Politics

ఎమ్మెల్సీ తాతా మధుపై స్పీకర్ అసహనం-NewsRoundup-Mar 15 2025

ఎమ్మెల్సీ తాతా మధుపై స్పీకర్ అసహనం-NewsRoundup-Mar 15 2025

* కేసీఆర్‌ మీద అక్కసుతో ఆయనకు సరైన ఛాంబర్‌ కూడా కేటాయించలేదని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష నాయకుడు సూచించిన వారినే పీఏసీ ఛైర్మన్‌గా నియమించడం ఆనవాయితీ. ఈ విషయంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆనవాయితీని తుంగలో తొక్కింది. ప్రతిపక్ష నేతను సంప్రదించకుండానే పీఏసీ ఛైర్మన్‌ను నియమించారు.

* హాస్యనటుడు సప్తగిరి (Sapthagiri) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెళ్ళి కాని ప్రసాద్‌’ (Pelli Kani Prasad). అభిలాష్‌ రెడ్డి దర్శకుడు. ప్రియాంక శర్మ హీరోయిన్‌. మార్చి 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న సప్తగిరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది హీరోయిన్స్‌ ఈ కథను రిజెక్ట్‌ చేశారని అన్నారు. సప్తగిరి కమెడియన్‌.. కాబట్టి, ఆయన పక్కన మేము యాక్ట్‌ చేయమన్నారని ఆయన తెలిపారు.

* అస్సాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా నిర్బంధాలను ఎదుర్కొన్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు నిర్వహించిన ఆందోళన కారణంగా తనని జైల్లో పెట్టారని, తనపట్ల కఠినంగా వ్యవహరించారని పేర్కొన్నారు. డెర్గావ్‌లోని లచిత్‌ బర్ఫుకాన్‌ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం తన విద్యార్థి జీవితాన్ని అమిత్‌ షా గుర్తు చేసుకున్నారు. ‘‘అస్సాంలో హితేశ్వర్‌ సైకియా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఆందోళన నిర్వహించాం. అప్పట్లో నన్ను 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. నా పట్ల కఠినంగా వ్యవహరించారు. నాపై భౌతికంగా దాడి చేశారు కూడా’’ అని అమిత్‌ షా అన్నారు. సైకియా అస్సాంకు కాంగ్రెస్‌ తరఫున రెండు పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

* భారాస అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ (KCR) అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘కేసీఆర్‌ శాసనసభకు వచ్చింది రెండు సార్లు మాత్రమే. శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్న జీత భత్యాలు రూ.57,84,124. డిసెంబరు 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు.. దాదాపు 15 నెలలుగా జీత భత్యాల రూపంలో ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది. శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఆయన మాత్రం రెండు సార్లే అసెంబ్లీకి వచ్చారు. నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదు. ప్రజా సమస్యలపై చట్ట సభల్లో ప్రస్తావించిన సందర్భాలు లేవు. కొవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. రాజకీయాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం.. వర్క్‌ ఫ్రమ్‌ ఫామ్‌ హౌస్‌ వంటిది ఏమైనా ఉందా? వారి బాధ్యతలు నెరవేర్చడం లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

* నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. 2021లో వైకాపా నుంచి మనోహర్‌నాయుడు మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు, మేయర్‌ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరో వైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో.. ఆరు స్థానాల్లో తెదేపా, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైకాపా నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. ఈనెల 17న స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మనోహర్‌ తన పదవికి రాజీనామా చేశారు.

* తెలంగాణ శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా గళమెత్తాలన్నారు. సభలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మాట్లాడాలనుకునే అంశాన్ని ముందుగానే నిర్ణయించుకొని.. ఎవరు ఏ అంశంపై మాట్లాడాలో ప్లాన్‌ చేసుకొని అసెంబ్లీలో మాట్లాడే విధంగా సన్నద్ధం కావాలని కిషన్‌ రెడ్డి సూచించారు.

* కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనలను లక్ష్యంగా చేసుకుని భాజపా (BJP) మరోసారి విమర్శలు గుప్పించింది. కొంతకాలంగా ఆయన తరచూ వియత్నాం (Vietnam)కు వెళ్తున్నారని.. ఒక్కసారిగా ఆ దేశం పట్ల అంత అనురాగం ఎందుకు కలిగిందని ప్రశ్నించింది. సొంత నియోజకవర్గంలో కన్నా వియత్నాంలోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియా సమావేశంలో విమర్శించారు. ‘‘రాహుల్‌ గాంధీ ఎక్కడ ఉన్నారు? వియత్నాం వెళ్లారని విన్నాను. తన సొంత నియోజకవర్గం (రాయ్‌బరేలీ)లోనూ ఆయన ఇన్ని రోజులు ఉండటం లేదు. తరచూ ఆ దేశాన్ని సందర్శిస్తుండటం ఆసక్తికరంగా ఉంది. నూతన ఏడాది సమయంలోనూ వియత్నాంలో ఉన్నారు. దాదాపు 22 రోజులు అక్కడ గడిపారు. ఆ దేశం పట్ల హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పాలి’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఆయన భారత్‌లో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

* టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 128 సంవత్సరాల తర్వాత 2028లో లాస్‌ఏంజిల్స్‌లో జరగనున్న ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారు. ఒకవేళ టీమ్‌ఇండియా అప్పుడు ఫైనల్‌కు చేరుకుంటే టీ20ల్లో తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకుంటానేమో అని కోహ్లీ అన్నాడు. ‘2028 ఒలింపిక్స్‌లో టీమ్ఇండియా ఫైనల్‌కు చేరుకుంటే… నేను ఆ ఒక్కమ్యాచ్‌ ఆడేందుకోసమైనా టీ20ల్లో నా రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకుంటాను. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అద్భుతమే కదా’ అని ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్లో విరాట్‌ కోహ్లీ మాట్లాడాడు. కోహ్లీ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ప్రపంచంలోకెల్లా ఫిట్టెస్ట్‌ క్రికెటర్‌. అయితే విరాట్‌ కెరీర్‌ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉండేవాడు. ఫిట్‌నెస్‌ సాధించడానికి తనను ప్రేరేపించిన అంశాల గురించి విరాట్‌ వివరించాడు. ‘క్రికెట్‌లో కొన్ని కఠినమైన టూర్ల తర్వాత నాకు ఫిట్‌గా మారాలనే ఆలోచన వచ్చింది. కానీ ఈ విషయంలో మా అమ్మను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె నేను అనారోగ్యంగా కనిపిస్తున్నా అనుకుంది. కానీ ఈ ప్రపంచం నాకు ఫిట్‌నెస్‌ మీద ఉన్న శ్రద్ధ గురించి మాట్లాడుకుంటోందని వివరించా. నేనేం అనారోగ్యంగా లేనని మా అమ్మకు నచ్చజెప్పా’ అన్నాడు.

* కోకాపేటలో ఉన్న జీఏఆర్‌ భవనంలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన సహోద్యోగులు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

* రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వర కల్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. వైకుంఠవాసుడి కల్యాణం కోసం నవ్యనగరి అమరావతి ఆధ్యాత్మిక సొబగులద్దుకుంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ ప్రాంగణం వద్ద తిరుమల ఆలయ నమూనా గోపురాలతో విశాలమైన వేదిక ఏర్పాటు చేశారు. విద్యుత్తు దీపాలు, పుష్పాలు, పచ్చటి తోరణాలు, దశావతారాల కటౌట్లతో ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. రాజధాని పరిధిలోని 24 గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రికను అందజేసి.. స్వామివారి కల్యాణానికి ఆహ్వానించారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే వారి కోసం అధికారులు 300 బస్సులు కూడా ఏర్పాటు చేశారు.

* ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరి కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో ఈ రెండు అంశాలు దోహదపడవన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాను. ఎన్‌ఈపీ-2020 (NEP-2020) స్వయంగా హిందీని అమలు చేయలేదు. హిందీ భాష అమలు విషయంలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్‌ఈపీ-2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలు (మాతృ భాషతో పాటుగా) నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. హిందీ వద్దనుకుంటే వారి మాతృ భాషతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ… ఇలా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు.

* గత కొన్ని రోజులుగా ‘భూ భారతి’ (Bhubharathi) పేరుతో తనపై సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తీవ్ర అసహనానికి గురయ్యారు. భూభారతిని తీసుకొచ్చి పేదల భూములను పేదలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నందుకు తనపై కోపం పెంచుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. అసలు తనపై అక్కసు వెళ్లగక్కాల్సిన అవసరం ఏమొచ్చిందని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ‘‘పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో పెడుతున్నారు. వాళ్లు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెడితే పోలీసులు కేసు పెట్టారు. వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన భాషను ఒకసారి చూడండి. అసలు జర్నలిస్టు అంటే ఎవరు?అని ఈ సందర్భంగా నేను అడగాలనుకుంటున్నా. ఎవరు పడితే వాళ్లు ఒక ట్యూబ్‌ (ఛానెల్‌) పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా? వాళ్లు వాడే భాష చూస్తే రక్తం మరిగిపోతోంది. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. కుటుంబసభ్యులను అంతేసి మాటలు అంటుంటే.. అసలు మీరు మనుషులేనా? మీకు భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో.. చెల్లినో.. భార్యనో.. ఈ రకంగా మాట్లాడితే నువ్వు వింటావా?’’

* శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ‘ఏందయ్యా నీ లొల్లి.. రోజూ న్యూసెన్స్‌ చేస్తున్నావ్‌..’ అంటూ గద్దింపు ధోరణిలో మాట్లాడారు. సాటి సభ్యుల ముందు తాతా మధును అగౌరవపరిచారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తీరును బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుపట్టింది. సభలో ఛైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి తమ సభ్యుడిని ఉద్దేశించి న్యూసెన్స్‌ అనే పదం వాడటం కరెక్టు కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై ఆమె మండలిలో మాట్లాడుతూ.. సభలో మా సభ్యుడిని ఉద్దేశించి మీరు న్యూసెన్స్‌ అనే పదం వాడారని, తాను మీకు చెప్పేందుకు పెద్దదాన్ని కాదని, ఆ పదాన్ని దయచేసి రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.

* ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్(ISIS) గ్లోబ‌ల్ ఆప‌రేష‌న్స్ చీఫ్ అబ్ద‌ల్లా మ‌క్కి ముస్లి అల్ రిఫాయి .. అమెరికా నిర్వ‌హించిన వైమానిక దాడిలో హ‌త‌మ‌య్యాడు. అబ్ద‌ల్లా మ‌క్కిని అబూ ఖ‌దీజా అని కూడా పిలుస్తారు. ఇరాకీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌మాచారంతో అమెరికా వైమానిక ద‌ళం దాడి చేప‌ట్టింది. అబ్ద‌ల్లా మ‌క్కి.. ఐసిస్ గ్రూపులో రెండ‌వ స్థాయి కమాండెంట్‌గా ఉన్నాడు. మార్చి 13వ తేదీన జ‌రిగిన ఆ స్ట్ర‌యిక్‌లో మ‌రో ఐసిస్ ఉగ్ర‌వాది కూడా మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా మిలిట‌రీ అధికారుల ప్ర‌కారం.. అబూ ఖాదిజా .. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ‌కు చెందిన లాజిస్టిక్స్‌, ప్లానింగ్, ఫైనాన్షియ‌ల్ మేనేజ్మెంట్ చూసుకునేవాడు. డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా అబూ ఖాదిజా మృత‌దేహాన్ని ద్రువీక‌రించారు. అబూ ఖాదిజాను హ‌త మార్చిన అంశంపై ఇరాక్ ప్ర‌ధాని మొహ‌మ్మ‌ద్ షియా అల్ సుదానీ స్పందించారు. ఇరాక్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఖాదిజా మోస్ట్ డేంజ‌ర‌స్ ఉగ్ర‌వాది అని తెలిపారు. అమెరికా స‌హ‌కారంతో ఆప‌రేష‌న్ స‌క్సెస్‌ఫుల్‌గా చేప‌ట్టిన‌ట్లు ఇరాక్ ప్ర‌ధాని వెల్ల‌డించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z