NRI-NRT

సారీ మోడీ…ప్రధానికి ట్రంప్ నుండి తిరస్కరణ-NewsRoundup-Feb 14 2025

సారీ మోడీ…ప్రధానికి ట్రంప్ నుండి తిరస్కరణ-NewsRoundup-Feb 14 2025

* ‘‘నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా.. ఫర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమక్షశిణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. కులగణన.. నా కోసం, నా పదవి కోసం చేయలేదు. త్యాగానికి సిద్ధపడే.. కులాల లెక్కలు పక్కాగా తేల్చాం. మా నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy)అన్నారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో సీఎం ప్రసంగించారు.

* చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి ఆటకట్టించే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులకే షాక్‌ ఇచ్చారు దొంగలు. వారి కార్యాలయంలోనే చోరీకి పాల్పడి అంతా ఊడ్చేశారు (theft). కబోర్డులు, కిటికీలు.. ఇలా వేటినీ వదలి పెట్టలేదు. త్రిపుర (Tripura)లో అత్యంత కట్టుదిట్టమైన ష్యామలీ బజార్ క్వార్టర్ కాంప్లెక్స్‌లో ఈ చోరీ జరిగింది. కుర్చీలు, డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్ సామగ్రి ఇలా అన్నీ దోచేశారు. గోడలు తప్ప ఏమీ మిగల్చలేదు..! ఐదు నెలలుగా ఆ కార్యాలయం మూసి ఉంది. ఇటీవల అధికారులు ఆ బ్రాంచ్‌కు వెళ్లడంతో ఈ విషయం వెలుగు చూసింది.

* అక్క అక్కే.. లెక్క లెక్కే అన్నటుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) వైఖరి. భారత్‌ ఎంత మిత్ర దేశమైనా.. పరస్పర పన్నుల విషయంలో తగ్గేదేలే అని సున్నితంగా తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా నేడు శ్వేతసౌధంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ‘‘ప్రస్తుతం మేము రెసిప్రోకల్‌ నేషన్‌ (ఎదుటి దేశం ఎలా స్పందిస్తే.. అలానే ప్రతిస్పందించే దేశం). భారత్‌ లేదా మరే దేశమైనా సరే.. మాపై తక్కువ పన్నులు విధిస్తే.. మేము కూడా అలానే టారిఫ్‌లు వేస్తాము. భారత్‌ మాపై ఎంత శాతం పన్ను విధిస్తే.. మేమూ అంతే ఛార్జి చేస్తాము. వారి సుంకాలు ఎంత ఎక్కువన్నది ఇక మా సమస్య కాదు. నా తొలివిడత పాలనలో అధిక టారిఫ్‌లపై చర్చించాము. కానీ, ఎలాంటి రాయితీలు పొందలేకపోయాం. అందుకే మేము తేలికైన మార్గాన్ని ఎంచుకొన్నాం. వారెంత విధిస్తే.. మేము అంతే ఛార్జి చేస్తాం. అమెరికా ప్రజల కోసం ఇదే సరైన చర్య.’’ అని ట్రంప్‌ వివరించారు.

* ఏపీ రాజధాని అమరావతికి బ్రాండ్‌ అంబాసిడర్లను నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ, సోషల్‌ స్టేటస్‌ల ఆధారంగా బ్రాండ్‌ అంబాసిడర్లను నియమించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు పురపాలకశాఖ బ్రాండ్‌ అంబాసిడర్ల నియమాకం కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. నామినేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్‌ చేసిన వారిని అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు.

* ర్యాగింగ్ (Kerala Ragging Horror) పేరిట జూనియర్‌ విద్యార్థుల్ని దారుణంగా హింసించిన సీనియర్లపై కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కాలేజీ నుంచి సస్పెండై, అరెస్టయిన ఐదుగురు విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఘటనలో చేపట్టిన చర్యలపై పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించింది.

* అమెరికా (USA) వీసా రెన్యువల్‌ చేయాలనుకునే వారికి చేదు వార్త..! వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన ‘డ్రాప్‌బాక్స్‌’ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువుతీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్‌ (US Visa Renewals) చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ.. ఇప్పటికే వీసా అప్లికేషన్‌ కేంద్రాల్లో కొత్త రూల్స్‌ (Drop Box Rules)ను అమలు చేస్తున్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తాజా నిబంధనలతో హెచ్‌-1బీ (H-1B) సహా బీ1/బీ2 వంటి నాన్‌ఇమిగ్రెంట్‌ వీసాదారుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరు వీసా (Visa) రెన్యువల్‌ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

* నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం.. 4 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించేందుకు ఆరాట‌ప‌డిన కేసీఆర్ ఆకాంక్ష‌ను నెర‌వేర్చుదామ‌ని సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయ‌కుల‌కు, ప్ర‌జ‌ల‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై శుక్రవారం సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో కోకాపేట లోని తన నివాసంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z