ScienceAndTech

బయటకు వచ్చిన OpenAI ప్రజావేగు నూతన వీడియో-NewsRoundup-Mar 13 2025

బయటకు వచ్చిన OpenAI ప్రజావేగు నూతన వీడియో-NewsRoundup-Mar 13 2025

* ఆంధ్రప్రదేశ్‌(AP News)లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు మొత్తం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో బరిలో ఉన్న కొణిదల నాగేంద్రరావు (జనసేన), బీద రవిచంద్ర(తెదేపా), బి.తిరుమల నాయుడు(తెదేపా), కావలి గ్రీష్మ ప్రసాద్‌ (తెదేపా), సోము వీర్రాజు (భాజపా) ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.వనితా రాణి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై లఘు చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు సీఎం చంద్రబాబు పేరు ఇక సూర్యబాబుగా మారుతుందేమో అని రఘురామ వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘‘మీరు నాకు కరెంట్‌ షాక్‌ ఇవ్వాలనుకుంటున్నారు’’ అని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

* ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తన ముఖ్య అనుచరుడు, రాజకీయ నిర్దేశకుడు గాదె సత్యం సంతాప సభలో మంత్రి తుమ్మల కన్నీటి పర్యంతమయ్యారు. గాదె సత్యం సంతాప సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. నియోజకవర్గ, జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి తనకు సహకారం అందించిన ముఖ్యుల్లో సత్యం ఒకరని తెలిపారు. సత్యం మృతి బాధాకరమని కన్నీరు పెట్టారు. ఆయన సలహాలు, ఆలోచనలకు అనుగుణంగానే తన రాజకీయ నడవడిక జరిగిందన్నారు. ఆయన లేకపోవడం తన భవిష్యత్తు రాజకీయాలకు, వ్యక్తిగతంగా తీరని లోటు అని అన్నారు.

* చాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ (OpenAI)లో నాలుగేళ్లు పరిశోధకుడిగా పనిచేసిన ప్రజా వేగు (విజిల్‌ బ్లోయర్‌), భారత సంతతి వ్యక్తి సుచిర్‌ బాలాజీ (26)(Suchir Balaji) గతేడాది అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అతడి మరణానికి ముందు సీసీటీవీలో రికార్డయిన ఫొటోను సుచిర్ తల్లి పూర్ణిమారావు పంచుకున్నారు. ఆ ఫొటోలో అతడు ఫుడ్‌ పార్శిల్‌ పట్టుకొని లిఫ్ట్‌ ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. ‘సుచిర్‌ చనిపోయిన రోజు రాత్రి 7:30 నిమిషాలకు సంబంధించిన ఫొటో ఇది. చీఫ్‌ మెడికల్ ఎగ్జామినర్‌ కార్యాలయం (OCME) ఈ వీడియోను చూసింది. అయినప్పటికీ.. అతడు నిరాశకు లోనయ్యాడని, ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధరించారు. అంతేకాదు.. అతడు చనిపోయిన 3 రోజుల తర్వాత నిర్వహించిన శవపరీక్షలో డ్రగ్‌ మోతాదు ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే, అది తప్పని మేము చేయించిన రిపోర్టులో వెల్లడైంది. దీనిపై టాక్సికాలజిస్ట్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం’ అని పూర్ణిమారావు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. సుచిర్‌ హత్యకు దీర్ఘకాలంగా ప్రణాళికలు రచించినట్లు ఆమె మరో పోస్టులో ఆరోపించారు. అతడు నివసించే అపార్టుమెంటు గ్యారేజీలో, ఎలివేటర్‌లో ఎలాంటి సీసీటీవీలు లేవని, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా అవి పనిచేయడం లేదని తెలిపారు.

* పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పాక్‌లో వివక్షను ఎదుర్కొన్నట్లు పేర్కొన్న అతడు.. తన కెరీర్‌ నాశనం కావడానికి అదే ప్రధాన కారణమని వ్యాఖ్యానించాడు. పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిదిపై తీవ్ర విమర్శలనూ గుప్పించాడు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డానిష్ మాట్లాడాడు. ‘‘మనమంతా ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. పాకిస్థాన్‌లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడం బాగుంది. అక్కడ చాలా వివక్షను ఎదుర్కొన్నాం. ఇప్పుడు మన గళం విప్పుతున్నాం. నేను కూడా పాక్‌లో చాలాసార్లు వివక్షను అనుభవించా. నా కెరీర్‌ నాశనం అయింది. నాకు తగినట్లుగా గౌరవం పొందలేకపోయా. కారణం పాక్‌లో మైనారిటీలం కావడమే. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా. మనం పాక్‌లో అనుభవించిన కష్టాలు ఎలాంటివో అమెరికాకు తెలియాలి. అప్పుడే ఏదొక చర్యలు తీసుకోనేందుకు ఆస్కారముంటుంది’’ అని కనేరియా వెల్లడించాడు. పాకిస్థాన్‌ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, షాహిద్‌ అఫ్రిది సారథిగా ఉన్నప్పుడు తనను మతం మారమని తరచూ ఒత్తిడి చేసేవాడని కనేరియా తెలిపాడు. ‘‘ పాక్‌ కోసం నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించా. నాకు మద్దతుగా నిలిచిన ఏకైక కెప్టెన్ ఇంజమామ్‌ ఉల్ హక్ మాత్రమే. షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది సహా ఇతర ప్లేయర్లలో కొందరు తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారు. కనీసం నాతో కలిసి తినేవాళ్లూ కాదు. షాహిద్ అఫ్రిది అందరికంటే ఎక్కువగా నన్ను మతం మారమని ఒత్తిడి చేసేవాడు. చాలాసార్లు అడుగుతూనే ఉండేవాడు. ఇంజమామ్‌ మాత్రం అలాంటి టాపిక్‌ కూడా తీసుకొచ్చేవాడు కాదు’’ అని కనేరియా వ్యాఖ్యానించాడు.

* ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 17మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9మంది తలలపై రూ.24లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు దినేష్‌ మొడియం (36), అతడి భార్య జ్యోతి తాటి అలియాస్‌ కళా మొడియం (32) ఉన్నట్లు తెలిపారు. దినేష్‌ తలపై రూ.8లక్షలు, జ్యోతిపై రూ.5లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు బీజాపూర్‌ సీనియర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు. అలాగే, ఏరియా కమిటీ సభ్యులు దుడ్ల కరంపై రూ.5లక్షలు, మరో ఆరుగురి తలలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు. వీరందరూ గంగలూరు ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో చురుగ్గా ఉన్నవారేనన్నారు. వీరి లొంగుబాటు వెనుక డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డు, బస్తర్‌ ఫైటర్స్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ వివరించారు.

* ఉక్రెయిన్‌- రష్యా యుద్ధానికి (Russia-Ukraine War) సంబంధించి అమెరికా ప్రతిపాదిత కాల్పుల విరమణ ఒప్పందంపై క్రెమ్లిన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది ఉక్రెయిన్‌కే అనుకూలంగా ఉందని, ఆ దేశ బలగాలకు తాత్కాలిక విరామం తీసుకునేందుకు అవకాశం లభిస్తుందని తెలిపింది. దీనిపై అధ్యక్షుడు పుతిన్‌ నిర్దిష్టమైన, వాస్తవిక అంచనాలు వేస్తారని (Kremlin) పేర్కొంది. రష్యా దీర్ఘకాలం శాంతిస్థాపనను కోరుకుంటోందని క్రెమ్లిన్‌ ప్రతినిధి యూరీ ఉషకొవ్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాని అన్నారు. మాస్కో ఆందోళనలు, ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

* ‘నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి, ప్రజలకు లాభం. కానీ, మంత్రి పదవి ఎప్పుడు వస్తుందనేది చెప్పలేను’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై స్పందించారు. ‘‘భువనగిరి ఎంపీ స్థానం కోసం నిద్రాహారాలు మాని గెలిపించా. స్పీకర్‌ కుర్చీని ఎవరూ ప్రశ్నించలేరు. జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ ఛైర్‌ను ప్రశ్నించడం సరికాదు. అసెంబ్లీలో అతిగా ప్రవర్తించారు, స్పీకర్‌ను అవమానించినందుకే ఆయనపై చర్యలు తీసుకున్నారు. మేము ఎవరినీ లక్ష్యంగా చేసుకోం.. తప్పు చేస్తే వదిలిపెట్టం’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

* గత ప్రభుత్వ హయాంలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి (Amaravati) ప్రాంత రైతుల వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు (BR Naidu) తెలిపారు. రైతు బిడ్డగా అండగా నిలిచానని.. కేసులు పెట్టినా వెనుకడుగు వేయలేదన్నారు. వెలగపూడిలో రాజధాని రైతు ఐకాస ఆధ్వర్యంలో బీఆర్‌ నాయుడుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

* గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధముందని.. ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి ట్రాప్‌లోనూ తాను పడనన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు దిల్లీ చేరుకున్న సందర్భంగా సీఎం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ (KCR) గవర్నర్‌ ప్రసంగానికి రావడం కాదని.. అసెంబ్లీలో చర్చకు హాజరుకావాలన్నారు. డీలిమిటేషన్‌.. లిమిటేషన్‌ ఫర్‌ సౌత్‌ అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. ఆయా అంశాలు సాధించుకురావాలనే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z