తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన త్రిమూర్తి సంగీత ఉత్సవం అందరినీ అలరించింది. కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రతిభావంతులు, వాగ్గేయకారులైన శ్రీముత్తు స్వామి దీక్షితులు, శ్యామా శాస్త్రి, త్యాగరాజులకు గాననీరాజనంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్నా మాట్లాడుతూ.. శాస్త్రీయ సంగీత పోషణ, ప్రోత్సాహం ప్రతిబింబించేలా తెలుగు కళా సమితి నిర్వహించిన త్రిమూర్తి సంగీత ఉత్సవం అందరినీ ఆనంద డోలికలలో ముంచెత్తిందన్నారు. తెలుగు భాషకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ, సంగీతానికి గౌరవాన్నిచ్చే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగం అని అన్నారు.
న్యూజెర్సీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు, విద్యార్థులు ముగ్గురు వాగ్గేయకారులకు, వాతాపి గణపతిం భజే, జగదానందకారకా, సాధించినే ఓ మనసా, ఎందరో మహానుభావులు, బైరవిలో అంబాకామాక్షి కృతులను భక్తితో గానం చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సుమారు 20 సంగీత కళాశాలల గురువులు తాము, తమ విద్యార్థులతో వాగ్గేయకారుల రచనలను శృతి, లయలతో గానం చేశారు.
ఈ కార్యక్రమానికి చేయూతనందించిన హెల్ప్ ఫౌండేషన్ న్యూ జెర్సీ వారిని, సంగీత విద్వాంసులను తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. సత్య, ప్రసాద్, వాణి, అరుంధతి, లత, వరలక్ష్మి, లోకేందర్, శేషగిరి టీఎఫ్ఏఎస్ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z