జీలు విధిస్తుండడంపై వాహనదారుల్లో అసంతృప్తి గురించి ప్రస్తావించిన సందర్భంలో ఏకరీతిన టోల్‌ విధానం గురించి గడ్కరీ మాట్లాడారు. అయితే, దీనికి సంబంధించిన అదనపు వివరాలేవీ పంచుకోలేదు. ప్రస్తుతం మన రోడ్లు అమెరికా రహదారులతో సమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. తొలుత గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే టోల్‌ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు.

* డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ (Rupee value) రోజురోజుకూ క్షీణిస్తున్న వేళ ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే దీనిపై స్పందించారు. విలువ క్షీణించడంపై ఆందోళన చెందడం లేదని, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దీని గురించి చూసుకుంటోందని విలేకరులతో అన్నారు. రూపాయి విలువ అనేది ఎవరూ నియంత్రించేది కాదని, దానికంటూ ఒక స్థిరమైన ధర అంటూ ఉండదని పేర్కొన్నారు. విదేశీ మదుపర్ల నిధులు తరలుతుండడం కూడా రూపాయి విలువ క్షీణతకు ఓ కారణమని పాండే అన్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. ముఖ్యంగా కెనడా, మెక్సికో, చైనా దేశాలపై ట్రంప్‌ సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా రూపాయి విలువ తాజాగా మరో 67 పైసలు క్షీణించి 87.29 వద్ద జీవనకాల కనిష్ఠానికి చేరింది.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. దేశీయంగా వినియోగం పెంచేలా బడ్జెట్‌లో కొన్ని నిర్ణయాలు వెలువడినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడికి కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజేసిన వాణిజ్య యద్ధ భయాలే దీనికి కారణం. కెనడా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకం విధిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దాదాపు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

* దేశీయంగా వృద్ధి నెమ్మదించిన వేళ వినియోగం పెంచేలా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కేంద్రం బడ్జెట్‌లో (Union budget) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్నూ (Income tax) చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనికి ఊతం ఇచ్చేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) సైతం 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాదిగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత పరిధి 6 శాతానికిలోపే ఉండడంతో వృద్ధికి బాటలు వేసేలా ఆర్‌బీఐ నుంచి రేట్ల కోత నిర్ణయం వెలువడొచ్చని అంచనా వేస్తున్నారు.

* రైళ్లకు సంబంధించిన అన్ని సేవలూ ఒకేచోట అందించే ఓ సూపర్‌ యాప్‌ను భారతీయ రైల్వే (Indian railways) తాజాగా అందుబాటులోకి తెచ్చింది. స్వరైల్‌ (SwaRail superapp) పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. అయితే, దీన్ని అందరూ వాడలేరు. ఎందుకంటే ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. పరిమిత సంఖ్యలో యూజర్లు మాత్రమే వాడేందుకు వీలుంటుంది. కాబట్టి అందరూ దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడం కుదరదు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లపై వెయ్యి మంది చొప్పున తొలుత రైల్వేశాఖ ఈ అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటికే బీటా టెస్టింగ్‌ ఎంచుకున్న వారి సంఖ్య పూర్తయ్యిందని ఈ యాప్‌ను రూపొందించిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) తెలిపింది. బీటా టెస్టర్ల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మార్పులు, చేర్పులతో పౌరులకు ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. అంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. బీటా టెస్టర్ల సంఖ్యను మున్ముందు పెంచినా మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ యాప్‌ ఫీచర్లను చూస్తే.. రిజర్వ్‌ టికెట్లతో పాటు, అన్‌రిజర్వుడు టికెట్లను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై బుక్‌ చేసుకోవచ్చు. పార్సిల్‌, సరకు రవాణా వంటి సేవలనూ పొందొచ్చు. పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ను చెక్‌ చేయడంతో పాటు, రైల్లోకి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు. రైల్వేకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే వాటినీ ఇందులోనే పొందుపరిచే వీలుంటుంది. ప్రస్తుతానికి ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లో, యాప్‌ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో సేవకు ఒక్కో యాప్‌ ఉంది. వీటన్నింటినీ ఒకేచోట అందించడమే ఈ సూపర్‌ యాప్‌ లక్ష్యం. మున్ముందు మరిన్ని సేవలను ఇందులో జోడించే అవకాశం ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z