NRI-NRT

ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేసీఆర్‌ (KCR) 71వ జన్మదిన వేడుకలను బహ్రెయిన్‌లో (Bahrain) ఘనంగా నిర్వహించారు. బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్‌లో ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్‌ వెంట ఎలా ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామన్నారు. అరవై ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా నిరుపేద జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపి రైతుబంధు, రుణమాఫీ కోసం రైతుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం అని నిరూపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.

ప్రజాపాలన నిర్బంధాల పాలనగా మారిపోయిందని విమర్శించారు. పాలన చేతగాక, కేవలం ప్రజల దృష్టి మార్చేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రజలు రోడ్డెక్కుతుంటే, మరోవైపు ఆరు గ్యారెంటీలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణ చరిత్రను మార్చిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి భేషరతుగా వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే తెలంగాణ సమాజమే తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. కుట్ర పూరితంగా కులగణన చేశారని మండిపడ్డారు. కులగణనను మళ్లీ రీసర్వే చేయాలన్నారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా వున్నారన్నారు. కేసీఆర్‌ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు, చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం, తిప్పారవేణి శ్రీనివాస్, దేవదాస్, కొడారి రాజేందర్, జాడి వెంకటేష్, చిన్న గంగారాం, చివేరి రాము, బీఆర్ఎస్‌ నాయుకులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z