* మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌లో అంతుచిక్కని వ్యాధితో వెయ్యి కోళ్లు మరణించాయి. సతీశ్ గౌడ్ అనే పౌల్ట్రీ రైతు కోళ్ల ఫారమ్‌లో ఆదివారం నాడు గంటల వ్యవధిలో వెయ్యి కోళ్లు మృత్యువాతపడటం కలకలం రేపాయి. ఈ కోళ్లు ఎండ తీవ్రతతో చనిపోలేదని.. దీనికి సంబంధించి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని చెబితే పశుసంవర్థక శాఖ అధికారులు, కోడి పిల్లలను పంపిణీ చేసిన సూపర్‌వైజర్లు ఎవరూ పట్టించుకోవడం లేదని సతీశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
* నిమ్స్ అంటేనే పేద, మధ్యతరగతి ప్రజలకు స్వస్థత చేకూర్చే వైద్యశాలగా గుర్తింపు ఉంది. నిత్యం సుమారు 3 వేల మంది రోగులు వివిధ రకాల చికిత్సల కోసం వస్తుంటారు. ఔట్ పేషెంట్ వార్డు, మిలీనియం, స్పెషాలిటీ, ఎమర్జెన్సీ బ్లాకులకు వచ్చే రోగులకు ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ స్కాన్, ఇతర పరీక్షల కోసం వారి సహాయకులతో కలిసి వివిధ బ్లాకులకు తిరగాల్సి ఉంటుంది. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలు స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, ప్రజాప్రతినిధులు తమ వంతు సామాజిక బాధ్యతగా లక్షలాది రూపాయలు వెచ్చింది బ్యాటరీ వాహనాలను నిమ్స్‌కు సమకూర్చారు. మొట్టమొదటిగా యూనియన్ బ్యాంకు వారు నాలుగు, మరో ప్రైవేట్ బ్యాంకు రెండు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మూడు బ్యాటరీ వాహనాలను నిమ్స్‌కు అందజేశారు. అయితే వాటిని ఎప్పకప్పుడు మెయింటెనెన్స్ జరగాలి. ఆ బాధ్యత మొత్తం నిమ్స్ యాజమాన్యానిదే. కానీ కొంతకాలం పలు వాహనాలు నిర్వహణ లేక మూలాన పడినట్లు తెలుస్తోంది. క్యాంటీన్ పక్కనే నిరూపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఉన్న రెండు, మూడు వాహనాలతోనే వెల్లదీస్తున్నారని, దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. నిర్వహణ చూసే సంస్థకు సంబంధించిన వారు అవసరం ఉన్నప్పుడు రాకపోవడం వల్లే వాటిని పక్కన పెట్టాల్సి వచ్చిందని పరిపాలన విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటికైనా అన్ని వాహనాలను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.
* ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయానికి కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు. (AAP’s Office Locked) అయితే తమ నిజాయితీకి ఇది నిదర్శమని ఆప్ తెలిపింది. నిధులు లేకపోవడంతో అద్దె చెల్లించలేదని పేర్కొంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆప్ కార్యాలయానికి మూడు నెలలుగా అద్దె చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న ఆ పార్టీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు. కాగా, మధ్యప్రదేశ్ ఆప్ జాయింట్ సెక్రటరీ రమాకాంత్ పటేల్ దీనిపై స్పందించారు. స్థానిక నిధులతో పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన అన్నారు. ఆఫీస్ అద్దె మొత్తం ఎంత, ఎన్ని నెలలు చెల్లించాలో అన్న వివరాలు తనకు తెలియవని చెప్పారు. ‘మేం నిజాయితీగా పనిచేసినప్పుడే ఇలా జరుగుతుంది. ప్రస్తుతం మా పార్టీ వద్ద నిధులు లేవు. కాబట్టి మేం అద్దె చెల్లించలేకపోయాం. మేం నిజాయితీపరులం. పరిస్థితులు మెరుగుపడతాయి’ అని అన్నారు.
* ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy)అధికారులను ఆదేశించారు. సొరంగంలో 8మంది గల్లంతైన నేపథ్యంలో సహాయకచర్యలను సీఎం, మంత్రులు టన్నెల్‌లోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్‌ఎల్‌బీసీ వద్ద అన్ని విభాగాల అధికారులు, ఏజెన్సీలతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 2005-06లో ప్రారంభించారు. 2014 తెలంగాణ ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయింది. కానీ, గత పదేళ్లుగా భారాస ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదు. ఈ పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. దీంతో గత పదేళ్లుగా టన్నెల్ పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని.. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాం. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు కావాల్సిన విడి భాగాలను అమెరికా నుంచి తెప్పించి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకున్నాం. కానీ, అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది.”
* పార్టీ మారుతారని వస్తోన్న ఊహాగానాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. తాను కాంగ్రెస్‌కు నమ్మకమైన కార్యకర్తనని, పార్టీపై, గాంధీ కుటుంబం పట్ల తనకున్న నిబద్ధతను ఎవరైనా ప్రశ్నిస్తే అది వారి భ్రమే అవుతుందన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
* వైట్‌హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జెలెన్‌స్కీల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే, అక్కడ అనవసర రాద్దాంతం చేయవద్దని పేర్కొంటూ.. ఈ పరిణామానికి ముందే జెలెన్‌స్కీని (Volodymyr Zelenskyy) ఓ రిపబ్లికన్ సెనెటర్ సున్నితంగా హెచ్చరించారట. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ముందు.. రిపబ్లికన్, డెమోక్రటిక్ సెనెటర్లతో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఆ సమయంలో రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ మాట్లాడుతూ.. ‘‘అనవసర రాద్దాంతం చేయొద్దు. ట్రంప్‌తో మీరు వాగ్వాదానికి దిగొద్దు. సంబంధాల పునరుద్ధరణ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని చెప్పారు. కానీ, తదనంతర పరిణామాలు భిన్నంగా ఉన్నాయని, ఓవెల్ ఆఫీస్‌లో చూసినదంతా అగౌరవంగా కనిపించిందని మధ్యవర్తిగా ఉన్న లిండ్సే పేర్కొన్నారు.
* ఇరాన్ కరెన్సీ (Iranian Rial) నానాటికి పతనమవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి మరింత దిగజారింది. కరెన్సీ కుప్పకూలిపోవడంపై స్థానికంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నడుమ.. దేశ ఆర్థికశాఖ మంత్రి అబ్దొల్‌నాజెర్ హెమ్మతి అభిశంసనకు గురయ్యారు. ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 273 మంది సభ్యుల్లో 182 మంది ఓటేసినట్లు స్పీకర్ ఖాలిబఫ్ వెల్లడించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. మంత్రి తొలగింపు వెంటనే అమల్లోకి వస్తుంది. ఇరాన్‌లో మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రస్తుతం పశ్చిమ దేశాలతో పోరాటంలో చిక్కుకుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని ఆర్థికశాఖ మంత్రి హెమ్మతి తెలిపారు. ద్రవ్యోల్బణం 35 శాతంగా ఉందని అంగీకరించిన ఆయన.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే, దీనికి సమయం పడుతుందని చెప్పారు.
* మేనరికం, రక్త సంబంధీకుల మధ్య జరుగుతున్న వివాహాలు.. వారికి పుట్టే పిల్లలకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా మేనమామ, మేనబావ.. ఇలా దగ్గర సంబంధం ఉన్న వారు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఆ దంపతులకు పుట్టే పిల్లల్లో జన్యులోపాలు తలెత్తుతున్నాయని నిమ్స్ జన్యు విభాగం వైద్యులు చెబుతున్నారు. నిమ్స్‌కు వచ్చే జన్యు లోపాల కేసుల్లో చాలావరకు మేనరిక వివాహాలే ఉంటున్నాయని స్పష్టంచేస్తున్నారు. కొన్నిసార్లు శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే జన్యు వ్యాధులు దాడి చేస్తుండగా.. కొందరిలో పుట్టిన కొన్ని నెలల తర్వాత ఈ లోపాలు బయటపడుతున్నాయి. 2014లో 2,453 మంది చిన్నారులు జన్యులోపాలతో నిమ్స్‌కు రాగా… 2024లో ఆ సంఖ్య 12,042 దాటింది.
* మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే (Raksha Khadse) ఆందోళన వ్యక్తం చేశారు. జల్‌గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని (Harassment) పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ‘‘మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో ఏటా సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారు. ఇటీవల నిర్వహించిన స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్తానని నా కుమార్తె కోరడంతో సెక్యూరిటీ సాయంతో అక్కడకు పంపించాను. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే మా అమ్మాయి ఈ విషయం చెప్పింది. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇటువంటి దుస్థితి ఎదురైతే.. సాధారణ మహిళలు పరిస్థితి ఏంటో ఆర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశా’’ అని కేంద్ర మంత్రి ఖడ్సే మీడియాకు వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z