Politics

జగన్ 2.0 వేరేగా ఉంటుంది-NewsRoundup-Feb 05 2025

జగన్ 2.0 వేరేగా ఉంటుంది-NewsRoundup-Feb 05 2025

* అపర కుబేరుడైన వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (Bill Gates) ప్రేమలో పడ్డట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 62 ఏళ్ల పౌలా హర్డ్‌ (Paula Hurd)తో బిల్‌గేట్స్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. 2023లో ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ, గతేడాది జరిగిన ఒలింపిక్స్‌, ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు సహా పలు ఈవెంట్స్‌లో ఇద్దరూ జంటగా దర్శనమిచ్చారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పౌలా హర్డ్‌తో రిలేషన్‌షిప్‌పై బిల్‌గేట్స్‌ తాజాగా స్పందించారు. ఆమెను తన ‘సీరియస్‌ గర్ల్‌ఫ్రెండ్‌’గా (Serious Girlfriend) అభివర్ణించారు. ‘పౌలా అనే సీరియస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండటం నా అదృష్టం’ అని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు. తామిద్దరం చాలా సరదాగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

* తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తెలుగు, తమిళ సీనియర్‌ నటి పుష్పలత (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పుష్పలత చెన్నైలోని తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబీకులు వెల్లడించారు. పుష్పలత 1958లో ‘సెంగోట్టై సింగం’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు వందకుపైగా చిత్రాల్లో నటించారు. 1961లో కొంగునాట్టు తంగం అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. నానుమ్ ఒరు పెణ్ అనే సినిమాలో నటుడు ఏవీఎం రాజన్‌కు జోడీగా నటించారు.

* ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala Ramanaidu ) మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో చెత్త సీఎం అంటే వైఎస్‌ జగన్‌ ( YS Jagan ) అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటేశారు.

* టీమ్‌ ఇండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌ (auto driver)తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించే ద్రవిడ్‌ ఇలా అసహనాన్ని ప్రదర్శించడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాహుల్‌ ద్రవిడ్‌ మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కన్నింగ్‌హామ్ రోడ్డు (Cunningham Road)లో తన కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ద్రవిడ్‌ కారును ఓ ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే ద్రవిడ్‌ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్‌ వెంటనే కారు దిగి సదరు ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. కన్నడ భాషలో ఆటో డ్రైవర్‌పై అసహనాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

* ‘‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

* కుంభమేళాకు వెళ్లడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(డీకేఎస్‌) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించడం అనేది తన వ్యక్తిగత విషయమని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు. కుంభమేళాకు వెళ్తానని తాను చెప్పడంపై కర్ణాటక ప్రతిపక్షనేత ఆర్‌.అశోక్‌ చేసిన విమర్శలకు శివకుమార్‌ ఘాటుగా స్పందించారు. ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే కుంభమేళాపై చేసిన వ్యాఖ్యలకు తన కుంభమేళా పర్యటనకు లింకు పెట్టడంపై శివకుమార్‌ మండిపడ్డారు. అశోక్‌ కాదు ప్రధాని మోదీ, అమిత్‌ షా ఈ విషయంపై మాట్లాడితేనే తాను సమాధానం చెప్తానన్నారు. గంగా,కావేరీ,కృష్ణా నదులు ఎవరికీ చెందినవి కాదని, నీటికి రంగు రుచి ఉండదన్నారు. అశోక్‌ తనపై కాదని, ప్రధాని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన అంశంపై విమర్శలు చేయాలని సూచించారు.

* విమానంలో మొత్తం 205 మంది భారతీయలను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. అయితే విమానంలో 104 మంది మంది భారతీయులే ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్‌,హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు.

* 2019 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కస్టడీలో ఉన్నప్పుడు తనను హింసించారంటూ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. కేసు నమోదైనవారిలో నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి, జమ్మలమడుగు మాజీ డిఎస్పీ నాగరాజు, యర్రగుంట్ల మాజీ సీఐ ఈశ్వరయ్య, కడప మాజీ జైలు సూపరిండెంట్ ప్రకాష్ లు ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z