Politics

కోర్టుకు గైర్హాజరు. రాహుల్ గాంధీకి జరిమానా-NewsRoundup-Mar 05 2025

కోర్టుకు గైర్హాజరు. రాహుల్ గాంధీకి జరిమానా-NewsRoundup-Mar 05 2025

* కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. మరోవైపు అంజిరెడ్డి విజయంపై ఎన్నికల అధికారులు మరికాసేపట్లో ప్రకటన చేయనున్నారు.

* మాజీ మంత్రి వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కీలక సాక్షి రంగయ్య(70) మృతి చెందారు. వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగయ్య పలు ఆరోగ్య సమస్యల కారణంగా కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

* లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి లక్నో (Lucknow) కోర్టు రూ.200 జరిమానా విధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌ (Savarkar)పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్ గైర్హాజర్ కావడంతో కోర్టు సీరియస్ అయింది. ఆయనకు జరిమానా విధిస్తూ ఏప్రిల్ 14న తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.

* సుదీర్ఘ కాలం పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి ఆ తర్వాత తనను పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టే అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాంటి సందర్భాలలో పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. లివ్-ఇన్ పార్టనర్ అత్యాచారం చేశాడని ఆరోపించిన బ్యాంకు అధికారిపై క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

* న్యూజిలాండ్‌కు చెందిన చిన్న చేపల బోటులోకి 400కిలోల డాల్ఫిన్‌ ఎగిరి వచ్చి పడింది. ఆ సమయంలో ముగ్గురు మత్స్యకారులు బోటులోనే ఉండగా వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. డాల్ఫిన్‌ తాకిడికి పడవ తీవ్రంగా దెబ్బతింది. డాల్ఫిన్‌కు కూడా గాయాలయ్యాయి. దీంతో మత్స్యకారులు న్యూజిలాండ్‌ కన్వర్సేషన్‌ ఏజెన్సీని సాయం కోరగా.. డాల్ఫిన్‌ సహా మత్స్యకారులను మరో బోటు ద్వారా తీరం చేర్చారు. ఆ సమయంలో డాల్ఫిన్‌ను తడిగా ఉంచడం కోసం వాటర్‌ ఫ్లష్‌ సాయంతో నీటిని చల్లారు. తీరం చేర్చాక డాల్ఫిన్‌కు వైద్యం అందించి సముద్రంలోకి వదిలారు.

* తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాలపై తప్పుడు వార్తలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) ఖండించింది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతి త్వరలోనే గ్రూప్‌- 1 ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని.. అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులు ఉంచుతామని పేర్కొంది. గ్రూప్‌ -1 నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతోందని తెలిపింది. ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నామనీ.. అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

* రాజధానిపై వైకాపా అధినేత జగన్‌ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. రూ.63 వేల కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 1200 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రజలపై భారం ఉండదని, వైకాపా నేతల మాటలు ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

* రష్యాతో వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) సంసిద్ధత వ్యక్తం చేయడం సానుకూల పరిణామమని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ పేర్కొంది. అయితే, దండయాత్ర నేపథ్యంలో రష్యాతో చర్చలను నిరోధిస్తూ 2022లో ఉక్రెయిన్‌ జారీ చేసిన ఉత్తర్వుల సంగతేంటని ప్రశ్నించింది. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకునే ఆదేశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) 2022లో సంతకాలు చేశారు. ఆ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా తీవ్రంగా స్పందించారు. రష్యాతో (Russia) సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావించిన క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌.. సంప్రదింపులపై నిషేధం ఉన్నవేళ చర్చలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు.

* శాసనసభలో ప్రతిపక్ష హోదాపై వైకాపా అధ్యక్షుడు జగన్‌ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. సభలో ఇంతమంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూలింగ్‌ ఎక్కడా లేదన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత అసెంబ్లీలో తెదేపా సభ్యులు 10 మందిని లాక్కోకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చా. మా వాళ్లు అయితే 10 మంది తెదేపా ఎమ్మెల్యేలను లాగేద్దాం అన్నారు’’ అని పేర్కొన్నారు.

* ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్రను చరిత్రకారులు సరిగ్గా పట్టించుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) పేర్కొన్నారు. శంభాజీ జీవిత కథతో రూపొందిన ‘ఛావా’ చిత్రాన్ని వీక్షించిన ఆయన.. సినిమా చాలా బాగుందన్నారు. శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) ధైర్య సాహసాలను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని, యోధుల చరిత్రపై ఈ సినిమా నేటి తరానికి ఎంతో అవగాహన కల్పిస్తుందన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z