Movies

నేను అందుకే ముద్దులు పెట్టను-NewsRoundup-Feb 21 2025

నేను అందుకే ముద్దులు పెట్టను-NewsRoundup-Feb 21 2025

* ‘‘సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలోనే.. ముద్దు, ఇంటిమేట్‌ సీన్స్‌కు దూరంగా ఉండాలనే పాలసీ పెట్టుకున్నా. ఇప్పటివరకూ నటించిన అన్ని సినిమాల్లోనూ దానిని పాటించా. ప్రేక్షకులందరూ కలిసి కూర్చొని చూసేలా నా సినిమాలు ఉండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అలాంటి సీన్లలో నటించాలని ఎంతోమంది దర్శక నిర్మాతలు నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. వేరే హీరోల సినిమాలను ఉదాహరణగా చూపిస్తూ మీరూ చేయొచ్చుగా అని అడుగుతుంటారు. ఒక జంట మధ్య రొమాన్స్‌ చూపించాలనుకుంటే.. ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదనేది నా భావన. నా తోటి హీరోలు అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని నేను ఏమాత్రం తప్పుపట్టను. నేను అలాంటి వాటిల్లో నటించను. ఇది నాకు నేనుగా పెట్టుకున్నా పాలసీ’’ అని ఉన్ని ముకుందన్‌ చెప్పారు.

* అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్‌ యంత్రాంగం వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని నిర్బంధించి తీసుకొస్తుండటంపై విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. గతవారం రెండు బ్యాచ్‌లలో వచ్చిన వలసదారుల్లో మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని స్పష్టం చేసింది. ‘‘వలసదారులను స్వదేశానికి పంపించే సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడంతోపాటు మతపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని అమెరికా ప్రభుత్వం వద్ద ప్రస్తావించాం. దాని ప్రకారం.. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో అమృత్‌సర్‌కు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులకు ఎలాంటి సంకెళ్లు వేయలేదు’’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

* అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ (PM Modi) ఇచ్చిన సమాధానాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తప్పుపట్టారు. ‘‘నరేంద్రమోదీజీ.. అది వ్యక్తిగత అంశం కాదు. అది దేశప్రయోజనాలకు సంబంధించిన విషయం’’ అని ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ విమర్శించారు. ఇటీవల ప్రధాని మోదీ అగ్రరాజ్యంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌పై అమెరికాలో పెట్టిన కేసు గురించి ట్రంప్‌తో భేటీ సమయంలో చర్చకు వచ్చిందా..? అని మీడియా సమావేశంలో మోదీకి ప్రశ్న ఎదురైంది. ‘‘భారత్‌ ఓ ప్రజాస్వామ్య దేశం. వసుధైక కుటుంబం అనేది మా సంస్కృతి. ప్రపంచం మొత్తం మా కుటుంబం అనుకొంటాం. ప్రతి భారతీయుడిని మావాడిగానే భావిస్తాం. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరు’’ అని ప్రధాని వెల్లడించారు. ఈ సమాధానాన్ని రాహుల్ గతంలోనూ విమర్శించారు. ‘‘ఈ విషయం గురించి దేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే మౌనం దాల్చే ప్రధానమంత్రి.. అదే ప్రశ్నను విదేశాల్లో ఎవరైనా అడిగితే అది వ్యక్తిగత విషయమని బదులిస్తారు’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

* శ్రీవారి ఆలయ మహాద్వారం గేటు వద్ద తితిదే బోర్డు సభ్యుడు నరేష్‍ కుమార్‍.. ఉద్యోగి బాలాజీని దూషించడంపై తితిదే ఉద్యోగులు రెండో రోజు మౌనదీక్ష చేపట్టారు. తితిదే పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనదీక్షకు దిగారు. ఉద్యోగి పట్ల దురుసుగా వ్యవహరించిన బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్‍ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తమ దృష్టికి తెచ్చారని ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో తితిదే ఉద్యోగులతో అన్నమయ్య భవన్‌లో ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు నరేష్‌ కుమార్‌, భాను ప్రకాశ్‌రెడ్డి సమావేశమై చర్చిస్తున్నారు.

* మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు చీరలు అందజేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పక్‌పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ. 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటును మహిళలు నిర్వహించబోతున్నారు. తొలుత ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండేలా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లండి. నిధులు నేనిస్తా.. నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది. నిధులు ఇచ్చినా నిర్వహణ బాగాలేకపోతే ప్రయోజనం ఉండదు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిస్తున్నామో బడి కూడా అలాగే నిర్వహించాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

* వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుటుంబ సభ్యుల ఎస్టేట్‌ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది. ప్రభుత్వ, అటవీశాఖ భూములను ఆక్రమించారనే అభియోగాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా సీకే దిన్నె మండలంలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల్లో రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్‌ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి. సజ్జల కుటుంబానికి ఉన్న 146 ఎకరాల్లో 55 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్‌రెడ్డి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్‌రెడ్డి 16.85 ఎకరాలు, వై.సత్యసందీప్‌రెడ్డి 21.46 ఎకరాలతో సహా సజ్జల విజయకుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్కించారు. ఇందులో 55 ఎకరాల వరకు ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమించినట్లు గతంలో చేపట్టిన రెవెన్యూ సర్వేలో తేలింది. ఇందులో తమ శాఖ భూములు లేవని అటవీ శాఖ వాదిస్తోంది. రెవెన్యూ శాఖ మాత్రం ఉన్నట్లు రికార్డులు చూపిస్తోంది. సమగ్ర సర్వే చేసి హద్దులు గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సర్వే చేపట్టారు.

* ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్‌ అయ్యారు. ములాఖత్‌ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్‌ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు.

* మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Maharaj) వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ (chhatrapati sambhaji maharaj) గురించి వీకీపీడియా అభ్యంతరకర పోస్టు పోస్టు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం(21-02-2025) వీకీపీడియాకు చెందిన 4-5 ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్‌ సెల్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల వీకీపీడియా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ గురించి తప్పుడు సమాచారం పోస్టు చేసిందని, వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని మహారాష్ట్ర సైబర్‌ సెల్‌ పోలీసులు అమెరికాకు చెందిన వీకీపీడియా మాతృసంస్థ వీకీమీడియా ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేశారు. 15 ఈమెయిల్స్‌ పంపినా ఇంత వరకూ వీకీమీడియా ఫౌండేషన్ నుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో వీకీపీడియా శంభాజీ మహారాజ్‌ గురించి అభ్యంతరకర కంటెంట్‌ పోస్టు చేసిందని, ఆ కంటెంట్‌ వల్ల శాంతిభద్రతకు విఘూతం కలిగే అవకాశం ఉందని సైబర్‌ సెల్‌ పోలీసులు వీకీపీడియా ఎడిటర్లపై కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్‌ 69,79 ఉల్లంఘించినందుకు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z