NRI-NRT

“విదేశీ విద్యా పథకం” విద్యార్థుల అవస్థలు-NewsRoundup-Feb 08 2025

“విదేశీ విద్యా పథకం” విద్యార్థుల అవస్థలు-NewsRoundup-Feb 08 2025

* ఆప్‌ నుంచి విముక్తి లభించిందని దిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారని, దిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Modi) అన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా భాజపా శ్రేణులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మోదీని గజమాలతో సత్కరించారు. విజయోత్సవ సభలో ప్రధాని మాట్లాడుతూ.. దిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు. దిల్లీ విజయంతో భాజపా కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందన్నారు.

* విదేశీ విద్య పథకం కింద అమెరికాలో చదువుకుంటున్న అన్ని కులాల విద్యార్థుల కోసం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ తెలిపారు. విద్యార్థులు భయపడవద్దని ధైర్యం చెప్పారు. విదేశీ విద్య పథకంతో అమెరికా వెళ్లి గోస పడుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి జూమ్‌ మీటింగ్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల గోడును ఆలకించారు. అనంతరరం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్‌ మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్ షిప్‌ను అందించిందని సత్యవతి రాథోడ్‌ తెలిపారు. 127 మంది ఎస్టీ విద్యార్థులకు మొదటి విడతగా రూ.10లక్షలు చెల్లించామని, రెండో దఫా చెల్లించే సమయానికి ఎన్నికలు వచ్చాయని పేర్కొన్నారు. 127 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ అందక అమెరికాలో అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండో దఫా స్కాలర్‌షిప్‌ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి అందివ్వలేదని విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కమిటీ వేయలేదని ఆరోపించారు. రూ.25 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండో ధఫా డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు పార్ట్‌ టైం ఉద్యోగాలు చేయకుండా చేస్తున్నారని సత్యవతి రాథోడ్‌ తెలిపారు. దీంతో అమెరికాలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను కూడగట్టి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని అన్నారు. అన్నికులాల విద్యార్థుల కోసం పోరాటం చేస్తామని.. విద్యార్థులు భయపడవద్దని భరోసానిచ్చారు.

* దిల్లీ ఓటర్లకు దేశంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. ఎక్కువ మధ్యతరగతి ఉద్యోగ ఓటర్లతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వారితో సహజంగానే చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆయన సారథ్యంలో ఏర్పడిన ఆమ్‌ఆద్మీ పార్టీకి వారు మద్దతు ప్రకటించారు. స్థాపితమైన కొద్దినెలల్లోనే 2013లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను ఏకంగా 28 సీట్లు గెలుచుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా కొద్దికాలానికే పడిపోవడంతో 2015లో ఎన్నికలు నిర్వహించగా ఏకంగా 67 సీట్లు గెలవడంతో ప్రధాన రాజకీయపక్షాలు ఉలిక్కిపడ్డాయి. తరువాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకున్నారు. మరోసారి విజయం సాధిస్తామని ఆశిస్తున్న తరుణంలో ఓటమి పాలవడం గమనార్హం.

* ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత దిల్లీ (Delhi) పీఠాన్ని కాషాయ పార్టీ దక్కించుకుంది. దేశ రాజధాని అధికారాన్ని ఎవరికి అప్పగించనుందో అనే అంశం ఆసక్తికరంగా మారింది. సీఎం రేసులో ప్రధానంగా ఉన్న పర్వేశ్ సాహిబ్‌ సింగ్ వర్మ (Parvesh Verma).. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘మార్పును కోరుకుంటూ భాజపాపై విశ్వాసం ఉంచి గెలిపించిన దిల్లీ ప్రజలకు నా ధన్యవాదాలు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వంతో కలిసి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అయితే.. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది’’ అని ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు పర్వేశ్ సమాధానమిచ్చారు. కాగా.. దిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై భాజపా అభ్యర్థి పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

* అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని రాజకీయాల్లోకి వచ్చిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.. చివరికి ఆయనే అవినీతికి చిరునామాగా మారిపోయారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిలో కూరుకుపోతే ఏం జరుగుతుందో దిల్లీ ఫలితాలు ఉదాహరణ అని పేర్కొన్నారు.

* ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉన్న నమ్మకంతోనే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. దిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దిల్లీ (Delhi News) ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారన్నారు. ‘‘దేశ రాజధాని దిల్లీలో ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి భాజపాను గెలిపించారు. దేశంలోని ప్రజలందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన గెలుపు ఇది. దేశ, రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలి. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం దిల్లీనీ మార్చేశాయి. సుస్థిర అభివృద్ధి విధానం ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. మన దేశానికి రైట్‌ టైమ్‌లో రైట్‌ లీడర్‌.. మోదీ.

* అవినీతి, కుంభకోణాలు, వారసత్వ, జైలు పార్టీలకు దిల్లీ ప్రజలు చరమగీతం పాడారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేసిన అందరినీ ‘ఎక్స్‌’ వేదికగా ఆయన అభినందించారు. లక్ష్య సాధనలో అఖండ విజయం సాధించిన విజేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

* దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని ఏడుకు ఏడు సీట్లూ వరుసగా మూడు సార్లు క్లీన్‌స్వీప్‌ చేసిన ఆ పార్టీ.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. తాజా విజయంతో తన పంతాన్ని నెగ్గించుకుంది. ఇక గతంలో దాదాపు 15 ఏళ్ల పాటు నిర్విరామంగా దిల్లీని ఏలిన కాంగ్రెస్‌ పార్టీ సున్నాకే పరిమితం అయ్యింది. ఈ ఎన్నికల ఫలితాలు భాజపా పట్టుదలను నిరూపించగా.. అదే సమయంలో ప్రతిపక్షాల ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్‌ కలసి పోటీ చేసి.. ఏడాది తిరగకముందే మళ్లీ విడివిడిగా పోటీ చేయడంతో ఇండియా కూటమి ఐక్యతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.

* కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వైఎస్సార్‌ జిల్లా జెడ్పీ మీటింగ్‌ అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. మా అధినేత వైఎస్‌ జగన్‌ 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తే దాన్ని 7 గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే రోడ్లెక్కుతాం.రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. పంటల బీమా లేదు. కనీసం బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాల్సి వస్తోంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ దరఖాస్తులు వేలల్లో పెండింగులో ఉన్నాయి. వాటినీ మంజూరు చేయడం లేదు. గతంలో ఉన్న పథకాలూ అమలు చేయడం లేదు. గొప్పలు చెప్పుకున్న సూపర్‌ సిక్స్‌ అమలు అంతకన్నా లేదు. కానీ ఈ 9 నెలల్లో 1.40లక్షల కోట్లు అప్పు మాత్రం తెచ్చారు..ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. చంద్రబాబు అనుభవం ఉన్న ఆర్థిక వేత్త అని చెప్పుకుంటారు. ఆయన కచ్చితంగా సూపర్‌ సిక్స్‌ అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఆనాడు హామీలు ఇచ్చారు కదా. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి..ఓటరు దేవుడా అంటూ దండాలు పెట్టి ఇప్పుడు ఘోరంగా మోసం చేస్తున్నారు.

* వివాహేతర సంబంధాలు సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. వైవాహికేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఆలుమగల నైతిక​ విలువల పతనం మొత్తం కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఇలాంటి వార్తలను మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక (Karnataka)లో వెలుగులోకి వచ్చింది. తనను కాదని మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఓ మహిళ తన భర్త కాళ్లు విరగొట్టిచ్చింది. కిరాయి మనుషులకు డబ్బులిచ్చి మరీ ఆమె ఘనకార్యానికి పాల్పడడం గమనార్హం. బండారం బయట పడడంతో ఆమెతో పాటు ముగ్గురు నిందితులు కటకటాల పాలయ్యారు. కలబుర్గి (kalaburagi)లోని అత్తార్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో చోటుచేసుచేసుకున్న ఈ ఘటన వివరాలను మీడియాకు పోలీసులు వివరించారు. వెంకటేష్‌, ఉమాదేవి భార్యాభర్తలు. వెంకటేష్‌ మరో మహిళతో వివావహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఉమాదేవికి తెలియడంతో చాలాసార్లు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఎన్నిసార్లు చెప్పినా వెంకటేష్‌ తన వైఖరి మార్చుకోకపోవడంతో ఉమాదేవి విసిగిపోయింది. ఏదోటి చేసి భర్తను తన దారికి తెచ్చుకోవాలని అనుకుంది. కాళ్లు విరగ్గొడితే ఇంటి పట్టునే ఉండి తన దారికి వస్తాయని అనుకుంది. తన ప్లాన్‌ అమలు చేయడానికి ఆరిఫ్‌, మనోహర్‌, సునీల్‌ అనే వ్యక్తులను సంప్రదించింది. తన భర్త కాళ్లు విరగ్గొడితే 5 లక్షల రూపాయలు ఇస్తానని వారితో చెప్పింది. ఆఫర్‌ నచ్చడంతో రంగంలోకి దిగిన ముగ్గురు పని పూర్తి చేశారు. దోపిడీ పథకం వేసి వెంకటేష్‌ రెండు కాళ్లతో పాటు చేయి విరగొట్టారు.. అయితే బాధితుడి కుమారుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బ్రహ్మపురి పోలీసులు కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. దీంతో ఉమాదేవితో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్యే తన కాళ్లు విరగ్గొట్టించిందని తెలియడంతో వెంకటేష్‌ ఆవేదనకు గురయ్యాడు. కాగా, వెంకటేష్‌, ఉమాదేవి ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.

* దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం(ఫిబ్రవరి 8) ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌లు కలిసి ఢిల్లీలో బీజేపీకి విజయం కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఇక నుంచి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే ఇక నుంచి ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవాలని సూచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z