* తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ గాయని కల్పన తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య వార్తలను ఆపాలని కోరారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల గాయని కల్పన (Singer Kalpana) అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల సాయంతో వర్టెక్స్ ప్రీ వీలేజ్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ ఆమెను ఆస్పత్రికి తరలించింది. చికిత్స అనంతరం కోలుకున్న కల్పన మాట్లాడుతూ.. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు. నిద్ర మాత్రల మోతాదు ఎక్కువడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు చెప్పారు.
* రాత్రయితే చాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. రాత్రంతా టార్చ్లైట్లు వేసుకుంటూ తవ్వకాలు జరుపుతున్నారు. జల్లెడలు, మెటల్ డిటెక్టర్లు వినియోగిస్తున్నారు. ఎవరికి వారు బంగారం, వెండి నాణేలు దొరికాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో చీకటి పడితే చాలు ఊళ్లకు ఊళ్ల ప్రజలు ఆ ప్రాంతంలో గుప్తనిధుల వేట సాగిస్తున్నారు. ఇదీ గత కొన్ని రోజులు మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లోని అసిర్గఢ్ కోట వద్ద పరిస్థితి. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ చిత్రంలో ఈ ప్రాంతాన్ని బంగారం గనులున్నాయంటూ పేర్కొనడం ఈ గుప్త నిధుల ప్రచారానికి ఆజ్యం పోసింది.
* మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా ఉమెన్స్ పేరుతో స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది. అమ్మ అంజనాదేవి, సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిరంజీవి. తన జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.
* గత పదేళ్లుగా మహిళ భద్రత కోసం తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరించామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా గుజరాత్‌లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.
* పేరుమోసిన రౌడీషీటర్, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తొత్తుగా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్న విషయం తెలుసుకొని వివరణ ఇచ్చారు. గత ఐదేళ్లలో లెక్కలేనన్ని దందాలు, దౌర్జన్యాలకు పాల్పడడమేగాక చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల్లో అరెస్టయి.. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చిన బోరుగడ్డ మొసలి కన్నీరు కారుస్తూ వీడియో విడుదల చేశారు.
* ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు వస్తున్నాయి. టోర్నీ అనంతరం ఈ ఇద్దరూ లేదా.. కనీసం వీరిలో ఒకరైనా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారు అని వినవస్తోంది. కానీ ఈ విషయం మీద టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గిల్ భిన్నంగా స్పందించాడు. డ్రెస్సింగ్‌రూంలో అసలు రిటైర్మెంట్ల గురించి చర్చకే రాలేదన్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ ఈ విషయాన్ని తెలిపాడు. ఉత్తమ బ్యాటింగ్ లైనప్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నాడు.
* ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఓ మహిళా కానిస్టేబుల్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనిత.. విశాఖ జిల్లాలోని మహిళా కానిస్టేబుల్ రేవతి ఇంటికి వెళ్లారు. కానిస్టేబుల్ రేవతి, ఆమె కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రేవతికి ఘనంగా దగ్గరుండి సీమంతం చేశారు. దీంతో రేవతి భావోద్వేగానికి గురయ్యారు.
* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్నాథ్రావు ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ అనూహ్యమైన అభ్యర్థన చేశారు. మహిళలపై పెరుగుతున్న నేరాల అణచివేతకు ఎలాంటి శిక్షా పడకుండా ఒక హత్యకు మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి రాసిన లేఖలో అందుకు గల కారణాలను పేర్కొన్నారు. ‘‘ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బుద్ధుడు, మహాత్మా గాంధీ వంటి వాళ్లు నడయాడిన దేశం మనది. శాంతికి, అహింసకు నిలయం. అలాంటి దేశంలో మహిళలకు రక్షణ కరవైంది. మహిళలపై హింసా ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం ముంబయిలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే మానవమృగాల్లో ఉన్న ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనావిధానాన్ని అంతమొందించేందుకు మాకు అనుమతినివ్వండి అని లేఖలో కోరారు.
* ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో చంద్ర గ్రహణం తొలగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో సీఎం ప్రసంగించారు. ‘‘ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో ఆ మార్పు ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో కనిపిస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించాం. ఆడ బిడ్డలు తలచుకుంటే వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదు.
* రాజధాని నిర్మాణ పనులకు పిలిచిన టెండర్లను తెరిచినట్టు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచిన టెండర్లు ఓపెన్ చేశామని చెప్పారు. ఈ నెల 12 నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ రూ.40 వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను తెరిచినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో కాంట్రాక్టు సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా జారీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేకపోయినట్టు మంత్రి వివరించారు.
* శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9వ తేదీ రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. 13వ తేది వరకు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి వారి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు (షవర్) పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు.
* మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఆయన ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. వారు వ్యాపారంలో రాణించేలా 24 సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z