Business

90వేలకు చేరువలో బంగారం ధర-BusinessNews-Mar 13 2025

90వేలకు చేరువలో బంగారం ధర-BusinessNews-Mar 13 2025

* తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పైకెగసింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన డిమాండ్‌ కారణంగా దేశీయంగా మరోసారి పసిడి ధర ఆకాశాన్ని తాకింది. దేశ రాజధాని దిల్లీలో గురువారం 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.600 పెరిగి రూ.89,450కి చేరింది. ఫిబ్రవరి 20న పసిడి ధర రూ.89,450గా నమోదైంది. మళ్లీ దాదాపు 20 రోజుల తర్వాత బంగారం ధర మళ్లీ అదే స్థాయికి చేరిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అటు వెండి సైతం ఒక్క రోజులో కిలోకు వెయ్యి రూపాయలు మేర పెరిగింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.1,00,200గా ఉన్న వెండి ధర రూ.1,01,200కు చేరింది. ఇది ఐదు నెలల గరిష్ఠానికి సమానం. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్సు ధర 2946 డాలర్లకు చేరింది. అమెరికాలో తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు పసిడి ధర పెరగడానికి కారణమయ్యాయి. అంచనాల కంటే తక్కువగా ద్రవ్యోల్బణం నమోదు కావడంతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కారణంతోనే బంగారం వైపు పెట్టుబడులు మళ్లుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. ఇంట్రాడేలో ఆ లాభాలను కోల్పోయాయి. హోలీ సందర్భంగా శుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈకి సెలవు కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాల వల్ల ఎప్పుడేం జరుగుతోందోనన్న భయాలు ప్రపంచ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా పొజిషన్లు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రాలేదని అనలిస్టులు చెబుతున్నారు. దీంతో సెన్సెక్స్‌ వరుసగా ఐదో రోజు నష్టపోగా.. నిఫ్టీ సైతం 22,400 దిగువన వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 74,392.54 పాయింట్ల వద్ద (క్రితం 74,029.76) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,401 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత అమ్మకాలతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి 200.85 పాయింట్ల నష్టంతో 73,828.91 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73.30 పాయింట్ల నష్టంతో 22,397.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 87గా ఉంది. సెన్సె్క్స్‌ 30 సూచీలో జొమాటో, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, టాటాస్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్ 70 డాలర్లు, బంగారం ఔన్సు 2953 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

* బీఎస్ఎన్ఎల్ హోలీ సంద‌ర్భంగా యూజ‌ర్ల‌కు రీచార్జ్ ప్లాన్స్ వాలిడిటీని పెంచింది. బీఎస్ఎన్ఎల్ రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 30 రోజుల అద‌నంగా వ్యాలిడిటీని పెంచింది. గ‌తంలో ఈ ప్లాన్ చెల్లుబాటు 395 రోజులు ఉండ‌గా.. ప్ర‌స్తుతం 425 రోజుల‌కు పెంచింది. ఈ ప్లాన్‌లో భార‌త్ అంత‌టా అప‌రిమిత కాలింగ్ సౌక‌ర్యం అందించ‌నున్న‌ది. అలాగే, ఢిల్లీ, ముంబ‌యిలోని ఎంటీఎన్ఎల్ నెట్‌వ‌ర్క్‌లో కూడా ఉచిత కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో వినియోగ‌దారులు ప్ర‌తిరోజూ 2జీబీ హై స్పీడ్ డేటా, వంద ఉచిత ఎస్ఎంఎస్‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఇది మొత్తం ప్లాన్ వ్య‌వ‌ధిలో మొత్తం 850 జీబీ డేటా అందుతుంది. దాంతో పాటు బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ బీటీవీ (BiTV) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కొన్ని ఓటీటీ యాప్‌ల యాక్సెస్ సైతం ల‌భించ‌నున్న‌ది.

* ఉద్యోగుల మధ్య జీతాల ( salaries ) తేడాల్లేకుండా వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys founder Narayana Murthy) వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఉద్బోధించారు. కారుణ్య పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ, ఎక్కువ అనే వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ కార్యక్రమంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకోసం ‘ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, వారి లోపాలను చెప్పాల్సినప్పుడు ఏకాంతంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు సంస్థ ఫలాలను కంపెనీ ఉద్యోగులందరికీ న్యాయంగా పంచాలి’ అని నారాయణమూర్తి సూచించారు. దేశంలోని వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానాన్ని కరుణతో స్వీకరించినప్పుడే భవిష్యత్ భారత అభివృద్ధి, పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆయన అన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు భారత్ లోని యువత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z