NRI-NRT

అమెరికా నుండి మరో 487 మంది అక్రమ భారతీయులు వెనక్కి-NewsRoundup-Feb 07 2025

అమెరికా నుండి మరో 487 మంది అక్రమ భారతీయులు వెనక్కి-NewsRoundup-Feb 07 2025

* తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌ను పౌరసరఫరాలశాఖ కోరింది. రేషన్‌ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

* ‘‘2016లో నటించిన తొలి చిత్రం ‘కిరిక్‌ పార్టీ’ విడుదలైనప్పటి నుంచి నేషనల్‌ క్రష్‌ అనే టైటిల్‌ మొదలైంది. అంతకంటే ముందు, చదుకునే రోజుల్లో కాలేజీ మొత్తానికి నేనే క్రష్‌ని. ఆ తర్వాత కర్ణాటక క్రష్‌.. సినిమాల్లోకి వచ్చాక నేషనల్‌ క్రష్‌ అయ్యా. యువతతోపాటు ప్రేక్షకులందరూ నన్ను అమితంగా ఇష్టపడటం చూస్తుంటే ‘నేషనల్‌ క్రష్‌’ అనే దశ నుంచి ముందుకు వచ్చినట్లు ఉంది. ఇప్పుడెవరైనా ప్రేక్షకులు నన్ను కలిసి.. ‘‘ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే ఉన్నారు’’ అని చెబుతుంటే నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకుల జీవితాల్లో భాగమైపోయాననిపిస్తుంది’’ అని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు.

* వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్‌ జీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాకిచ్చింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఈడీ తేల్చింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. ఎంవీవీ, జీవీ ఇళ్లు, కార్యాలయాల్లో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించింది. నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలు సహా, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

* అక్రమ వలసదారులను తరలింపు ప్రక్రియను జోరుగా కొనసాగిస్తున్న అమెరికా (USA).. 104 మంది భారతీయులను వెనక్కి పంపించిన (US Deportation) విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగశాఖ (MEA) వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం భారత్‌కు తెలియజేసినట్లు పేర్కొంది. వలసదారులను సంకెళ్లు వేసి తరలిస్తున్నారని వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. వీటికి సంబంధించి అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అక్రమంగా అమెరికా వెళ్లినట్లు గుర్తించిన భారతీయులను సురక్షితంగా తీసుకువస్తామన్నారు. సైనిక విమానాల్లో తరలిస్తోన్న ప్రక్రియపై మిస్రీ స్పందిస్తూ.. తాజా బహిష్కరణ ప్రక్రియ మునుపటి విమానాలతో పోలిస్తే భిన్నంగా ఉందన్నారు. అయినప్పటికీ.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అమెరికా ప్రభుత్వ విధానంలోనే పేర్కొన్న ఈ సందర్భంగా విషయాన్ని గుర్తుచేశారు.

* భారత్ – పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌లంటే ఏ క్రికెట్‌ అభిమానికైనా ఆసక్తి లేకుండా ఉంటుందా? గతంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేవి. ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయో.. అప్పట్నుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్ – పాక్‌ మ్యాచ్‌ను చూసే అవకాశం ఫ్యాన్స్‌కు వస్తోంది. అయితే, ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన ఫీట్‌ను టీమ్‌ఇండియా స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే (Anil Kumble) 26 ఏళ్ల కిందటే సాధించాడు. ఆ రోజు కొందరు పరీక్షలకు హాజరుకాలేదు. మరికొందరైతే పెళ్లిళ్లకూ వెళ్లలేదు. ఈ అనుభవాలను తనతో ఫ్యాన్స్‌ పంచుకొన్నట్లు అనిల్ కుంబ్లే వెల్లడించడం గమనార్హం.

* అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న భారత కాన్సులేట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇండో అమెరికన్‌ నాయకురాలు క్షమా సావంత్‌కు (Kshama Sawant) అత్యవసర వీసా నిరాకరించడంతో ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ శాంతిభద్రతల సమస్య నెలకొందని, వెంటనే స్థానిక అధికారులను పిలవాల్సి వచ్చిందని భారత కాన్సులేట్‌ (Indian Consulate in Seattle) వర్గాలు వెల్లడించాయి.

* అయోధ్య (Ayodhya)లోని రామ మందిరానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల రాముడి ఆలయ దర్శనం వేళల్లో (ayodhya ram mandir darshan time) స్వల్ప మార్పు చేసింది. ఇకపై ఉదయం 6గంటల నుంచే భక్తులకు బాల రాముడి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. ప్రస్తుతం ఉదయం 7గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా.. దీన్ని గంట ముందుకు జరపడం ద్వారా ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.

* ఫిబ్రవరి 9లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆపరేషన్స్‌ ఈడీ మునిశేఖర్‌కు జనవరి 27న సమ్మె నోటీసుతోపాటు 21 డిమాండ్ల పత్రాన్ని కార్మిక సంఘాల నేతలు అందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 10న సాయంత్రం 4గంటలకు చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీకి కార్మికశాఖ కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించినట్టు కార్మికశాఖ పేర్కొంది.

* ట్రాక్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంలో విజయవాడ రైల్వే డివిజన్ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 1,287.76 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అప్‌గ్రేడ్‌ చేసే పనులను ముమ్మరం చేసింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా డివిజన్ పరిధిలోని 58 శాతం ట్రాక్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిడదవోలు-భీమవరం, నరసాపూర్-గుడివాడ-మచిలీపట్నం, కాకినాడ పోర్టు – సామర్లకోట మార్గంలో 473.4 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్లు సీనియర్‌ డివిజినల్‌ ఇంజినీరు వరుణ్‌బాబు వెల్లడించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై అన్ని ధ్రువపత్రాలు మొబైల్‌ ఫోన్‌లోనే జారీ చేయనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ తెలిపారు. ఇందుకోసం ప్రతి పౌరుడికి డిజిలాకర్‌ సదుపాయం కల్పిస్తామని.. అన్ని పత్రాలను వాట్సప్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. శుక్రవారం వాట్సప్‌ గవర్నెన్స్‌పై ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ సమీక్ష నిర్వహించారు.

* తిరువూరు తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్‌ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడిన తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారని.. ఆత్మహత్యాయత్నానికి ముందు డేవిడ్‌ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం అతను విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డేవిడ్‌ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో బయటకు రాకుండా కొలికపూడి నిన్న అందరినీ బెదిరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్‌ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న జరిగే ఐబీసీ 2025 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో పదేళ్ల పాలనలో కేటీఆర్‌ చేసిన కృషి అద్భుతమని నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ ఈ సందర్భంగా కొనియాడింది. హైదరాబాద్‌ను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని ప్రశంసించింది. తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకమని అభినందనలు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z