* ఇండియాలోనే తొలి గోల్డ్ లోన్ ఏటీఎం ను వరంగల్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.వి.రావు శుక్రవారం (మార్చి7) ఏటీఎంను లాంచ్ చేశారు. ఈ ఏటీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్ లో ఇది గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ కానుందని ఈ సందర్భంగా ఎం.వి.రావు తెలిపారు. ఏటీఎం మెషిన్ లో బంగారు ఆభరణాలు వేసినపుడు వాటి క్వాలిటీ, బరువును అంచనా వేస్తుంది. బంగారం క్వాలిటీని బట్టి ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా పేమెంట్ చేస్తుంది. చాలా కచ్చితమైన లెక్కలతో ఇది ఆభరణాలను కొలుచి పేమెంట్ చేస్తుందని అంటున్నారు. ఏటీఎం మెషీన్ లో వేసిన బంగారాన్ని తూచిన తర్వాత 10 శాతం అమౌంట్ ను క్యాష్ రూపంలో ఏటీఎంలో అప్పటికప్పుడే చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అయితే వినియోగదారులు సెంట్రల్ బ్యాంకు ఖాతాదారులై ఉండాలి. బ్యాంక్ సిబ్బందితో పాటు కస్టమర్స్ సమయాన్ని ఆదా చేసుందుకు ఈ ఏటీఎం ఉపయోగపడుతుంది. అదే విధంగా గోల్డ్ లోన్ గురించి అధికారులపై ఆధారపడకుండా, ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఈ టెక్నాలజీ ఏటీఎం ఉపకరిస్తుంది. ఇది సక్సెస్ అయితే దేశంలోని అన్ని బ్రాంచులలో ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎం.వి.రావు తెలిపారు.
* బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఇవాళ(మార్చి 8, 2025) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై 550 రూపాయలు పెరిగింది. దీంతో.. 87,160 రూపాయలు ఉన్న బంగారం ధర 87,710 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా 500 రూపాయలు పెరిగి 79,900 రూపాయల నుంచి 80,400 రూపాయలకు పెరిగింది. మార్చి 1న 24 క్యారెట్ల బంగారం ధర 86,620 రూపాయలు ఉండగా వారం రోజుల్లో 87,710 రూపాయలకు పెరిగింది.
* 2023–24 ఆర్థిక సంవత్సరంలో మనదేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన 8.9 కోట్ల మంది మహిళలు వివిధ బాధ్యతలు, సమస్యల కారణంగా పనులకు దూరంగా ఉండిపోయారు. చెన్నయ్‌కు చెందిన గ్రేట్‌లేక్స్ ఇన్స్టిట్యూట్ఆఫ్ మేనేజ్మెంట్‘ఇండియాస్ జెండర్ ఎంప్లాయ్మెంట్ పారడాక్స్’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడి చేసింది. దీని ప్రకారం.. ఇదేకాలంలో మహిళల ఉపాధి 10 శాతం పెరిగింది. కంపెనీలు చదువుకున్న మహిళల నైపుణ్యాలను ఉపయోగించుకోలేకపోతున్నాయి. దీనివల్ల లింగసమానత్వం సాధ్యం కావడం లేదు. సామాజిక కట్టుబాట్లు, కుటుంబ పరమైన బాధ్యతల కారణంగా 1.9 కోట్ల మంది మహిళా గ్రాడ్యుయేట్లు నాలుగు గోడలకే పరిమితమవుతున్నారు. వారి చదువు కోసం చేసిన ఖర్చు వృథా అవుతోంది. పిల్లలను చూసుకోవాల్సి రావడం, రాత్రి వేళల్లో పనిచేయాల్సిన పరిస్థితులు, ప్రయాణ సంబంధిత ఇబ్బందుల వల్ల హైక్వాలిఫైడ్ మహిళలు కూడా ఉద్యోగాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది.
* పసిడి రుణాలకు కళ్లెం వేయడానికి రిజర్వుబ్యాంక్ సిద్ధమవుతున్నది. ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటున్న గోల్డ్ లోన్లకు చెక్ పెట్టడానికి త్వరలో కఠిన నిబంధనలను అమలులేకి తేవాలని చూస్తున్నది. ఇందుకు సంబంధించి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు జారీ చేస్తున్న గోల్డ్ లోన్లపై నిఘా పెట్టాలని సూచించింది. గోల్డ్ లోన్ తీసుకున్నవారు ఈ నిధులను దేనికి వినియోగిస్తున్నారు.. అసలు బంగారం వారిదేనన్న దానిపై పూర్తి వివరాలు సేకరించాలని బ్యాంకులకు సూచించింది. గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా బంగారం తాకట్టుపై రుణాలు 50 శాతానికి పైగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సెంట్రల్ బ్యాంక్.. దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లనే రుణాలు అత్యధికంగా తీసుకుంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీసుకున్న రుణాలు వారు దేనికి వినియోగిస్తున్నారన్న విషయంపై మానిటర్ చేయాలని సూచించింది. రుణాలు తీసుకున్నవారి కుటుంబ వివరాలు, పసిడి వారిదేనా లేకపోతే ఇతరవారు వీరిపై తీసుకుంటున్నారా అనేదానిపై సమాచారం సేకరించాలని పేర్కొంది. ఇటీవలకాలంలో తమవద్ద ఉన్న బంగారాన్ని వేరేవారి పేరుమీద తీసుకొని ఇతర పెట్టుబడులు పెడుతున్నారనే సమాచారం ఆధారంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించనియెడల ఈ బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంటుంది.
* కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలో కొత్త సోలార్ సెల్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ వెల్లడించింది. 169 ఎకరాల్లో రూ.1,700 కోట్ల పెట్టుబడితో 4 గిగా వాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి సలుజా పేర్కొన్నారు. భూమి కేటాయింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. సెల్ తయారీ పూర్తిగా దేశీయంగా జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొత్త ప్లాంటు ఉంటుందని పేర్కొన్నారు. భౌగోళిక వికేంద్రీకరణతో పాటు, ముడి సరకుల దిగుమతికి ఓడరేవు దగ్గరగా ఉండటం వల్లే నాయుడుపేటను ఎంచుకున్నామని.. దీనివల్ల తమిళనాడులోని సోలార్ మాడ్యూల్ తయారీదారులకు సెల్‌లు అందించడం తేలికవుతుందని వివరించారు. 2026 జూన్ కల్లా కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z