* పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత కూడా తమ అదుపాజ్ఞల్లో ఉండాలని ఏ తల్లిదండ్రులు ఆలోచించవద్దని సీనియర్ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) విజ్ఞప్తి చేశారు. తనయుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్లతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam). శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బ్రహ్మానందం సమాధానం ఇచ్చారు. ‘‘ఇటీవల కొన్ని సినిమాల్లో నిడివి తక్కువ, అతిథి పాత్రలు చేశా. ‘బ్రహ్మా ఆనందం’ మాదిరిగానే రాబోయే చిత్రాల్లో నిడివి ఎక్కువ ఉన్న పాత్రలు చేస్తున్నా. ‘గేమ్ ఛేంజర్’లోనూ మీరు చూసింది చిన్న పాత్రే. కానీ, చేసింది పెద్ద పాత్ర. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లా మెరవడానికి కారణం ఉంది. యువ దర్శకులు నా దగ్గరకు వచ్చి, ‘సార్.. మిమ్మల్ని చూసి పెరిగాం. మా సినిమాలో చిన్న పాత్ర చేయండి. మిమ్మల్ని డైరెక్ట్ చేశామన్న సంతృప్తి చాలు’ అంటారు. అది అప్పుడే వికసిస్తున్న మొగ్గ. దాన్ని తుంచి పడేయలేం. అలాగని ‘చిన్న చిన్న పాత్రలు నేను చేయనయ్యా.. ఏదైనా పెద్ద పాత్ర ఉంటే చెప్పండి’ అని కూడా అనలేను. నేను ఆ పాత్ర చేయడం వల్ల నాకు వచ్చే నష్టం లేదు. అతడికి ఉపయోగం ఉందా? లేదా? అని ఆలోచిస్తా. అతని మానసిక ఆనందం కలగడానికి ఉపయోగపడితే చాలు అనిపిస్తుంది’’.
* దేవుడి కార్యక్రమానికి వెళ్తే, తనపై రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమని గాయని మంగ్లీ (singer mangli) అన్నారు. ఇటీవల ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి అరసవల్లి సూర్యనారాయణుడి దేవాలయానికి వెళ్లారు. దీనిపై తెదేపా క్యాడర్‌తో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో మంగ్లి బహిరంగ లేఖ రాశారు. ‘‘నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గత వారం రోజులుగా నా పై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకొనేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చా. అరసవల్లిలో జరిగే రథసప్తమి వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నా. కార్యక్రమం అనంతరం సూర్యభగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడుగారి కుటుంబం ఒక కళాకారిణిగా, ఒక ఆడబిడ్డగా నన్ను వాళ్లతోపాటు ఆహ్వానించారు. దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా’’?
* రష్యాకు చెందిన ఓ బ్రూవరీ సంస్థ బీరు క్యాన్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించడం వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. రష్యాకు చెందిన రివోర్ట్ సంస్థ మహాత్ముడి చిత్రంతో పాటు, ‘మహాత్మ జి’ అనే పేరును కూడా ముద్రించి బీర్ క్యాన్లను విక్రయిస్తోంది. తాజాగా ఈ వ్యవహారం ఒడిశా మాజీ సీఎం నందిని సత్పతి మనవడు సుపర్ణో సత్పతి దృష్టికి రావడంతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని, రష్యా అధ్యక్షుడితో మాట్లాడాలని కోరారు.
* ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు..’ అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కట్టుబడి ఉన్నామని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night) ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రారంభోపన్యాసం చేశారు.
* గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ మెకానిక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బిక్కవోలు, అనపర్తి పోలీసులు.. రూ.1.06 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ సామగ్రి, జిరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు.
* గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్‌రెడ్డి రూ.50వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో నిన్నటి నుంచి ఆయన నివాసంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడీఈ నివాసంలో స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం సతీశ్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
* తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై కేంద్ర, రాష్ట్ర అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్ష చేపట్టారు. భారత్ నుంచి వెళ్లి పాకిస్థాన్, చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై అధికారులతో చర్చించారు. మార్చిలోపు ఆస్తుల లెక్క తేల్చాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీస్‌పై స్పష్టత కోరారు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు జనిక్ సినర్ (Jannik Sinner) నిషేధం ఎదుర్కొన్నాడు. గతేడాది అతడిపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టెస్టులో పాజిటివ్ వచ్చినా తప్పించుకొన్నాడు. ఇప్పుడు ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీతో సినర్ ఓ అంగీకారానికి వచ్చాడు. మూడు నెలల నిషేధాన్ని సినర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అతడు గతనెలలోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
* ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించిన బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను ఖమ్మం జైలులో శనివారం నాడు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. అక్రమ కేసులతో కేసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, కానీ కెసిఆర్ ని, కెసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా తమను ఆపలేరని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని, రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయని తెలిపారు.
* కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది. సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్‌కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.
* దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతను ఈ ఏడాది ఎర్ర బంగారం అప్పుల పాలు చేస్తుంది. రేయనకా పగలనకా పంట పొలాల్లో శ్వేతం చిందించిన అన్నదాతకు చిల్లి పైసా మిగలక ఒక అప్పుల పాలవుతున్నాడు. ఆటుపోట్లు ఎదుర్కొంటూ సాగు చేపట్టిన రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో బహిరంగ మార్కెట్లో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మండలంలో సుమారు నాలుగువేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా గిట్టుబాటు ధర లభించడంతో ఈ ఏడాది మండలంలో సుమారు 5 ఎకరాలకు పైగా రైతులు మిర్చి సాగు చేసేందుకు మొగ్గు చూపారు. మిర్చి పంట చీడపీడల బారిన పడకుండా భారీగా పెట్టుబడులు పెట్టి ఈ ఏడాది సాగు చేపట్టారు. ఎకరాకు సుమారు లక్షకు పైగా పెట్టుబడి అయినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కూలీల కొరత ఏర్పడడంతో మిర్చి ఏరేందుకు పక్కా రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకుని వచ్చి పొలాల వద్ద గుడారాలు వేసి మిర్చి ఏరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎకరానికి సుమారు 30 వేల రూపాయలకు పైగా మిరప తోటలు కోసేందుకు ఖర్చు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z