* వైఎస్సార్‌సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
* తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్‌లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది.
* అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు సారథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ తన నీడను తానే నమ్మడం లేదు. అందుకే తనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఫోన్ కాల్స్ కనెక్ట్ చేసేందుకు ఎఫ్‌బీఐలో ఓ వ్యవస్థ ఉంది. దానికి బదులుగా నేరుగా ట్రంప్‌తో మాట్లాడే సదుపాన్ని కల్పించాలని ఆదేశించారు. అందుకు ట్రంప్ ఒప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
* అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11 వ తేదీ (మంగళవారం) నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
* బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు.
* శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికులకు సేవలు అందించడంలో అఖిల భారత బ్రాహ్మణ కరివేణ నిత్యాన్నదాన సత్రం అన్ని సత్రాలకు ఆదర్శనీయంగా ఉండటం హర్షించదగినదని ఒలెక్ట్రా సంస్థ చైర్మన్ కేవీ ప్రదీప్ అన్నారు. ఆదివారం కరివేణ సత్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 136 ఏళ్ల క్రితం శ్రీశైల క్షేత్రంలో ప్రారంభమైన నిత్యాన్నదాన సత్రం యాత్రికులకు సేవలందిస్తూ ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో శాఖలుగా విస్తరించడం అభినందనీయమని అన్నారు. దేవస్థానం సూచనలతో కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండేలా వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు సత్ర నిర్వాహకులు తెలిపారు.
* గోదావరి పరివాహక ప్రాంతమంతా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతూ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్‌కు ఇసుక మాఫియాపై ఉన్న ప్రేమ, ప్రజలపై ఏదీ అని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కమీషన్లు, ఇసుక దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుగా ఉందని దుయ్యబట్టారు. భద్రాచలం పట్టణం శాంతినగర్‌లో రావులపల్లి రాంప్రసాద్ స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు తప్పవన్నా నానుడి మరోమారు రుజువైందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతుంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.
* కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ (Justin Trudeau).. తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ఈ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన సారథిని ఎన్నుకునేందుకు అధికార లిబరల్ పార్టీ (Liberal Party of Canada) సిద్ధమైంది. ఇందుకోసం నేడు (మార్చి 9) పార్టీలో ఓటింగ్ నిర్వహించనుంది. ఈ రేసులో నలుగురు కొనసాగుతున్నారు. అమెరికా నుంచి కెనడా సుంకాల సవాలు ఎదుర్కొంటున్న వేళ.. కెనడా పాలనా పగ్గాలు ఎవరు చేపట్టనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. లిబరల్ పార్టీ సారథి రేసులో మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్, ఫ్రాంక్ బేలిస్‌లు ఉన్నారు. వీరిలో కార్నీ, ఫ్రీలాండ్‌ల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ నూతన ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. దాదాపు వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసిన గరిమెళ్ల.. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’ లాంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. ఈ శుక్రవారమే యాదగిరిగుట్టలోనూ గరిమెళ్ల తన ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలిసి సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z