ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి చివరి కోరిక నెరవేరింది. భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉన్న అతడు తన వీలునామాలో అంతిమ కోరికను పేర్కొన్నాడు. తన మృతదేహాన్ని భారత్‌లో ఖననం చేయాలని అభ్యర్థించాడు. (Australian Man Buried In India) 12వ సారి భారత్‌ను సందర్శించిన ఆయన అనారోగ్యంతో మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి చివరి కోరికను అతడి భార్య నెరవేర్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే డోనాల్డ్ సామ్స్ (Donald Sams)కు భారత దేశమంటే ఎంతో గౌరవం, ప్రేమ. ఆస్ట్రేలియన్ హైకమాండ్ అధికారిగా ఆయన రిటైర్డ్ అయ్యారు. సామ్స్ తండ్రి బ్రిటీష్ పాలనలో అస్సాంలో పనిచేశారు.
కాగా, డోనాల్డ్ సామ్స్ భారత్‌కు వచ్చినప్పుడల్లా తన తండ్రికి నివాళిగా అస్సాంను సందర్శించేవారు. కోల్‌కతా నుంచి పాట్నాకు గంగా నదిలో బోటులో ప్రయాణించే వారు. భారత్‌తో అనుబంధం పెంచుకున్న ఆయన తన వీలునామాలో ప్రత్యేకంగా అభ్యర్థించారు. తన మృతదేహాన్ని భారత్‌లోని స్మశానవాటికలో ఖననం చేయాలని చివరి కోరికగా పేర్కొన్నారు.
మరోవైపు 91 ఏళ్ల డోనాల్డ్ సామ్స్ తన భార్య ఆలిస్ సామ్స్‌తో సహా 42 మంది బృందంతో కలిసి ఇటీవల 12వ సారి భారత్‌కు వచ్చారు. యథావిధిగా అస్సాంను ఆయన సందర్శించారు. ఎప్పటి మాదిరిగానే కోల్‌కతా నుంచి పాట్నాకు గంగా నది ద్వారా క్రూయిజ్‌లో ప్రయాణించారు. అయితే ఫిబ్రవరి 21న బోటులో ఉండగా ఆయన ఆరోగ్యం క్షిణించింది. దీంతో ముంగేర్‌లోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, డోనాల్డ్ సామ్స్ మరణం గురించి భారత యంత్రాంగం, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి ముంగేర్ జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. తన భర్త వీలునామాలో పేర్కొన్న ఆయన చివరి కోరికను నెరవేర్చేందుకు సహకరించాలని భార్య ఆలిస్ సామ్స్ ఆస్ట్రేలియా ఎంబసీని అభ్యర్థించింది. అనుమతి పొందడంతో ముంగేర్ జిల్లా యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. దీంతో శనివారం చురంబాలోని క్రైస్తవ స్మశానవాటికలో డోనాల్డ్ సామ్స్ మృతదేహాన్ని క్రైస్తవ ఆచారాలతో ఖననం చేశారు. జిల్లా కలెక్టర్ అవ్నిష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z