Business

ఏప్రిల్ 2న ఇండియా షాక్ ఇస్తా-BusinessNews-Mar 05 2025

ఏప్రిల్ 2న ఇండియా షాక్ ఇస్తా-BusinessNews-Mar 05 2025

* అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ సంయుక్త సెషన్‌లో ప్రసంగించారు డొనాల్డ్‌ ట్రంప్‌. ఈ సందర్భంగా పదవి చేపట్టిన ఆరు వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాలను గురించి ఆయన (Donald Trump) చెప్పారు. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దాని కంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్లు తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా పలు దేశాలపై విధిస్తున్న సుంకాల అంశాన్నీ ట్రంప్‌ ప్రస్తావించారు. భారత్‌, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని వెల్లడించారు.

* ఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్‌డ్రా ఇకపై సులభతరం కానుంది. బ్యాంక్‌ ఖాతాల మాదిరిగానే ఈపీఎఫ్‌ నగదును కూడా విత్‌ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా నగదు ఉపసంహరించుకునే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం పీఎఫ్‌ నగదును విత్‌డ్రా చేయాలంటే కొన్ని రోజుల సమయం పడుతోంది. తిరస్కరణకు గురైన సందర్భాలూ కోకొల్లలు. ఈ నేపథ్యంలోనే నగదు విత్‌డ్రాను సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కొద్ది రోజుల క్రితం స్వయంగా వెల్లడించారు. జూన్‌ నాటికి ఈ సదుపాయం రాబోతోందని పేర్కొ్న్నారు.

* దేశంలో ధనికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 10 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారి సంఖ్య 2024లో 6 శాతం మేర పెరిగి 85,698కి చేరింది. ఒకప్పుడు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన బిలియనీర్ల సంఖ్య సైతం 191కి చేరిందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది. ఈమేరకు ‘ది వెల్త్‌ రిపోర్ట్‌ 2025’ నివేదికను బుధవారం విడుదల చేసింది. గతేడాది ధనవంతుల సంఖ్య 80,686గా ఉందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. 2028 నాటికి ఈ సంఖ్య 93,753కి చేరుకోవచ్చని అంచనా వేసింది. హెచ్‌ఎన్‌ఐ జనాభా పెరుగుదల దేశం దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలు, వృద్ధి చెందుతున్న లగ్జరీ మార్కెట్‌ను ప్రతిబింబిస్తోందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికాలో అత్యధికంగా 9,05,413 మంది ధనవంతులు ఉండగా.. 471,634 మంది ధనవంతులతో చైనా రెండో స్థానంలో ఉంది. 1,22,118 మంది ధనవంతులతో జపాన్‌ మనకంటే ముందు వరుసలో నిలిచింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఓ దశలో సెన్సెక్స్‌ 900 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ సైతం 22,400 మార్కుకు చేరువైంది. చివరికి 22,350కు చేరువలో ముగిసింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 2 శాతం మేర రాణించాయి. సెన్సెక్స్‌ ఉదయం 73,005.37 (క్రితం ముగింపు 72,989.93) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 73,933.80 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 740.30 పాయింట్ల లాభంతో 73,730.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 255.80 పాయింట్ల లాభంతో 22,338.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు మేర బలపడి 86.96 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జొమాటో, మారుతీ సుజుకీ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 70.52 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు2929 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z