* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ సైతం 22,774.85 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో రెండు బెంచ్ మార్క్ సూచీలు కోలుకున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్ ఉదయం 76,388.99 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,138.97 ) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 75,439.64 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 199 పాయింట్ల నష్టంతో 75,939.21 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 102.15 పాయింట్ల నష్టంతో 22,929.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 86.84 వద్ద ముగిసింది.
* దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒక్కరోజులోనే రూ.1300 పెరిగింది. దీంతో రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం) పసిడి ధర రూ.89,400కు చేరింది. గురువారం 10 గ్రాముల పుత్తడి ధర రూ.88,100 వద్ద ఉంది. అటు వెండి సైతం కిలో మళ్లీ లక్ష రూపాయల మార్కు దాటింది. గురువారం రూ.98 వేలుగా ఉన్న దీని ధర ఒక్కో రోజులోనే రూ.2 వేలు పెరిగి నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం సైతం రూ.1300 పెరిగి రూ.89 వేలకు చేరింది. ఫ్యూచర్ మార్కెట్‌లో ఏప్రిల్ డెలివరీ బంగారం కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.184 పెరిగి రూ.85,993కు చేరింది.
* ఐఫోన్ ఎస్‌ఈ (iPhone SE) సిరీస్‌లో నాలుగోతరం మొబైల్ కోసం టెక్ ప్రియులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్ మోడళ్ల కంటే అందుబాటులో ధర ఉండడమే దీనికి కారణం. అయితే త్వరలోనే యాపిల్ నుంచి కొత్త ప్రొడెక్ట్ మార్కెట్లోకి లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈవిషయాన్ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) ‘ఎక్స్’ వేదికగా స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరి 19న యాపిల్ నుంచి ఎస్4 మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టిమ్ కుక్ తెలిపారు.
* రిలయన్స్ జియో (Reliance Jio) తన రెండు ప్రముఖ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లకు (recharge plans) సంబంధించి మార్పులు చేసింది. రూ. 69 ప్లాన్, రూ. 139 ప్యాక్‌ల వ్యాలిడిటీని సవరించింది. ఈ ప్లాన్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీని ప్రవేశపెట్టింది. అలాగే కొద్ది రోజుల క్రితం రూ. 448 ప్లాన్‌ను కూడా జియో అప్‌డేట్ చేసింది. రూ. 189 ప్యాక్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. గతంలో రూ.69, రూ.139 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీ ఉండేది కాదు. యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీనే వీటికీ వర్తించేది. అంటే యూజర్ ఖాతాలో యాక్టివ్ బేస్ రీఛార్జ్ ఉన్నంత కాలం ఉంటాయి. ఉదాహరణకు, బేస్ ప్యాక్‌కు 30 రోజులు వ్యాలిడిటీ ఉంటే, యాడ్-ఆన్ అదే కాలానికి యాక్టివ్‌గా ఉండేది. కొత్త సవరణ ప్రకారం, రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇప్పుడు కేవలం 7 రోజుల స్టాండ్‌ఎలోన్ వాలిడిటీతో వస్తాయి. అంటే బేస్ ప్యాక్‌తో ముడిపడి ఉన్న మునుపటి దీర్ఘకాల వ్యాలిడిటీకి భిన్నంగా, ఈ ప్లాన్‌ల కింద అందించిన డేటాను వినియోగించుకోవడానికి వినియోగదారులకు ఒక వారం మాత్రమే సమయం ఉంటుంది.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై (New India Co operative Bank) కఠిన ఆంక్షలు విధించింది. ఆరు నెలల పాటు కొత్త రుణాలు మంజూరు చేయకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా నిరోధించింది. అలాగే క్యాష్ విత్‌డ్రాకు కూడా వీలు లేకుండా చేసింది. బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం, ద్రవ్యత స్థితి గురించి ఆందోళనల కారణంగా ఈ పరిమితులు అవసరమని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. డిపాజిటర్ల ఆర్థిక భద్రత దృష్ట్యా ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక నష్టాలతో సతమతమవుతోంది. దాని వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.22.78 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం రూ.30.75 కోట్ల నష్టం వాటిల్లింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z