* హైదరాబాద్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,650 దాటింది. ఈ అసాధారణ పెరుగుదల భారతదేశం అంతటా ఉంది. బంగారం ధరలు రాబోయే కొద్దిరోజుల్లోనే లక్ష మార్క్ ను చేరేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు, మార్కెట్ అస్థిరత బంగారం ధరల పెరుగుదలకు కారణం. శుక్రవారం ( ఫిబ్రవరి 08) హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 79,450 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 87,650 రూపాయలకు చేరింది. గతవారం 24 క్యారెట్ల బంగారం ధర 84,000 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 77,300 రూపాయలుగా ఉంది. దీనితో పోలిస్తే ఇది దాదాపు 4 శాతం పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావించడం..ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తుంది.
* ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు ఆన్‌లైన్‌లో ప్రాపర్టీల సెర్చ్‌లో గణనీయమైన వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్‌టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది. ఆన్‌లైన్‌లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయని హౌసింగ్.కామ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్‌లుక్ తెలిపింది. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో 2023తో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.
* దేశీయ కరెన్సీ రూపాయి విలువ (Rupee value) క్షీణించడంపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. డాలరుతో రూపాయి విలువను మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. రూపాయి విలువ రోజువారీ మార్పులపై ఆర్‌బీఐ పెద్దగా ఆందళన చెందబోదని తెలిపారు. దీర్ఘకాల, మధ్యస్థ కాలంలో రూపాయి విలువ మార్పుపైనే ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డాలరుతో రూపాయి మారకం విలువ 87.50గా ఉంది. ఆర్‌బీఐ తాజాగా 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును సవరించిన నేపథ్యంలో 9 పైసలు మేర బలపడింది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధుల నుంచి రూపాయి పతనంపై ప్రశ్న ఎదురవ్వగా.. ఆర్‌బీఐ గవర్నర్ స్పందించారు. ‘‘రూపాయి విషయంలో ఆర్‌బీఐ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. రూపాయి విలువ స్థాయిని గానీ, ఒక బ్యాండ్‌ను గానీ మేం చూడబోం. ఎప్పుడైన భారీ స్థాయిలో ఒడుదొడుకులు ఎదుర్కొంటే జోక్యం చేసుకుంటాం. రోజువారీ విలువ తగ్గడం, పెరగడం గురించి పట్టించుకోం’’ అని గవర్నర్ పేర్కొన్నారు.
* వచ్చేవారం లోక్‌సభలో నూతన ఆదాయం పన్ను బిల్లు-2025ను ప్రవేశ పెడుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయం పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు నూతన ఆదాయం పన్ను చట్టం వెళుతుందన్నారు. నూతన ఆదాయం పన్ను బిల్లుకు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ‘నిన్న (శుక్రవారం) నూతన ఆదాయం పన్ను బిల్లు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నేను వచ్చేవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెడతానని ఆశాభావంతో ఉన్నా. తదుపరి పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు వెళుతుంది’ అని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z