* షేర్ల బదలాయింపునకు సంబంధించి హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా టైబ్య్రునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో వైకాపా అధినేత జగన్ (Jagan) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులు సమయం కోరడంతో తదుపరి విచారణను ఎన్‌సీఎల్‌టీ ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. తన పేరు మీద, వైఎస్ భారతి పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని పిటిషన్ దాఖలు చేశారు.
* రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరిస్తేనే ఏపీ అభివృధ్ధి జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ప్రశంసించారు. తనదైన శైలిలో ఛలోక్తులతో సభలో నవ్వులు పూయించారు.
* భోగాపురం విమానాశ్రయానికి రహదారులపై చర్చ సందర్భంగా సభలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఈ అంశంపై సభ్యులు గంటా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడారు. సమస్యల్ని మంత్రి నారాయణ దృష్టికి తెచ్చారు. వాటిపై మంత్రి స్పందిస్తూ.. సమస్యల్ని చర్చిస్తామని తెలపగా.. దానికి స్పీకర్ స్పందిస్తూ గంటా శ్రీనివాస్‌ను చూపిస్తూ మీరూ, మీరూ వియ్యంకులు. మంత్రి నారాయణతో మాట్లాడొచ్చు కదా? అని చమత్కరించారు. అంతకుముందు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం పూర్తయినా మెట్రో పూర్తయ్యే వరకు ప్రస్తుత విశాఖ విమానాశ్రయాన్ని తెరిచే ఉంచాలని, అందుకోసం ఉద్యమం చేయాలని ప్రజలు తనను కోరుతున్నారని సరదాగా చెప్పారు. కానీ, మేం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఉద్యమం చేయకూడదని వారికి చెప్పానంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన స్పీకర్.. మనం ఉమ్మడిగా ఉన్నాం. ఉద్యమాలు చేయడానికి వీలు లేదంటూ పేర్కొన్నారు.
* మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చిన్నతనంలోనే నేర్చుకున్నాం. కానీ, ఓ సీనియర్ ఉద్యోగి మాత్రం అది మరచి.. బాధ్యతారహితంగా ప్రవర్తించారు. ఐఆర్‌సీటీసీ ఉద్యోగి (Indian Railways) కదులుతున్న రైలులో నుంచి చెత్తను (Garbage) బయటకు విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్లో చెత్త బుట్ట నిండిపోవడాన్ని ఆ సీనియర్ ఉద్యోగి గమనించారు. కదులుతున్న రైల్లో నుంచే చెత్తను పట్టాల పైకి విసిరేశారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు అలా చేయకండి అంటూ వారించారు. అయినప్పటికీ ఉద్యోగి నవ్వుతూ.. మరి చెత్తను ఇంకెక్కడ వేయమంటారు? అని అన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీనియర్ ఉద్యోగి అయినా.. మతి లేకుండా ప్రవర్తించారు’ అని ఒకరు.. ‘ఇది మన భారత రైల్వే వ్యవస్థ పరిస్థితి’ అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు.
* నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు క్యాడవర్ జాగిలాలను తీసుకువచ్చారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం, జిల్లా కలెక్టర్ సంతోష్.. విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. 8మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద, మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్‌లను వినియోగిస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు అధికారులు 13 రోజులుగా చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర ఏజెన్సీల నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఫలితం తేలకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్‌లను వినియోగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషిన్(టీబీఎం)పైన, చుట్టుపక్కల పేరుకుపోయిన బురదపై వీటితో నీటిని పంప్ చేస్తున్నారు.
* తోడల్లుళ్లు సీఎం చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara rao) దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన అనంతరం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.
* విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఏపీకి సహకరిస్తున్నందుకు ఖట్టర్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పర్యటన ముగించుకొని నేరుగా దిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్రమంత్రితో సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ రాత్రికి దిల్లీలోనే బస చేయనున్నారు.
* తితిదే ఛైర్మన్ ఫొటోలు వాట్సప్ డీపీగా పెట్టుకొని, శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న కేటుగాడిని తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరికి చెందిన ఫరూఖ్ అలియాస్ ప్రసాద్.. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కొవ్వూరులో నివాసముంటున్నాడు. గత నాలుగు నెలల నుంచి ‘తిరుమల సమాచారం’ పేరుతో వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి, అందులో దాదాపు 600 మందిని చేర్చాడు. తితిదే ఛైర్మన్ పీఆర్‌వోనంటూ ప్రచారం చేసుకున్నాడు. తిరుమల దర్శనం టికెట్ల వివరాలు గ్రూప్‌లో పోస్టు చేస్తూ.. ఎవరికైనా దర్శనం టికెట్ కావాలంటే తనను సంప్రదించాలని చెప్పేవాడు.
* లండన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar).. ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూలవాదులు చేసిన హంగామా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను బ్రిటన్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. కేవలం శాంతియుత నిరసనలను అనుమతిస్తామని.. బెదిరింపు ధోరణి, అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. ‘‘బ్రిటన్‌లో భారత విదేశాంగశాఖ మంత్రి పర్యటన సందర్భంగా ఛాఠమ్ హౌస్ వద్ద చోటుచేసుకున్న ఘటనను ఖండిస్తున్నాం. శాంతియుత నిరసన హక్కును బ్రిటన్ సమర్థిస్తున్నప్పటికీ… బెదిరింపు ధోరణి, అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదు’’ అని బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ (FCDO) వెల్లడించింది. అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా దౌత్యవేత్తలందరికీ రక్షణ కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు.
* మార్చి 9 ఆదివారం.. ప్రపంచ క్రికెట్‌కి ఇది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు. కానీ భారత అభిమానులకు 25 ఏళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న రోజు కూడా. సౌరభ్ గంగూలీ నాయకత్వంలోని భారత్ 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. అప్పుడు కివీస్‌కు సారథిగా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 264/6 స్కోరు చేసింది. కానీ, లక్ష్య ఛేదనలో కివీస్‌ను ఆపలేకపోయిన భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
* రోడ్డు ప్రమాదాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే దేశంలోనే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో అధ్వానమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (DPRs) తయారు చేస్తున్నారని, వాటి ప్రణాళిక, రూపకల్పన సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. గ్లోబల్ రోడ్ ఇన్‌ఫ్రాటెక్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను తక్షణం మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘దేశంలో చాలా వరకు ప్రమాదాలు సివిల్ ఇంజినీర్లు చేస్తున్న చిన్న తప్పుల వల్లే జరుగుతున్నాయి. లోపాలతో కూడిన డీపీఆర్‌లు అందించడం వల్ల ఇటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటికి ఎవరూ బాధ్యత వహించడం లేదు. మరీ ముఖ్యంగా రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్‌లు లోపభూయిష్టంగా ఉన్నాయి. చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా చేయడం లేదు. స్పెయిన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి దేశాల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి’’ అని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు.
* తనను భారత్‌కు అప్పగించవద్దని (Extradition) ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా (Tahawwur Rana) అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అప్పగింతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమ్మతి తెలిపిన నేపథ్యంలో ఈ పిటిషన్ వేసిన అతడు.. భారత్‌పై నిందలు వేశాడు.
* అమెరికాలో అక్రమ వలసదారులపై కన్నెర్ర చేస్తున్న ట్రంప్ (Donald Trump) యంత్రాంగం.. వీసా గడువు ముగిసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో హెచ్-1బీ (H-1B visa) వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది. సుమారు లక్ష మందికిపైగా భారతీయులు అమెరికా బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. డిపెండెంట్ వీసాతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లగా.. వీరి వయసు 21 ఏళ్లు నిండటమే తాజా ఆందోళనకు కారణం. హెచ్1బీ వీసాదారుల పిల్లలు డిపెండెంట్ (H-4) వీసా కింద అమెరికాకు వెళ్లవచ్చు. మైనర్‌గా వెళ్లిన వీరికి 21 ఏళ్లు నిండే వరకు ఈ వీసా పనిచేస్తుంది. అనంతరం కొత్త వీసా పునరుద్ధరణకు రెండేళ్ల గడువు ఉంటుంది. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగింపు దశకు చేరుకున్న భారతీయ చిన్నారుల సంఖ్య దాదాపు 1.34 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. వీసా గడువు ముగిసే వారు ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 (Student visa) వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతామనే ఆందోళన వారిలో నెలకొంది.
* దేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. పలు దేశాల నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోనుందని, వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z