* ముందుచూపుతో ఎనిమిదేళ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లను (Sovereign gold bonds) కొనుగోలు చేసినవారికి జాక్‌పాట్. 2016-17 సిరీస్ IV బాండ్లకు సంబంధించిన రిడెంప్షన్ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ప్రకటించింది. మార్చి 17ను మెచ్యూర్ తేదీగా నిర్ణయించింది. దీంతో అప్పట్లో పెట్టుబడులు చేసిన వారు దాదాపు మూడింతలు లాభం పొందనున్నారు. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఆర్‌బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లు. 2017లో మార్చిలో జారీ చేసిన నాలుగో విడత బాండ్లకు మెచ్యూరిటీ ధరను తాజాగా ఆర్‌బీఐ ప్రకటించింది. అప్పట్లో గ్రాము రూ.2,943 చొప్పున బాండ్లు జారీ చేయగా.. తాజా ధరను రూ.8624గా పేర్కొంది. అంటే అప్పట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు లభిస్తుంది. దీనికి గోల్డ్ బాండ్లపై ఇచ్చే వడ్డీ అదనం. ఏటా 2.50 శాతం నామమాత్ర వడ్డీని బాండ్ల కొనుగోలుపై ఆర్‌బీఐ చెల్లిస్తుంది.
* సిమెంట్ కంపెనీల మధ్య పోటీ కారణంగా గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ధరలు.. రాబోయే రోజుల్లో ప్రియం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజాలపై పన్ను విధించేందుకు సిద్ధమవుతుండడమే దీనికి కారణం. దీంతో సిమెంట్ ధరలకు రెక్కలు రాబోతున్నాయని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ సంస్థ పేర్కొంది. ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈనేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్ తయారీలో వినియోగించే సున్నపురాయి మైనింగ్‌పై టన్నుకు రూ.160 చొప్పున వసూలుచేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ కొత్త పన్ను అమల్లోకి రానుంది. కర్ణాటక కూడా ఇదేతరహా నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. మిగిలిన రాష్ట్రాలు ఇలాగే ఆలోచన చేయొచ్చని జేఎం ఫైనాన్షియల్ చెబుతోంది.
* ప్రపంచ స్టాక్ మార్కెట్లలో దిగ్గజ మదుపరి వారెన్ బఫెట్ పంథా వేరు. ఆయన పెట్టుబడుల క్రమాన్ని అనుకరించి, కోటీశ్వరులైన వారి సంఖ్య కోకొల్లలు. అటువంటి వారెన్ బఫెట్ కొంతకాలం క్రితం యాపిల్ కంపెనీ షేర్లను భారీగా విక్రయించి, నగదుగా అట్టేపెట్టుకున్నారు. ప్రస్తుతం బఫెట్ సంస్థల్లో నగదు నిల్వలు 325 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.28 లక్షల కోట్లు)గా ఉన్నాయి. ఈ స్థాయిలో నగదును ఉంచేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే గత 3 వారాల్లో అమెరికా స్టాక్ మార్కెట్ పతనమై 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.435 లక్షల కోట్ల) సంపద ఆవిరైంది. ఇది చూశాక ‘అమెరికా స్టాక్ మార్కెట్ ఒడుదొడుకుల పరిస్థితిని బఫెట్ ముందుగానే ఊహించారు. అందుకే స్టాక్స్ విక్రయించి, నగదు అట్టేపెట్టుకున్నారు. తక్కువ విలువల్లో మెరుగైన స్టాక్స్ కొనేందుకు మళ్లీ సిద్ధమవుతారు’ అనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్నాయి.
* ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఇండస్ ఇండ్ (IndusInd Bank) ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. బ్యాంక్‌పై వస్తున్న ఊహాజనిత కథనాలకు డిపాజిటర్లు స్పందించవద్దని సూచించింది. బ్యాంక్‌కు చెందిన డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించడంతో స్టాక్‌మార్కెట్లలో బ్యాకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిపాజిటర్లు ఆందోళనకు గురికాకుడదన్న ఉద్దేశంతో ఈ ప్రకటన విడుదల చేసింది.
* అంతర్జాతీయంగా చిప్ తయారీలో దిగ్గజాలుగా ఉన్న సంస్థలు భారత్‌పై దృష్టి సారించాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, వాహన తయారీ మరింత పెంచేందుకు బహుళజాతి – దేశీయ సంస్థలు సన్నాహాలు చేస్తున్న తరుణంలో, చిప్‌లకు అమిత గిరాకీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా చిప్ తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జర్మనీకి చెందిన సెమీకండక్టర్ సంస్థ ఇన్ఫినియోన్, అమెరికాకు చెందిన చిప్ సరఫరా సంస్థ ఆన్‌సెమీ.. భారత కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని, ఇక్కడ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ (ఓఎస్‌ఏటీ) సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక ఆంగ్ల వార్తా పత్రిక పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z