Business

షేర్ హోల్డర్లకు IRCTC బంపరాఫర్-BusinessNews-Feb 11 2025

షేర్ హోల్డర్లకు IRCTC బంపరాఫర్-BusinessNews-Feb 11 2025

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా ఐదో రోజూ సూచీలు భారీ నష్టాలు ఎదుర్కొన్నాయి. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొనడం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో సెన్సెక్స్ 1200 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23వేల దిగువకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 77,384.98 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,311.80) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ఉదయం ఓ మోస్తరు నష్టాల్లో ట్రేడయిన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,030.59 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1018.20 పాయింట్ల నష్టంతో 76,293.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 22,986.65 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 309.80 పాయింట్ల నష్టంతో 23,071.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 60 పైసలు మేర బలపడి 86.85 వద్ద ముగిసింది.

* భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన సంస్థ రూ.341 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.300 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ.1,225 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ.1,115 కోట్లు.

* దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ అగ్రస్థానాన్ని కోల్పోయింది. చైనాకు చెందిన వివో సంస్థ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 16.6 శాతం మార్కెట్‌ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (IDC) ఈ మేరకు 2024 సంవత్సరానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. గడిచిన ఏడాదిలో దేశీయంగా శాంసంగ్‌ తన మార్కెట్‌ వాటాను దాదాపు 4 శాతం కోల్పోయిందని ఐడీసీ నివేదిక వెల్లడించింది. 2024లో శాంసంగ్‌ (Samsung) మార్కెట్‌ వాటా 17 శాతం నుంచి 13.2 శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది. ఈ ఏడాది కాలంలో మొబైల్‌ సరఫరాలు 19.4 శాతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. అదే సమయంలో ఐఫోన్‌ (iPhone) తయారీదారైన యాపిల్‌ క్రమంగా మార్కెట్‌ వాటాను పెంచుకుంది. గతంలో 6.4 శాతంగా ఉన్న ఆ కంపెనీ మార్కెట్‌ వాటా 8.2 శాతానికి చేరింది. మోటోరొలా 2.7 శాతంగా ఉన్న తన మార్కెట్‌ వాటాను 6 శాతానికి పెంచుకోగలిగింది. ఒకప్పుడు ప్రీమియం సెగ్మెంట్‌లో దూసుకెళ్లిన వన్‌ప్లస్‌ మార్కెట్‌ వాటా 6.1 శాతం నుంచి 3.9 శాతానికి పడిపోయింది. ఇదే కాలానికి రియల్‌మీ వాటా 12.5 శాతం నుంచి 11 శాతానికి, షావోమీ 12.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గాయి.

* ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ గూగుల్‌ మెసేజెస్‌ (Google Messages) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు పోటీగా పలు సదుపాయాలు తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా తన అప్లికేషన్‌ వేదికగా నేరుగా వాట్సప్‌ (WhatsApp) వీడియో కాల్‌ చేసే ఫీచర్‌ అందించాలని చూస్తోంది. కమ్యూనికేషన్‌ సులభతరం చేయడం కోసం కొత్త ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనుంది. గూగుల్‌ తన మెసేజింగ్‌ యాప్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులోభాగంగానే వాట్సప్‌ తరహాలోనే పలు ఫీచర్లను జోడిస్తూ వచ్చింది. త్వరలో తన యాప్‌ ద్వారా చాట్‌ చేస్తున్న సమయంలోనే స్క్రీన్‌పై వీడియో కాల్‌ ఆప్షన్‌ కనిపించనుంది. పైన కుడివైపున ఈ ఐకాన్‌ ప్రత్యక్షం కానుంది. ఆ ఐకాన్‌ని క్లిక్‌ చేసి నేరుగా వాట్సప్‌ వీడియో కాల్‌ చేయొచ్చు. గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ నుంచి వాట్సప్‌కు స్విచ్‌ అయ్యే సమస్య ఉండదు. ఒకవేళ యూజర్‌ వాట్సప్‌ వినియోగించకుంటే ఆ కాల్‌ నేరుగా గూగుల్‌ మీట్‌కు కనెక్ట్‌ అవుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z