Editorials

అమెరికాపై చైనా ఫిర్యాదు-NewsRoundup-Feb 28 2025

అమెరికాపై చైనా ఫిర్యాదు-NewsRoundup-Feb 28 2025

* ఇంజినీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ఇప్పటివరకు అమలవుతున్న 15 శాతం నాన్‌ లోకల్‌ కోటా(అన్‌ రిజర్వుడ్‌)లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణవాసులే పొందనున్నారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఆ సీట్లకు పోటీపడటానికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు అయిన నేపథ్యంలో తెలంగాణ స్థానికత, 15 శాతం నాన్‌లోకల్‌ కోటాకి అర్హులు ఎవరు అనే దానిపై స్పష్టత ఇస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో 15 జారీ చేశారు. గతంలో మాదిరిగానే కన్వీనర్‌ కోటా 70 శాతం సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు…అంటే ఓయూ రీజియన్‌(తెలంగాణ రాష్ట్ర పరిధి) అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇక మిగిలిన 15 శాతం స్థానికేతర కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74లో ఆ కోటాకు ఓయూ రీజియన్‌తోపాటు ఆంధ్రా వర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ(ఎస్‌కేయూ) వారు పోటీ పడవచ్చని పేర్కొంది. తాజా జీవోలో ఏయూ, ఎస్‌కేయూలను తొలగించింది. అంటే ఓయూ రీజియన్‌ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది.

* అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణాన్ని ట్రంప్‌ సర్కారు మరోసారి తెర పైకి తెచ్చింది. ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ పాల్పడిన ఈ దారుణానికి సంబంధించిన కీలక పత్రాలను ఆ దేశ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసింది. దీనికి ‘ది ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌: ఫేజ్‌ 1’ అని పేరు పెట్టింది. ఇప్పటికే పలు విడతలుగా ఈ కుంభకోణంలోని ఫైల్స్‌ బహిర్గతం అయ్యాయి. తాజాగా వెల్లడైన వాటిలో కొన్ని కొత్త అంశాలున్నాయి. కాంటాక్ట్‌ లిస్ట్‌ జాబితా, ఫ్లైట్‌ లాగ్‌ సమాచారం, అతడికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. తాజా జాబితాలో ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ రోలింగ్‌ స్టోన్‌ సభ్యుడు మైక్‌ జాగర్‌, ప్రముఖ పాప్‌ గాయకుడు మైఖేల్‌ జాక్సన్‌, యాక్టర్‌ అలెక్‌ బాల్డ్‌విన్‌, అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి ఆర్‌ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌ తల్లి ఎథెల్‌ కెన్నడీ, న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో, సూపర్‌ మోడల్‌ నవోమీ క్యాంప్‌బెల్‌ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇక కెన్నడీ కుటుంబానికి చెందిన కెర్రీ, టెడ్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మాజీ భార్య ఇవాన ట్రంప్‌, కుమార్తె ఇవాంక ట్రంప్‌ పేర్లు కూడా ఉన్నాయి. వీరంతా ఎప్‌స్టీన్‌ కస్టమర్లు కాదని.. కాంటాక్ట్‌ లిస్ట్‌లోని పేర్ల జాబితాగా అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఎప్‌స్టీన్‌ వినియోగించే ప్రైవేట్‌ జెట్‌ ‘లోలితా ఎక్స్‌ప్రెస్‌’ ఫ్లైట్‌ లాగ్‌ జాబితాను బహిర్గతం చేసింది. వీటిల్లో అన్ని పేర్లు గతంలో లీకైన వాటిల్లో ఉన్నాయి.

* పుణెలోని స్వర్‌గేటు బస్టాండ్‌ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి (Pune Rape Case) పాల్పడిన ఘటనలో మహారాష్ట్ర పోలీసులు నిందితుడు రామ్‌దాస్‌ను పట్టుకున్నారు. ఈక్రమంలో నిందితుడి గురించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు నేర స్వభావం కలవాడని.. పలు చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. 2019లో ఓ ట్యాక్సీ కొనుగోలు చేసినప్పటినుంచి పుణె-అహల్యనగర్‌ మార్గంలో తిప్పుతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. అయితే అప్పటినుంచి అతడు నగలతో కనిపించిన పలువురు వృద్ధులను తన ట్యాక్సీలో ఎక్కించుకొని, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారిని బెదిరించి.. దోపిడీలకు పాల్పడేవాడని తెలిపారు.

* రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఫిక్కిలో నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్‌ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా చైనా కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఫెంటనిల్‌ అంశాన్ని వాడుకుంటూ సుంకాల పేరుతో ఒత్తిడి చేయడంతోపాటు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఆరోపించింది. చైనా (China) దిగుమతులపై 10శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో డ్రాగన్‌ ఈ విధంగా స్పందించింది.

* ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఇప్పటికే రూ.48వేల కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మార్చి 10న టెండర్లు తెరుస్తా్మన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

* రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న పరాకాష్ట‌కు చేరింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. విషాదంలోనూ మంత్రులు వినోదం పొందుతున్నార‌ని కేటీఆర్ నిప్పులు చెరిగారు. హెలికాప్టర్ యాత్రలు చేస్తూ.. చేపకూర విందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రుల‌పై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉంద‌న్నారు. “అన్నం వండలేదు గుడిలో తినండి” అని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు ఆదేశాలు ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్ట‌ల్‌లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి హాస్ట‌ల్ సిబ్బంది వంట చేయ‌డం మానేశార‌ని కేటీఆర్ తెలిపారు.

* వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ (TTD) గుడ్‌న్యూస్‌ తెలిపింది. ముఖ్యంగా విద్యాసంస్థలకు సెలవుల కారణంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని ముందు జాగ్రర్తగా పలు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఈమేరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి ఘాట్‌ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్‌, తిరుమలలో భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చ‌లువ పెయింట్‌ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంత‌రాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులతో అన్నారు.

* ఏపీ బడ్జెట్‌ బుక్‌లో కలర్‌ ఎక్కువ.. కంటెంట్‌ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్‌ కరెక్టా? కూటమి నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్‌ చేస్తున్న సర్కస్‌ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్‌ బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్‌లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9నెలల్లోనే రికార్డ్‌ స్థాయిలో లక్షా 30వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది. సూపర్‌ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. సంపద ఎక్కడ సృష్టించారో నిజాయితీగా చెప్పగలరా? సంపద సృష్టి అంటే ఇదేనా. స్థూల ఉత్పత్తిపై కూటమి సర్కార్‌ పచ్చి అబద్ధాలు చెప్పింది. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులకే దిక్కులేదు.

* ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం(Brahmanandam) విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ నిట్లో(Warangal NIT) స్ప్రింగ్ స్ప్రి 2025 ప్రారంభించి మాట్లాడారు. చాలా పేదరికం నుంచి ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి, డా. బీఆర్‌ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఎంతో కష్టపడి చదివారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. లెక్చరర్ గా చేసినప్పటికీ నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచించగా సినిమాల్లో నటించే అవకాశం రాగా ఒక్కో అడుగు వేస్తూ ఒడిసి పట్టుకున్నానని తెలిపారు. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు గౌరవం ఇస్తారు. కృషి, పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లైఫ్ ఈజ్ ఏ గేమ్.. వి షుడ్ హావ్ టు ప్లే అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. 40 ఏళ్ల సినీ పరిశ్రమలో 1200 పైగా చిత్రాల్లో నటించాను. ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు తీసిన వ్యక్తి గా నిలిచిపోయానని పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు, డాక్టరేట్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాను. అందరూ బ్రహ్మా ‘ఆనందంగా’ఉండాలి, మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనలు వస్తాయని విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు.

* ఒక‌ప్పుడు కిడ్నీ స్టోన్లు కేవ‌లం పురుషుల‌కే అది కూడా 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారికే వ‌చ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా కిడ్నీ స్టోన్లు వ‌స్తున్నాయి. అలాగే కిడ్నీ స్టోన్ల బారిన ప‌డుతున్న‌వారిలో మ‌హిళ‌లు కూడా ఎక్కువ‌గానే ఉంటున్నారు. కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశ‌పారంప‌ర్యంగా కిడ్నీ స్టోన్లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు ఉండ‌డం, కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డుతుండ‌డం, థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉండ‌డం, నీళ్ల‌ను త‌క్కువగా తాగ‌డం, ఆహారం, వేడి వాతావ‌ర‌ణంలో నివ‌సించ‌డం, క్యాల్షియం ఉండే ఆహారాల‌ను ఎక్కువగా తిన‌డం, విట‌మిన్ డిని అధికంగా తీసుకోవ‌డం, యూరిక్ యాసిడ్‌ను అధికంగా త‌యారు చేసే ఆహారాల‌ను తిన‌డం.. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతుంటాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z