Movies

బాలీవుడ్ నటుడి పేరిట ₹72కోట్ల ఆస్తులు రాసిన అభిమాని-NewsRoundup-Feb 09 2025

బాలీవుడ్ నటుడి పేరిట ₹72కోట్ల ఆస్తులు రాసిన అభిమాని-NewsRoundup-Feb 09 2025

* ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు. నక్సలిజం వల్ల దేశంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదన్నారు. నక్సల్స్ రహిత భారత్‌గా మార్చేందుకు భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయన్నారు. ఈ ఆపరేషన్‌లో 31 మంది నక్సలైట్లను హతమార్చడంతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందారు..దేశం ఎప్పుడూ వాళ్లకు రుణపడి ఉంటుందన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అమిత్ షా.

* ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. ఆదివారం ( ఫిబ్రవరి 9, 2025 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 25మంది కూలీలు పని ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడటంతో మహిళలంతా ట్రాక్టర్ కింద పడిపోయారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళలు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

* కులగణన తప్పుల తడక, అశాస్త్రీయం ..మళ్లీ రీ సర్వే చేసి లెక్కలు తేల్చాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. శాస్త్రీయంగా కులగణన రీ సర్వే చేస్తే..కేసీఆర్ తో సహా తామంతా పాల్గొంటామన్నారు. బీసీలను తక్కువ చేసి చూపించడంపై బీసీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ బీసీ బహిరంగ సభ పెడతామని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన చోటనే బీసీ బహిరంగ సభ పెడతామని అన్నారు కేటీఆర్.ఆనాడు కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేతోనే బీసీల లెక్క సరిగా తేలిందని చెప్పారు కేటీఆర్. ఇన్నేండ్లైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.

* కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలపై అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటుంటారు. ఈ క్రమంలో హీరోల పుట్టిన రోజులప్పుడు, సినిమాల రిలీజ్ సమయంలో పాలాభిషేకాలు చెయ్యడం, అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేస్తుంటారు. కానీ ఓ స్టార్ హీరో పై అభిమానంతో లేడీ ఫ్యాన్ ఏకంగా రూ.72 కోట్లు వాల్యూ చేసే ఆస్తులు స్టార్ హీరో పేరు మీద రాసిన ఘాటైన బాలీవుడ్ లో వెలుగు చూసింది. పూర్తివివరాల్లోకి వెళితే నిషా పాటిల్ అనే అభిమాని తన మరణానికి ముందు తన మొత్తం రూ. 72 కోట్ల విలువైన ఆస్తిని బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పై రాసింది. ఈ విషయాన్ని పోలీసులు సంజయ్ దత్ కి తెలియజేయగా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ విషయంపై సంజయ్ దత్ స్పందిస్తూ ఆమె అభిమానాన్ని అభినందించాడు. అలాగే తన అభిమాని నిషా పటేల్ చేసిన పని ఆశ్చర్యం కలిగించిందని, తన ఆస్తులని తీసుకోలేనని ఆమె కుటుంబ సభ్యులకి తిరిగి ఇచ్చేయాలని పోలీసులకి సూచించాడు. అంతేకాదు ఆమె నిజమైన వారసులకు ప్రతిదీ తిరిగి వెళ్లేలా చూసుకోవడానికి చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నాడు. దీంతో సంజయ్ దత్ చేసిన ఈ పనికి అభినందిస్తున్నారు.

* హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా దూకుడు పెంచింది.. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.. ఆదివారం ( ఫిబ్రవరి 9, 2025 )హయత్ నగర్ కోహెడలో ప్లాట్లు కబ్జా చేసి నిర్మించిన భారీ ఫామ్ హౌస్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. రియల్టర్ బాల్ రెడ్డి ప్లాట్లు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు 170 మంది ఫ్లాట్ ఓనర్లు.సర్వే నెంబర్ 951,952 లో 7.28 గుంటల భూమిని కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు.

* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుంభమేళా పర్యటన ఖరారైంది. సోమవారం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించడంతోపాటు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.

* రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రంగరాజన్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేసినట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. ‘‘నాపై 20 మంది దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయి. ఇంతకు మించి దీనిపై మాట్లాడను’’ అని రంగరాజన్‌ తెలిపారు. దాడి ఘటనను వివరించేందుకు ఆయన నిరాకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని రంగరాజన్‌ నివాసానికి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో .. వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

* దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సమావేశమయ్యారు. దిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్‌లోని తన నివాసంలో జరిగిన భేటీలో ప్రజల కోసం పనిచేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో ఆతిశీతో పాటు 22మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆతిశీ మీడియాతో మాట్లాడారు. భాజపా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఆప్‌ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేస్తూ.. వారి సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు.

* సన్నవడ్లకు బోనస్‌ పేరుతో రైతులను ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాటలు గొప్ప.. చేతలు చేదు’ అని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు బోనస్‌ బోగస్‌పై సీఎంకు బహిరంగ లేఖ రాస్తానన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌ నేతలు గ్రామాల్లో తిరిగితే రైతులే నిలదీస్తారు. ఈ సర్కారు కోతల సర్కార్‌గా మారిపోయింది. ఎంత పండిస్తే అంత కంది పంట కొనుగోలు చేయాలి. క్రాప్ బుక్‌లో నమోదు కాని రైతుల పంటలను కూడా కొనుగోలు చేయాలి. నవంబర్‌ 30న సీఎం ఇచ్చిన రుణమాఫీ చెక్కు ఇప్పటికీ క్లియర్‌ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తోంది’’ అని హరీశ్‌రావు విమర్శించారు.

* రోడ్డు ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఆ డాక్టరమ్మ. కన్న కుమార్తెను కోల్పోయిన పుట్టెడు దుఖఃలో కూడా అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చి ఔదార్యం చాటుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళితే.. ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ నంగి భూమిక నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బ్రెయిన్‌ డెడ్‌ అయింది. జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ చొరవతో డాక్టర్‌ నంగి భూమిక అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆమె లివర్‌, కిడ్నీలు, గుండె, లంగ్స్‌ను ఐదుగురికి అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. పుట్టెడు దుఖఃలోనూ ఔదార్యం చూపిస్తూ అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టరమ్మ కుటుంబ సభ్యులకు సెల్యూట్‌ అంటూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

* దేశంలో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ధార్‌ గ్యాంగ్‌’ను అనంతపురం (anantapur) పోలీసులు పట్టుకున్నారు. 18 రోజుల క్రింత అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ చేసింది ధార్‌ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఈ ముఠా కోసం జల్లెడపట్టి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లోని ముగ్గురు మాత్రమే పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి రూ.90లక్షల విలువ చేసే బంగారం, వజ్రాల ఆభరణాలతో పాటు రూ.19.35లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో గ్యాంగ్‌ లీడర్‌ నారూ పచావార్‌ కూడా ఉన్నారు. వీరిపై ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్టు గుర్తించారు. దక్షిణ భారత దేశంలోనే ఈ గ్యాంగ్‌పై 32కు పైగా కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ జగదీశ్‌ తెలిపారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకొని పగలు రెక్కీ చేసి రాత్రి పూట ఈ ముఠా చోరీలకు పాల్పడుతుందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. చోరీ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌లపై వీరు సంచరిస్తుంటారని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు వీరికోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z